CharDham Yatra: చార్‌ధామ్ యాత్ర.. 12 రోజుల్లో 31 మంది మృతి

ఈ నెలలో ప్రారంభమైన ఉత్తరాఖండ్‌లోని చార్‌ధామ్ యాత్రలో భాగంగా 31 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు.

Updated : 14 May 2022 17:04 IST

కారణాలు చెప్పిన వైద్యులు

దేహ్రాదూన్‌: ఈ నెలలో ప్రారంభమైన ఉత్తరాఖండ్‌లోని చార్‌ధామ్ యాత్రలో భాగంగా 31 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. బీపీ, గుండెనొప్పి, మౌంటైన్ సిక్‌నెస్ వంటి వాటితో వీరు చనిపోయారు. ఈ విషయాన్ని ఉత్తరాఖండ్‌ డైరెక్టర్ జనరల్ హెల్త్ డాక్టర్ శైలజా భట్ మీడియాకు వెల్లడించారు. 

‘చార్‌ధామ్‌ యాత్ర ప్రారంభించిన 12 రోజుల్లో 31 మంది యాత్రికులు, బద్రినాథ్ స్థానికులు ఒకరు మృతి చెందారు. వారంతా బీపీ, గుండెపోటు, మౌంటైన్ సిక్‌నెస్ కారణంగా చనిపోయారు’ అని భట్ వెల్లడించారు. ఈ పరిణామాలతో రాష్ట్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఆరోగ్యంగా ఉన్నవారినే తీర్థయాత్రలకు అనుమతించే విధంగా వైద్య పరీక్షలు ప్రారంభించింది. అందుకోసం యాత్ర ప్రారంభ మార్గాల్లో వైద్య శిబిరాలను ఏర్పాటు చేసింది. అనారోగ్యంగా తేలినవారికి విశ్రాంతి తీసుకోవాలి, కోలుకున్న తర్వాతే ముందుకు వెళ్లాలని వైద్యులు సూచిస్తున్నారు. 

మే 3న ఈ చార్‌ధామ్ యాత్ర ప్రారంభమైంది. ప్రసిద్ధ శివాలయం కేదార్‌నాథ్‌ను మే 6న తిరిగి తెరిచారు. బద్రినాథ్ ఆలయం మే 8న తెరుచుకుంది. కాగా, ఈ సారి భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్ ధామీ వీఐపీ దర్శనానికి ముగింపు పలికారు. గత రెండేళ్లుగా కరోనా మహమ్మారి కారణంగా చార్‌ధామ్‌ యాత్ర నిలిచిపోయింది. దాంతో ఈ సారి రద్దీ ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈసారి ఇప్పటికే మూడు లక్షల మంది చార్‌ధామ్‌ను సందర్శించినట్లు అధికారులు తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని