CISCE: జులై 20నాటికి 12వ తరగతి ఫలితాలు!

కరోనా ఉద్ధృతి నేపథ్యంలో సీఐఎస్‌సీఈ (ద కౌన్సిల్‌ ఫర్‌ ద ఇండియన్‌ స్కూల్‌ సర్టిఫికెట్‌ ఎగ్జామినేషన్‌) 12వ తరగతి పరీక్షలు రద్దు చేసిన విషయం తెలిసిందే......

Updated : 16 Jun 2021 21:02 IST

దిల్లీ: సీఐఎస్‌సీఈ (ద కౌన్సిల్‌ ఫర్‌ ద ఇండియన్‌ స్కూల్‌ సర్టిఫికెట్‌ ఎగ్జామినేషన్‌) 12వ తరగతి పరీక్ష ఫలితాలు జులై 20 నాటికి విడుదల చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. కరోనా ఉద్ధృతి నేపథ్యంలో 12వ తరగతి పరీక్షలను రద్దు చేస్తూ బోర్డు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో 11, 12వ తరగతుల విద్యార్థులకు అంతర్గత మదింపు ద్వారా మార్కులు కేటాయించి ఫలితాలు వెల్లడించనున్నారు. మరోవైపు, విద్యార్థుల భద్రతను దృష్టిలో పెట్టుకొని సీబీఎస్‌ఈ 10, 12 తరగతుల పరీక్షలను కూడా కేంద్రం రద్దు చేసిన విషయం తెలిసిందే. 12వ తరగతి ఫలితాల వెల్లడికి అనుసరిస్తున్న విధానంపై నివేదికను సీబీఎస్‌ఈ బోర్డు గురువారం సుప్రీంకోర్టుకు అందించనున్నట్టు సమాచారం. సీబీఎస్‌ఈ 12వ తరగతి ఫలితాలు ప్రకటించడంలో ఏవిధమైన ప్రక్రియను అవలంబిస్తున్నారో చెప్పాలంటూ దాఖలైన పిటిషన్‌పై ఈ నెల తొలివారంలో విచారించిన సర్వోన్నత న్యాయస్థానం.. రెండు వారాల్లోగా నివేదిక ఇవ్వాలని సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌సీఈలను ఆదేశించింది. ఈ నేపథ్యంలో విద్యార్థుల ఫలితాలను ఏ ప్రాతిపదికన ప్రకటిస్తారనే అంశాన్ని నివేదిక ద్వారా సుప్రీంకోర్టుకు సీబీఎస్‌ఈ బోర్డు వివరించనుంది.  

మరోవైపు, పాఠశాల ఆధారిత మదింపు, ప్రాక్టికల్‌ పరీక్షల మోడ్‌ మార్పుపై తాజాగా సీబీఎస్‌ఈ కొత్త సర్క్యులర్‌ జారీచేసింది. పెండింగ్‌లో ఉన్న అంతర్గత, ఆన్‌లైన్‌ ప్రాక్టికల్‌ పరీక్షల వివరాలను పూర్తి చేయాలంటూ అనుబంధ పాఠశాలలకు ఆదేశాలు జారీచేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని