
Fuel Price Hike: 95 శాతం భారతీయులకు పెట్రోలే అవసరం లేదు.. యూపీ మంత్రి వ్యాఖ్యలు
ఇంటర్నెట్ డెస్క్: దేశంలో రోజురోజుకు పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో సామాన్యులు కుదేలవుతోన్న విషయం తెలిసిందే. అయితే.. తాజాగా ఈ వ్యవహారంపై ఉత్తర్ప్రదేశ్ మంత్రి ఉపేంద్ర తివారీ చేసిన వ్యాఖ్యలు వివాదస్పదంగా మారాయి. ‘ఇంధన ధరల పెంపు విషయానికొస్తే అసలు 95 శాతం మంది భారతీయులకు పెట్రోలే అవసరం లేదు. కొద్దిమంది మాత్రమే కార్లు వినియోగిస్తున్నారు’ అని వ్యాఖ్యానించారు. ‘2014కు ముందు, ప్రస్తుత ఇంధన ధరలను పోల్చుతున్నారు. కానీ.. మోదీ ప్రభుత్వం వచ్చాక పౌరుల తలసరి ఆదాయం కూడ రెండింతలయింది కదా!’ అని పేర్కొనడం గమనార్హం. ప్రతిపక్షాలకు ప్రభుత్వాన్ని విమర్శించేందుకు వేరే ఏ సమస్య లేనందునే దీనిపై రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు.
‘తలసారి ఆదాయంతో పోల్చితే తక్కువే’
‘ప్రభుత్వం 100 కోట్లకు పైగా ప్రజలకు ఉచిత డోసులు ఇచ్చింది. కొవిడ్ చికిత్స అందించింది. ఇంటింటికీ మందులు పంపిణీ చేస్తోంది. ఆరోగ్య సంరక్షణ, విద్య తదితర రంగాల్లో ఉచిత సేవలు అందిస్తోంది. దీన్ని పరిగణనలోకి తీసుకుని చూస్తే ధరలు స్వల్ప మొత్తంలో మాత్రమే పెరిగాయ’ని తివారీ అన్నారు. తలసరి ఆదాయంతో పోల్చినట్లయితే.. ఇంధన ధరలు చాలా తక్కువేనని సమాధానం ఇచ్చారు. గతంలోనూ భాజపాకు చెందిన మంత్రులు, నాయకులు ఇంధన ధరల పెరుగుదలపై ఇదే విధంగా స్పందించిన విషయం తెలిసిందే. ఇటీవల పెట్రోలియం, సహజ వాయువు శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ తెలి సైతం.. ప్రభుత్వం ఉచితంగా అందిస్తోన్న కరోనా టీకాల కారణంగా చమురు ధరలు పెరుగుతున్నాయని వ్యాఖ్యానించారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.