Maharashtra Crisis: రెబల్‌ ఎమ్మెల్యేల కోసం 7 రోజులకు 70 రూమ్‌లు.. రోజుకు ఎంత ఖర్చో తెలుసా!

శివసేన రెబల్ ఎమ్మెల్యేల కోసం ఫైవ్‌ స్టార్ హోటల్లో 7 రోజులకుగాను 70 రూమ్‌లను బుక్‌ చేశారని..    

Published : 24 Jun 2022 01:55 IST

గుహవాటి: మహారాష్ట్ర రాజకీయాలు (Maharashtra Crisis) ఆసక్తికరంగా మారాయి. ఏ క్షణంలో ప్రభుత్వం కూలిపోతుందో తెలీని పరిస్థితి నెలకొంది. ఉద్ధవ్‌ ఠాక్రే (uddhav thackeray) ప్రభుత్వంపై తిరుగుబావుటా ఎగరవేసిన శివసేన సీనియర్‌ నేత ఏక్‌నాథ్‌ శిందే (Eknath Shinde), తన అనుచర ఎమ్మెల్యేలతో కలిసి అసోంకి మకాం మార్చారు. దాదాపు 40 మంది ఎమ్మెల్యేలు తనకు మద్దతుగా ఉన్నారని చెబుతున్న శిందే.. వారి కోసం గుహవాటిలో ఉన్న ఓ విలాసవంతమైన హోటల్‌ను బుక్‌ చేశారు. తాజాగా ఈ హోటల్‌కు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ఉద్ధవ్‌ ఠాక్రేపై తిరుగుబాటుకు దిగిన రెబల్‌ ఎమ్మెల్యేలు తొలుత గుజరాత్‌లోని సూరత్‌లో ఓ హోటల్లో ఉన్నారు. అక్కడి నుంచి గుహవాటిలోని రాడిసన్‌ బ్లూ హోటల్‌కు మారారు. ఈ ఫైవ్‌ స్టార్ హోటల్లో 7 రోజులకు గాను 70 రూమ్‌లను బుక్‌ చేసినట్లు తెలిసింది. 7 రోజులకు వీటి ఖర్చు రూ. 56 లక్షలు కాగా,  వీటికి అదనంగా ఆహారం, ఇతర సేవలన్నీ కలుపుకొని ఒక్క రోజుకు రూ.8 లక్షల చొప్పున ఖర్చు అవుతుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. 

రాడిసన్‌ బ్లూ హోటల్లో మొత్తం 196 గదులు ఉన్నాయని తెలిసింది. రెబల్‌ ఎమ్మెల్యేల కోసం బుక్‌ చేసిన 70 గదులు పోగా.. ఇంతకుముందే బుక్‌ అయిన రూమ్స్‌ మాత్రమే ఉన్నాయి. అయితే, వీటిని మినహాయించి కొత్తగా రూమ్‌ బుకింగ్‌ సౌకర్యాన్ని యాజమాన్యం నిలిపివేసినట్లు సమాచారం. అలాగే బాంక్వెట్‌ కూడా మూసివేశారని.. హోటల్లో బస చేసే వారికి మినహా బయటి వారిని రెస్టారెంట్‌లోకి  అనుమతించట్లేదని తెలుస్తోంది. హోటల్ ఖర్చులే కాకుండా ఎమ్మెల్యేలంతా ఛార్టెడ్‌ విమానంలో ఇక్కడికి వచ్చారని మొన్న వార్తలు వెలువడ్డాయి. మరి వీరి ట్రాన్స్‌ఫోర్ట్‌కు ఏ మేరకు ఖర్చు అయ్యిందనేది తెలియరాలేదు. అలాగే ఈ ఖర్చంతా ఎవరు భరిస్తున్నారు అనే దానిపైనా స్పష్టత రాలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని