Updated : 20/03/2020 13:19 IST

దోషుల పూర్వాపరాలు ఇవే..

దిల్లీ: యావత్తు దేశాన్ని కదిలించిన నిర్భయ అత్యాచార, హత్య కేసులో ఎట్టకేలకు న్యాయం జరిగింది. ఆ ఘోర ఉదంతాన్ని ప్రపంచం మొత్తం ముక్తకంఠంతో ఖండించింది. బాధితురాలికి న్యాయం జరగాలని ఆకాంక్షించింది. మరణ దండనే సరని.. అలా చేస్తేనే భవిష్యత్తులో ఇలాంటి ఘోరాలు జరగవని బలంగా మహిళా లోకం కోరుకుంది. ఈ క్రమంలో నిందితుల పైశాచికత్వాన్ని చెవులారా విన్న న్యాయస్థానం ప్రజల గొంతుకను ఆమోదించింది. వారికి ఉరి శిక్ష విధించింది. కానీ, దోషులు న్యాయవ్యవస్థనే అపహాస్యం పాల్జేసే ప్రయత్నం చేశారు. తమ నక్కజిత్తులతో మూడుసార్లు ఉరి వాయిదా పడేలా చేశారు. కానీ, చివరకు న్యాయమే గెలిచింది. వారి కుయుక్తులను పసిగట్టిన కోర్టు ఉరి విధించాల్సిందేనని తీర్పు వెలువరించింది. ఈరోజు ఉదయం 5:30 గంటలకు తిహాడ్‌ జైలులో నలుగురు దోషులు ఉరికంభం ఎక్కారు. దోషుల ఉరిపట్ల నిర్భయ తల్లిదండ్రులతో సహా యావత్తు దేశం హర్షం వ్యక్తం చేస్తోంది. 

డిసెంబరు 16, 2012న జరిగిన ఈ ఘటనలో మొత్తం ఆరుగురిని కోర్టు దోషులుగా తేల్చింది. వీరిలో ఒకరు మైనర్‌ కావడంతో మూడేళ్ల శిక్ష అనంతరం అతణ్ని విడుదల చేశారు. మరో వ్యక్తి రామ్‌ సింగ్‌ మధ్యలోనే ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక మిగిలిన నలుగురు తాజాగా ఉరికంభం ఎక్కిన ముకేశ్‌ సింగ్‌ (32), పవన్‌ గుప్త (25), వినయ్‌ శర్మ (26), అక్షయ్‌ ఠాకూర్ సింగ్‌ (31). వీరంతా దిల్లీలోని ఆర్‌.కె.పురం మురికివాడ ప్రాంత నివాసితులు. వీరిలో చాలా మంది చదువు మధ్యలో మానేసిన వారే.

అక్షయ్‌ ఠాకూర్‌.. బస్‌లో హెల్పర్‌

దోషుల్లో ఒకడైన అక్షయ్‌ ఠాకూర్‌ బిహార్‌కు చెందినవాడు. మధ్యలోనే చదువుమానేసిన ఇతడు 2011లో దిల్లీకి వలస వచ్చాడు. అతనికి భార్య.. ఒక కొడుకు ఉన్నారు. వారు బిహార్‌లోని స్వగ్రామంలోనే నివాసముంటున్నారు. నేరం జరిగిన రోజు తాను దిల్లీలోనే లేనంటూ అక్షయ్‌ తప్పించుకునే ప్రయత్నం చేశాడు. కానీ, అదంతా అబద్ధమని విచారణ స్పష్టమైంది. చివరకు ఇటీవల అతని భార్య విడాకులు కోరుకుంది. ఓ అత్యాచారంలో దోషికి భార్య మిగిలిపోవాలనుకోట్లేదని న్యాయస్థానం తలుపుతట్టింది. 

పవన్‌ గుప్త... పండ్ల వ్యాపారి

నేరం జరిగిన సమయంలో ఇతనికి 19 ఏళ్లు. పండ్ల వ్యాపారిగా ఉన్నాడు. ఘటనతో తనకు ఎలాంటి సంబంధం లేదని తొలుత వాదించాడు. కానీ, ఆధారాలు స్పష్టంగా ఉండడంతో కోర్టు అతడిని దోషిగా తేల్చింది. అసలు ఆరోజు ఆ ప్రాంతంలో తన కొడుకు లేనే లేడని పవన్‌ తండ్రి చెప్పుకొచ్చాడు. కానీ, అదంతా అబద్ధమని రుజువైంది. తిహాడ్‌ జైలు నుంచే గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశాడు.

రామ్‌ సింగ్‌.. బస్సు డ్రైవర్‌

దోషుల్లో ఒకడైన రామ్‌ సింగ్‌ తిహాడ్‌ జైల్లోనే ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన భార్య నుంచి విడాకులు తీసుకున్న ఇతడు రాజస్థాన్‌ నుంచి 23 ఏళ్ల వయసులో దిల్లీకి వలస వచ్చాడు. ప్రాథమిక స్థాయిలోనే చదువుకు స్వస్తి పలికాడు. రామ్‌ సింగ్‌ ఆత్మహత్య చేసుకోలేదని.. అతణ్ని చంపి ఉంటారని తండ్రి మంగేలాల్‌ ఆరోపించాడు. 2009లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో రామ్‌ సింగ్ చెతికి బలమైన గాయమవడంతో ఇనుప రాడ్డు వేసి శస్త్రచికిత్స చేశారు. 

ముకేశ్‌ సింగ్‌.. బస్సు డ్రైవర్‌

రామ్‌ సింగ్ సోదరుడే ముకేశ్‌ సింగ్‌. ఇతడు అప్పుడప్పుడు బస్సు డ్రైవింగ్‌లో సోదరుడికి సాయం చేస్తుండేవాడు. నేరం జరిగిన సమయంలో బస్సు క్లీనర్‌గా ఉన్నాడు. నిర్భయను తలపై ఇనుప రాడ్డుతో మోదింది ఇతడే అని విచారణలో తేలింది. కానీ, నిర్భయను అత్యాచారం చేసిన వాడిలో తాను లేనని.. ఆ సమయంలో బస్సు నేనే నడుపుతున్నానని చెప్పుకొచ్చాడు. కానీ, అతని వాదన తప్పని దర్యాప్తులో స్పష్టమైంది. బీబీసీకి 2015లో ఇచ్చిన ఓ ముఖాముఖిలో ఇతడు చేసిన వివాదాస్పద వ్యాఖ్యల పట్ల పౌరసమాజం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి ఆలోచనాధోరణి ఉన్నవాణ్ని వెంటనే ఉరితీయాలని ముక్తకంఠంతో కోరింది. 

వినయ్‌ శర్మ.. జిమ్‌ ట్రెయినర్‌

రవి దాస్‌ మురికివాడ ప్రాంతంలో నివాసం ఉండే వినయ్‌ ఓ జిమ్‌ సెంటర్‌లో ఫిట్‌నెస్‌ ట్రెయినర్‌గా పనిచేసేవాడు. బాగానే చదువుకున్నాడు. ఆంగ్లంలో మాట్లాడగల సామర్థ్యం ఉన్నావాడు. అత్యాచారం సమయంలో బస్సు నడిపిన వారిలో ఇతడూ ఒకడని దర్యాప్తులో తేలింది.

మైనర్‌...

జువైనైల్‌ జస్టిస్‌ బోర్డు ఇతణ్ని విచారించింది. నేరంలో ఇతని పాత్ర కూడా ఉన్నట్లు రుజువైంది. అయితే ఆ సమయానికి వయసురీత్యా మైనర్‌ కావడంతో మూడేళ్ల పాటు జువైనైల్‌ హోంకు పంపింది. డిసెంబరు 2015లో విడుదలయ్యాడు. 11 ఏళ్ల వయసులో ఇంటి నుంచి పారిపోయి దక్షిణాదిలో ఓ మారుమూల పట్టణంలో హోటల్‌లో పనిచేశాడు. మైనర్‌ కావడంతో అతని వివరాలేవీ బయటకు వెల్లడించలేదు.

ఇవీ చదవండి: 
ఏడ్చా.. బాధపడ్డా.. భయపడ్డా.. పోరాడా..
నిర్భయ దోషుల చివరి క్షణాలు ఇలా..
నిర్భయ దోషులకు ఉరి
నా కుమార్తెకు న్యాయం జరిగింది: నిర్భయ తల్లి


Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని