JK నుంచి సాయుధ బలగాలు తక్షణమే వెనక్కి!

కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూ కశ్మీర్‌లో మోహరించిన కేంద్ర పారామిలటరీ బలగాలను తక్షణమే ఉపసంహరించుకోవాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు 10వేల మంది.......

Published : 20 Aug 2020 01:16 IST

కేంద్రం కీలక నిర్ణయం

దిల్లీ: కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూకశ్మీర్‌లో మోహరించిన కేంద్ర పారామిలటరీ బలగాలను తక్షణమే ఉపసంహరించుకోవాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు 10వేల మంది పారామిలటరీ సిబ్బందిని వెనక్కి రప్పించాలని ఉత్తర్వులు జారీచేసింది. గతేడాది ఆగస్టు 5న జమ్మూకశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370 రద్దు నేపథ్యంలో అక్కడ ఎలాంటి హింసాత్మక ఘటనలూ చెలరేగకుండా భారీ సంఖ్యలో పారామిలటరీ బలగాలను మోహరించిన విషయం తెలిసిందే. 

జమ్మూకశ్మీర్‌లో కేంద్ర సాయుధ బలగాల మోహరింపు అంశంపై కేంద్ర హోంశాఖ సమీక్షించిన అనంతరం కేంద్రం ఈ ఉత్తర్వులు జారీచేసింది. 100 కంపెనీల బలగాలు తక్షణమే వెనక్కి రప్పించి ఇంతకముందు వారు పనిచేసే స్థానాల్లోకి వెళ్లాలని ఆదేశించింది. మొత్తం 100 కంపెనీల పారామిలటరీ బలగాల్లో 40 కంపెనీలు సీఆర్‌పీఎఫ్‌ కాగా.. సీఐఎస్‌ఎఫ్‌, బీఎస్‌ఎఫ్‌, ఎస్‌ఎస్‌బీ బలగాలు చెరో 20 కంపెనీల చొప్పున ఉన్నాయి. 

జమ్మూకశ్మీర్‌ను మూడు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించిన తర్వాత ఐఏఎస్‌ అధికారి గిరీష్ చంద్ర ముర్మును లెఫ్టినెంట్ గవర్నర్‌గా నియమించింది. ఈ ఏడాది కాలంలో ఉగ్రవాదుల ఏరివేతను సైన్యం ముమ్మరం చేయడంతో వ్యాలీలో ఉద్రిక్తలు సద్దుమణిగాయి. అలానే నిర్భంధంలో ఉన్న పలువురు నేతలను కూడా కేంద్రం విడిచిపెట్టింది. ఈ నేపథ్యంలో కశ్మీర్‌ లోయలో తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొల్పాలని కేంద్రం నిర్ణయించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ముర్మును కాగ్ అధిపతిగా బదిలీ చేసి, భాజపా నేత మనోజ్‌ సిన్హాను కొత్త లెఫ్టినెంట్ గవర్నర్‌గా నియమించినట్లు సమాచారం. తాజాగా బలగాల ఉపసంహరణ కూడా అందుకు సంకేతంగా భావించాలని పలువురు రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని