దక్షిణ కొరియాకు భారత ఆర్మీచీఫ్‌

భారత ఆర్మీ ఛీఫ్‌ జనరల్‌ నరవణే మూడురోజుల పర్యటన నిమిత్తం దక్షిణ కొరియాకు ప్రయాణమయ్యారు

Published : 28 Dec 2020 14:00 IST

దిల్లీ: భారత ఆర్మీ ఛీఫ్‌ జనరల్‌ మనోజ్‌ ముకుంద్‌ నరవణే మూడురోజుల  పర్యటన నిమిత్తం నేడు దక్షిణ కొరియాకు ప్రయాణమయ్యారు. రక్షణ రంగంలో ద్వైపాక్షిక సహకార విస్తరణ కోసం ఉన్నత స్థాయి చర్చల్లో పాల్గొంటారని అధికారులు వెల్లడించారు. ఆ దేశం భారత్‌కు కీలక ఆయుధ సరఫరాదారుగా ఉన్న సంగతి తెలిసిందే. దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో ఆ దేశ రక్షణ మంత్రితో జనరల్‌ నరవణే భేటీ కానున్నారు. ఈ సందర్భంగా  భారత్‌, దక్షణ కొరియా రక్షణ సంబంధాలను గురించి వారు చర్చించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా అక్కడి గాంగ్వాన్‌ ప్రాంతంలోని కొరియా కంబాట్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ను, డేజియాన్‌ నగరంలోని అడ్వాన్స్‌ డిఫెన్స్‌ డెవలప్‌మెంట్‌ కేంద్రాన్ని కూడా జనరల్‌ నరవణే సందర్శిస్తారు.

ఇదిలా ఉండగా యూఏఈ, సౌదీలతో వ్యూహాత్మక సంబంధాల అభివృద్ధి లక్ష్యంతో భారత ఆర్మీ ఛీఫ్‌ రెండు వారాల క్రితం ఆయా దేశాలను సందర్శించిన సంగతి తెలిసిందే.  గత నెల నేపాల్‌లో మూడు రోజుల పాటు పర్యటించిన నరవణే.. ముఖ్యాంశాలను చర్చించారు. అక్టోబర్‌లో విదేశాంగ శాఖ సెక్రటరీతో కలసి మయన్మార్‌ను సందర్శించిన జనరల్‌ నరవణే, ఆ దేశానికి జలాంతర్గామిని సరఫరాపై, సైనిక, రక్షణ సంబంధాల బలోపేతానికి చర్చలు జరిపారు. కాగా, చైనాతో సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఆర్మీ ఛీఫ్‌ నరవణే పర్యటనలు ప్రాముఖ్యం సంతరించుకున్నాయి.

ఇవీ చదవండి..

3 రోజులు.. 300 లోపు కొవిడ్‌ మరణాలు

రైతుల కోసం నిరాహార దీక్ష చేస్తా.. అన్నా హజారే

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని