Galwan clash: ‘గల్వాన్‌’ ఘటనలో 38 మంది చైనా సైనికుల మృతి

తూర్పు లద్దాఖ్‌ వద్ద గల్వాన్‌ నది లోయలో ఏడాదిన్నర క్రితం భారత్‌-చైనా సైన్యాల మధ్య చోటుచేసుకున్న ఘర్షణలో డ్రాగన్‌ 38 మంది సైనికులను కోల్పోయిందని ఆస్ట్రేలియాకు చెందిన పరిశోధనాత్మక వార్తాపత్రిక ‘ది క్లాక్సన్‌’ సంపాదకుడు ఆంటోనీ క్లాన్‌ తాజాగా వెల్లడించారు. పలువురు స్వతంత్ర సోషల్‌ మీడియా పరిశోధకుల

Published : 04 Feb 2022 05:56 IST

డ్రాగన్‌ చెబుతున్నట్లు నలుగురు కాదు..
ఏడాది పరిశోధనలో తేలిందిదే..
ఆస్ట్రేలియా పత్రిక ‘క్లాక్సన్‌’ సంపాదకుడు క్లాన్‌

దిల్లీ: తూర్పు లద్దాఖ్‌ వద్ద గల్వాన్‌ నది లోయలో ఏడాదిన్నర క్రితం భారత్‌-చైనా సైన్యాల మధ్య చోటుచేసుకున్న ఘర్షణలో డ్రాగన్‌ 38 మంది సైనికులను కోల్పోయిందని ఆస్ట్రేలియాకు చెందిన పరిశోధనాత్మక వార్తాపత్రిక ‘ది క్లాక్సన్‌’ సంపాదకుడు ఆంటోనీ క్లాన్‌ తాజాగా వెల్లడించారు. పలువురు స్వతంత్ర సోషల్‌ మీడియా పరిశోధకుల నుంచి సేకరించిన ఆధారాలను ఉటంకిస్తూ ఆయన ఈ విషయాన్ని తేటతెల్లం చేశారు. ‘గల్వాన్‌ డీకోడెడ్‌’ శీర్షికతో ఇప్పటికే ఆ పత్రిక దీనిపై ఓ ప్రత్యేక కథనాన్ని కూడా ప్రచురించింది. ఈమేరకు క్లాన్‌ ఓ భారతీయ వార్తాసంస్థతో గురువారం మాట్లాడారు. చైనాకు చెందిన సామాజిక మాధ్యమ పరిశోధకులు ఈ విషయమై ఏడాది పాటు పరిశోధన జరిపినట్లు తెలిపారు. నాటి ఘటనలో భారత్‌కు చెందిన 20 మంది సైనికులు అమరులు కాగా.. తమ సైనికులు నలుగురే చనిపోయినట్లు చైనా అనంతరం ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అయితే డ్రాగన్‌ చేసిన ఈ ప్రకటన తప్పని.. అంతకంటే చాలా ఎక్కువ మందే ఆ దేశ సైనికులు చనిపోయారని ‘ది క్లాక్సన్‌’ కథనంలో పేర్కొంది. దీనిపై క్లాన్‌ వివరాలు అందించారు. ‘‘మాకు పరిశోధకులు అందించిన సమాచారం మేరకు.. 2020 జూన్‌ 15న గల్వాన్‌ వద్ద భారత సైనికులు వివిధ అవసరాలకు ఉపయోగిస్తున్న ఓ తాత్కాలిక వంతెనను డ్రాగన్‌ సైన్యం (పీఎల్‌ఏ) తొలగించేందుకు ప్రయత్నించింది. ఇది రెండు దేశాల సైనికుల మధ్య హింసాత్మక ఘర్షణకు దారితీసింది. అప్పటికి వంతెనపై ఉన్న కనీసం 38 మంది చైనా సైనికులు సున్నా కన్నా తక్కువ ఉష్ణోగ్రతల్లో ఉన్న నది నీటిలోకి పడిపోయారు. వారంతా కొట్టుకుపోయి మునిగిపోయారు. అయితే ఈ ఘటనపై వెంటనే స్పందించిన చైనా తమ సైనికుల మరణాలకు సంబంధించి సోషల్‌ మీడియాలో ఎలాంటి సమాచారం బయటకు పొక్కకుండా జాగ్రత్త పడింది. అనంతరం తమ సైనికులు నలుగురే చనిపోయినట్లు ప్రకటించింది. అయితే ఆ సంఖ్య అంతకంటే ఎక్కువే ఉంటుందని మాకు తెలుసు. అప్పట్లో డ్రాగన్‌ సైనికుల మరణాల సంఖ్యపై మరింత చర్చ జరగకుండా చైనా ఆతృత ప్రదర్శించడం కూడా ఆ సంఖ్య తక్కువేనని చెప్పిందనడానికి ఓ సంకేతం’’ అని క్లాన్‌ వివరించారు. దీంతో అప్పట్లో మృతి చెందిన తమ సైనికుల సంఖ్యను చైనా దాచిపెడుతోందంటూ వచ్చిన జాతీయ, అంతర్జాతీయ వార్తలకు మరింత ఊతం లభించినట్లయింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని