Gold Smuggling: ఆపరేషన్‌ గోల్డ్‌.. నడి సంద్రంలో 32 కేజీల బంగారం సీజ్‌

శ్రీలంక నుంచి భారత్‌కు సముద్ర మార్గంలో అక్రమంగా తరలిస్తోన్న 32.6 కిలోల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో ఓ ఘటనలో నిందితులు సముద్రంలో విసిరేసిన 11 కిలోల బంగారాన్ని అధికారులు వెలికితీయడం గమనార్హం.

Updated : 01 Jun 2023 22:21 IST

చెన్నై: తమిళనాడులో భారీగా బంగారం పట్టుబడింది. గుర్తుతెలియని కొందరు వ్యక్తులు రెండు పడవల్లో శ్రీలంక (Sri Lanka) నుంచి భారత్‌కు సముద్ర మార్గంలో బంగారాన్ని అక్రమంగా తరలిస్తుండగా (Gold Smuggling).. ఒక్కసారిగా అధికారులు ప్రత్యక్షమయ్యారు. దీంతో ఓ పడవలోని స్మగ్లర్లు తమ వద్ద ఉన్న 11 కిలోల బంగారాన్ని సముద్రంలో విసిరేశారు. అయితే.. భారత కోస్ట్‌ గార్డ్, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI), కస్టమ్స్ సిబ్బంది కలిసి రెండు రోజులపాటు ఆపరేషన్‌ నిర్వహించి ఆ పసిడిని స్వాధీనం చేసుకున్నారు. మరో పడవలో 21.2 కిలోల బంగారం గుర్తించి పట్టుకున్నారు.  ఈ రెండు ఘటనల్లో మొత్తం రూ.20 కోట్లకుపైగా విలువైన 32.6 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు డీఆర్‌ఐ ఓ ప్రకటనలో వెల్లడించింది.

కొంతమంది స్మగ్లర్లు పెద్దఎత్తున బంగారాన్ని శ్రీలంక నుంచి భారత్‌కు అక్రమంగా తరలిస్తున్నట్లు డీఆర్‌ఐ అధికారులకు సమాచారం అందింది. ఈ మేరకు నిఘా పెట్టగా.. తమిళనాడులోని మండపం ఫిషింగ్‌ హార్బర్‌ ప్రాంతంలో రెండు బోట్ల కదలికలు అనుమానాస్పదంగా ఉన్నట్లు గుర్తించారు. వాటిని వెంబడించగా.. తప్పించుకునే క్రమంలో ఓ పడవలోని ముగ్గురు స్మగ్లర్లు తమ వద్ద ఉన్న 11.6 కిలోల బంగారు కడ్డీలను సముద్రంలో పారేశారు. చివరకు వారిని అదుపులోకి తీసుకున్న అధికారులు.. ప్రత్యేక ఆపరేషన్‌లో భాగంగా డైవర్లను రంగంలోకి దించి సముద్రంలో పారేసిన బంగారాన్ని వెలికితీశారు. మరో పడవలో 21 కిలోలకు పైగా బంగారాన్ని స్వాధీనం చేసుకుని, ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని