15రోజుల్లో 872మరణాలు.. దిల్లీకి ఏమైంది?

దిల్లీలో కరోనా వైరస్‌ కల్లోలం కొనసాగుతోంది. గడిచిన 15 రోజుల్లో దేశ రాజధాని నగరంలో 870కి పైగా మరణాలు నమోదు కావడం కలవరపెడుతోంది. అకస్మాత్తుగా కేసులు పెరగడానికి గాలిలో నాణ్యత క్షీణించడం, ప్రజలు భద్రతా ప్రమాణాలు పాటించడంలో ప్రజలు నిర్లక్ష్య ధోరణులే కారణమని వైద్య నిపుణులు విశ్లేషిస్తున్నారు. అక్టోబర్‌ 28 నుంచి రోజువారీగా 5వేలు చొప్పున కొత్త కేసులు నమోదవుతున్నప్పటికీ నిన్న ఒక్కరోజే ఆ సంఖ్య 8వేల మార్కును............

Published : 12 Nov 2020 19:29 IST

దిల్లీలో కల్లోలం సృష్టిస్తున్న కరోనా

వైద్య నిపుణులు చెబుతున్న కారణాలివే..

ఇంటర్నెట్‌ డెస్క్‌: దిల్లీలో కరోనా వైరస్‌ కల్లోలం కొనసాగుతోంది. గడిచిన 15 రోజుల్లో దేశ రాజధాని నగరంలో 870కి పైగా మరణాలు నమోదు కావడం కలవరపెడుతోంది. అకస్మాత్తుగా కేసులు పెరగడానికి గాలిలో నాణ్యత క్షీణించడం, ప్రజలు భద్రతా ప్రమాణాలు పాటించడంలో ప్రజలు నిర్లక్ష్య ధోరణులే కారణమని వైద్య నిపుణులు విశ్లేషిస్తున్నారు. అక్టోబర్‌ 28 నుంచి రోజువారీగా 5వేలు చొప్పున కొత్త కేసులు నమోదవుతున్నప్పటికీ నిన్న ఒక్కరోజే ఆ సంఖ్య 8వేల మార్కును దాటేయడం కలకలం రేపుతోంది. ఇప్పటివరకు ఇంత భారీ సంఖ్యలో దిల్లీలో కేసులు నమోదుకావడం ఇదే ప్రథమం. అక్టోబర్‌ 28 నుంచి నవంబర్‌ 11 వరకు దేశ రాజధాని నగరంలో 90,572 కేసులు, 872 మరణాలు నమోదైనట్టు ప్రభుత్వం విడుదలచేసిన గణాంకాలు పేర్కొంటున్నాయి. గత రెండు రోజులుగా 80కి పైగా మరణాలు నమోదుకావడం అక్కడి పరిస్థితి తీవ్రతకు నిదర్శనం. బుధవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 85మంది ప్రాణాలు కోల్పోవడంతో మొత్తం మృతుల సంఖ్య 7228కి పెరిగింది. జూన్‌ 16న దిల్లీలో అత్యధికంగా ఒక్కరోజులో 93మంది మరణించిన విషయం తెలిసిందే.  

ముఖ్య కారణాలివే.. 

బుధవారం ఒక్కరోజే దిల్లీలో 8593 కొత్త కేసులు నమోదవ్వడంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 4.59లక్షలకు పెరిగింది. కరోనా కేసులు, మరణాలు భారీగా నమోదుకావడానికి కారణాలను వైద్య రంగ నిపుణులు విశ్లేషించారు. పండుగ సీజన్‌ కావడంతో జనం భారీ సంఖ్యలో తిరగడం, రోగుల్లో దీర్ఘకాలిక రోగ లక్షణాలు ఉండటం, పెరుగుతున్న కాలుష్యంతో ఆరోగ్యపరమైన ఇబ్బందులు, మార్కెట్లు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో భద్రతా నిబంధనలను పాటించడంలో ప్రజలు నిర్లక్ష్యంగా ఉండటమే గత రెండు వారాలుగా దిల్లీలో కరోనా కేసులు, మరణాలు పెరగడానికి కారణమని పేర్కొంటున్నారు.  

కాలుష్య స్థాయి పెరగడం..

దిల్లీలో రోజువారీ కేసులు పుంజుకోవడంతో పాటుగా మరణాల సంఖ్య కూడా అదే స్థాయిలో పెరుగుతోందని సర్‌ గంగారాం ఆస్పత్రి ఛైర్మన్‌ ఎస్‌పీ బయోట్రా తెలిపారు. నగరంలో కాలుష్యం స్థాయి పెరగడంతో శ్వాస సంబంధమైన ఇబ్బందులు ఉన్నవారి ఆరోగ్య పరిస్థితి మరింత క్లిష్టతరమవుతోందన్నారు. పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే రోగులు తీవ్ర అనారోగ్యంతో దిల్లీకి వస్తున్నారని తెలిపారు. దీనికితోడు ఎక్కువమంది ప్రజలు మాస్క్‌లు ధరించకుండా బాధ్యతారాహిత్యంతో వ్యవహరించడం కూడా ఇందుకు మరో కారణమని అభిప్రాయపడ్డారు. 

ఇంతలా పెరుగుతాయనుకోలేదు.. 

దిల్లీలో కరోనాతో మరణించిన వారిలో ఎక్కువ మంది 60 నుంచి 70 ఏళ్లకు పైబడినవారే ఉంటున్నట్టు  రాజీవ్‌ గాంధీ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి మెడికల్‌ డైరెక్టర్‌ బీఎస్‌ షెర్వాల్‌ తెలిపారు. ఎక్కువమంది రోగుల్లో కోమార్బిడ్‌ కండిషన్ (దీర్ఘకాలిక రోగ లక్షణాలు)‌ ఉన్నవారే ఎక్కువని పేర్కొన్నారు. కరోనా బారినపడిన రోగుల్లో డయాబిటిస్‌, హైపర్‌ టెన్షన్‌ వంటివి ఉండటంతో మరణాలకు దారితీస్తున్నాయని తెలిపారు. పండగ షాపింగ్‌ కోసం మార్కెట్లకు వచ్చే వారిలో ఎక్కువ మంది మాస్క్‌లు ధరించడంలేదని, పరిస్థితి సాధారణంగా ఉన్నట్టుగానే ప్రవర్తిస్తున్నారని తెలిపారు. పండగ సీజన్‌లో కరోనా కేసులు పెరుగతాయని అంచనా వేసినప్పటికీ.. ఇంత అకస్మాత్తుగా పెరుగతాయనుకోలేదన్నారు. నవంబర్‌ మధ్య నాటికే 8వేల మార్కును దాటేసిందని తెలిపారు. ఈ అత్యవసర పరిస్థితిని ప్రజలు అర్థం చేసుకుంటారని, కరోనాపై పోరాటంలో బాధ్యతతో వ్యవహరిస్తారని భావిస్తున్నట్టు చెప్పారు.  

మాస్క్‌ల్లేవ్‌.. భౌతికదూరం మాయం

దిల్లీలో మరణాల సంఖ్య పెరగడం చూస్తున్నాం.. గానీ ఈ రేటు ఇప్పటికీ నియంత్రణలోనే ఉందని మ్యాక్స్‌ హెల్త్‌ కేర్‌ గ్రూప్‌ మెడికల్‌ డైరెక్టర్‌ సందీప్‌ బూదిరాజా అన్నారు. ఇది యూరప్‌, అమెరికా లాంటి దేశాల్లో నమోదైన వాటితో పోలిస్తే ఇది తక్కువేనని తెలిపారు. దిల్లీలో అధికంగా టెస్ట్‌లు జరుగుతున్నాయని, అందుకే ఎక్కువ పాజిటివ్‌ కేసులు, మరణాలు నమోదవుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. పండుగ సీజన్‌కు తోడు ప్రజలు భౌతికదూరం పాటించడం మానేశారని, మాస్క్‌లు ధరించడాన్ని కూడా అంత సీరియస్‌గా పరిగణించడంలేదని తెలిపారు. దీనికి తోడు చల్లని వాతావరణం కారణంగా సహజంగానే వైరస్‌ వ్యాప్తి పెరుగుతుందన్నారు.

యువతతో ఇంట్లో వాళ్లకు ముప్పు

కొవిడ్‌ నిబంధనల ఉల్లంఘిస్తే చలాన్లు విధిస్తున్నప్పటికీ దిల్లీలో చాలా మంది యువత మాస్క్‌ల్లేకుండా బహిరంగంగా తిరుగుతున్నారని ఫోర్టీస్‌ ఆస్పత్రి పల్మనాలజీ వైద్యురాలు రిచా షరీన్‌ అన్నారు. యువతలో రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉండటంతో వారి తల్లిదండ్రులు, ఇంట్లో వృద్ధులకు ఈ వైరస్‌ సోకే ముప్పు ఎక్కువగా ఉంటుందని హెచ్చరించారు. కాలుష్య స్థాయిలు పెరుగుతున్న వేళ వారికి శ్వాస సంబంధమైన సమస్యలు ఉన్నట్టయితే మరింత ఆందోళనకర పరిస్థితి ఎదురవుతుందని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని