పశ్చిమ బెంగాల్లో ఉపాధ్యాయ నియామకాల రద్దు నిలిపివేత

సార్వత్రిక ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి, టీఎంసీ ఛైర్‌పర్సన్‌ మమతా బెనర్జీకి భారీ ఉపశమనం లభించింది.

Published : 08 May 2024 05:56 IST

సీబీఐ దర్యాప్తు కొనసాగింపునకు అనుమతి
అరెస్టులు చేయవద్దని స్పష్టం చేసిన సుప్రీంకోర్టు
ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హర్షం

దిల్లీ: సార్వత్రిక ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి, టీఎంసీ ఛైర్‌పర్సన్‌ మమతా బెనర్జీకి భారీ ఉపశమనం లభించింది. ఆమె ప్రభుత్వం చేపట్టిన 25వేల మందికి పైగా ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇటీవల ఇచ్చిన ఆదేశాలను సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం తాత్కాలికంగా నిలిపివేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌ జె.బి.పార్దీవాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్ర ధర్మాసనం ఈ మేరకు స్టే ఉత్తర్వులు వెలువరించింది. నియామకాల కుంభకోణంపై దర్యాప్తును కొనసాగించుకోవచ్చని సీబీఐకి తెలిపింది. దీనికి సంబంధించి రాష్ట్ర మంత్రులను ప్రశ్నించవచ్చని పేర్కొంది. అయితే, దర్యాప్తు సమయంలో నిందితుల అరెస్టు వంటి చర్యలకు దిగవద్దని సూచించింది. ప్రభుత్వ నియామకాలు అక్రమమని తేలితే ఉద్యోగాలు పొందిన ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది ఇప్పటి వరకు వారు పొందిన జీత భత్యాలను తిరిగి చెల్లించాల్సిందేనని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. పశ్చిమ బెంగాల్లోని పాఠశాలల్లో 25,753 మంది ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బందిని నియమించడానికి నిర్వహించిన ఈ రిక్రూట్‌మెంట్‌ను వ్యవస్థీకృత మోసంగా ధర్మాసనం అభివర్ణించింది. సంబంధిత సమాచారం ప్రభుత్వం వద్ద లేకపోవడంపై విస్మయం వ్యక్తం చేసింది. ఆ సమాచారంతో కూడిన డిజిటల్‌ రికార్డులను నిర్వహించాల్సిన బాధ్యత రాష్ట్ర అధికారులదేనని స్పష్టం చేసింది. ప్రభుత్వ ఉద్యోగాలు అరుదుగా ఉన్న పరిస్థితుల్లో ఇటువంటి కుంభకోణాలు జరగడం శోచనీయమని, ప్రజల విశ్వాసాన్ని ఇది దెబ్బతీస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. పాఠశాల ఉద్యోగాల నియామకాలను కలకత్తా హైకోర్టు రద్దు చేయడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరుపుతూ సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ కేసు విచారణను జులై 16న ముగించనున్నట్లు తెలుపుతూ ఆ రోజుకు వాయిదా వేసింది.
నియామకాల రద్దు నిలిచిపోవడంపై రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హర్షం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. ‘చాలా ఆనందంగా ఉంది. మానసికంగా ఉపశమనం లభించింది’ అని సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’లో మమత పోస్ట్‌ చేశారు. ఉపాధ్యాయులకు అభినందనలు తెలిపారు.

నిరపరాధుల పేర్లను నేరచరిత్ర రికార్డుల్లో చేర్చకండి

వ్యక్తుల నేర చరిత్రను నమోదు చేసే ‘హిస్టరీ షీట్‌’ నిర్వహణలో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంత పోలీసులకు సర్వోన్నత న్యాయస్థానం కీలక ఆదేశాలిచ్చింది. నిర్దోషులు, సమాజంలోని అట్టడుగు వర్గాల ప్రజలు, నిరక్షరాస్యులను అన్యాయంగా, పక్షపాతంతో ఆ జాబితాలో చేర్చవద్దని స్పష్టం చేసింది. ఎస్సీ, ఎస్టీ, నిరుపేద వర్గాల ప్రజల పట్ల ఉండే చులకన భావనతోనూ వారిని అనవసరంగా వేధింపులకు గురిచేస్తున్న ఘటనలు అనేకం వివిధ అధ్యయనాల ద్వారా వెలుగు చూశాయని జస్టిస్‌ సూర్య కాంత్‌, జస్టిస్‌ కె.వి.విశ్వనాథన్‌ ధర్మాసనం మంగళవారం పేర్కొంది. హిస్టరీ షీట్‌/రౌడ్‌ షీట్‌ రికార్డులను యాంత్రికంగా నిర్వహించడం ఏమాత్రం తగదని హెచ్చరించింది. బ్రిటిష్‌ వలస పాలనా కాలంలో అనుసరించినట్లుగానే కొన్ని విముక్త జాతులకు సంబంధించిన వ్యక్తుల పేర్లను పోలీస్‌ డైరీలలో నమోదు చేస్తున్నారనే ఆరోపణలున్నాయని ధర్మాసనం తెలిపింది. పోలీసులు ఆయా వర్గాల ప్రజల పట్ల అన్యాయంగా, పక్షపాత ధోరణితో వేధింపులకు పాల్పడకుండా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలు తగిన నివారణ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. తమ ఆదేశాలను వెంటనే అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు పంపించాలని కోర్టు రిజిస్ట్రీకి సూచించింది. తాను దుష్ప్రవర్తన కలిగిన వ్యక్తినంటూ దిల్లీ పోలీసులు ప్రకటించడాన్ని సవాల్‌ చేస్తూ ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే అమానుల్లా ఖాన్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు విచారణ సందర్భంగా జస్టిస్‌ సూర్య కాంత్‌, జస్టిస్‌ కె.వి.విశ్వనాథన్‌ ధర్మాసనం హిస్టరీ షీట్‌ అంశమై ఈ ఆదేశాలు జారీ చేసింది. హిస్టరీ/రౌడీ షీట్‌లలో నమోదైన నిర్దోషులు, మైనర్ల వివరాలను ఎప్పటికప్పుడు తొలగించేలా చర్యలు తీసుకోవాలని దిల్లీ పోలీసులను ఆదేశించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు