icon icon icon
icon icon icon

వైకాపా ప్రభుత్వానికి కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది

ఆంధ్రప్రదేశ్‌లో వైకాపా మాఫియా నాయకులకు రానున్న ఎన్డీయే ప్రభుత్వంలో పక్కా ట్రీట్‌మెంట్‌ ఇస్తామని ప్రధాని నరేంద్రమోదీ హెచ్చరించారు. వైకాపా ప్రభుత్వానికి కౌంట్‌డౌన్‌ మొదలయిందని ప్రకటించారు. రాష్ట్రప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.

Updated : 09 May 2024 07:48 IST

ఆ పార్టీ మాఫియాకు పక్కా ట్రీట్‌మెంట్‌ ఇస్తాం
రాష్ట్ర మంత్రులు రౌడీయిజం చేస్తున్నారు

ఇసుక మాఫియా వల్లే అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయింది
ఇంటింటికీ మంచినీళ్లు ఇద్దామంటే వైకాపా సహకరించలేదు
ఏపీకి బుల్లెట్‌ రైలు వద్దా?
కలికిరి సభలో ప్రధాని నరేంద్రమోదీ
కలికిరి నుంచి ఈనాడు ప్రత్యేక ప్రతినిధి

ఆంధ్రప్రదేశ్‌లో వైకాపా మాఫియా నాయకులకు రానున్న ఎన్డీయే ప్రభుత్వంలో పక్కా ట్రీట్‌మెంట్‌ ఇస్తామని ప్రధాని నరేంద్రమోదీ హెచ్చరించారు. వైకాపా ప్రభుత్వానికి కౌంట్‌డౌన్‌ మొదలయిందని ప్రకటించారు. రాష్ట్రప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఎన్డీయే ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఏయే అభివృద్ధి పనులు చేయబోయేదీ వివరించారు. రాష్ట్రంలోనూ డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వం అవసరమని పిలుపునిచ్చారు. రాష్ట్రప్రజలకు అనేక హామీలు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌కు బుల్లెట్‌ రైలు వద్దా అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పార్టీ దేశాన్ని మళ్లీ ముక్కలు చేయడానికి కంకణం కట్టుకుందని, ఇదంతా ఒకే జాతి కాదని చెబుతోందని, ఆ పార్టీ విషయంలో దేశ ప్రజలంతా అప్రమత్తంగా ఉండి తగిన నిర్ణయం తీసుకోవాలని పిలుపునిచ్చారు. అన్నమయ్య జిల్లా రాజంపేట లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని కలికిరిలో బుధవారం ఆయన ఎన్నికల ప్రచారసభలో పాల్గొని మాట్లాడారు. ‘‘రాష్ట్రప్రజలు అనేక ఆకాంక్షలతో గత ఎన్నికల్లో వైకాపాను గెలిపించారు. వాళ్లు మిమ్మల్ని మోసం చేశారు. విశ్వాసఘాతుకంతో వ్యవహరించారు. వైకాపా పేదల అభివృద్ధి కోసం కాదు.. మాఫియా అభివృద్ధి కోసం పనిచేస్తోంది. మంత్రులు గూండాగిరీ చేస్తున్నారు. ఇక్కడ ఇసుక మాఫియా వల్ల అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయింది. 25-30 గ్రామాలు నష్టపోయాయి. డజన్ల మంది ప్రజలు చనిపోయారు. ఇలాంటి మాఫియాకు ఈ ప్రభుత్వం మద్దతు ఇస్తోంది. ఎన్డీయే ప్రభుత్వం ప్రతి మాఫియాకూ చికిత్స చేస్తుంది. ఒక్కొక్కరికీ పక్కా ట్రీట్‌మెంట్‌ ఇస్తుంది’’ అని హెచ్చరించారు.

అభివృధ్ధి పనులనూ అడ్డుకుంటారా?

‘‘రాయలసీమలో గనులు, ఖనిజాలు ఉన్నాయి. భవ్యమైన, దివ్యమైన దేవాలయాలు ఉన్నాయి. ప్రతిభావంతులైన యువతీ యువకులు ఉన్నారు. కష్టపడి పనిచేసే రైతులు ఉన్నారు. పర్యాటక కేంద్రాలకు అవకాశాలు ఉన్నాయి. మీ ఆశీర్వాదం కోసమే వచ్చాను. మోదీ లక్ష్యం రాయలసీమ అభివృద్ధి. రాయలసీమను కొత్త ఎత్తులకు తీసుకువెళ్తాం. దశాబ్దాలుగా మీరు అనేకమందిని నమ్మారు. రాయలసీమ అనేకమంది ముఖ్యమంత్రులను ఏపీకి ఇచ్చింది. మీరు ఏం పొందారు? ఇక్కడ అభివృద్ధి జరగనే లేదు. సాగునీటి సౌకర్యం లేదు. పరిశ్రమలు లేవు. రైతులు ఇబ్బందులు పడుతున్నారు. యువత ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. ఈ పరిస్థితి మార్చాలా.. వద్దా? ఆంధ్రప్రదేశ్‌లో కూడా డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వం తీసుకురావాలి. ఇంటింటికీ పైపులైను ద్వారా నీళ్లు అందించాలని నేను భావించాను. వైకాపా ప్రభుత్వం జల్‌జీవన్‌ మిషన్‌ పనులకు సహకరించడం లేదు. పోలవరం ప్రాజెక్టును ఏం చేశారో మీరు చూస్తూనే ఉన్నారు. రాయలసీమ రైతులకూ ఈ ప్రభుత్వం సాగునీటి సౌకర్యం కల్పించలేదు. రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వంలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తిచేస్తామని వాగ్దానం చేస్తున్నాను’’ అని ప్రధాని ప్రకటించారు.

ఆంధ్రప్రదేశ్‌కు బుల్లెట్‌ రైలు కావాలా.. వద్దా?

‘‘దక్షిణాది రాష్ట్రాలకు బుల్లెట్‌ రైలును భాజపా ప్రకటిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌కు బుల్లెట్‌ రైలు కావాలా.. వద్దా చెప్పండి. దేశంలో పారిశ్రామిక కారిడార్ల నిర్మాణానికి ఎన్డీయే ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. దేశంలో ఆరు వరుసలు, నాలుగు వరుసల జాతీయ రహదారులు నిర్మాణంలో ఉన్నాయి. నంద్యాల-ఎర్రకుంట్ల రైల్వేలైను పనులు పూర్తయ్యాయి. కడప-బెంగళూరు మధ్య కొత్త రైల్వేలైను పనులు ఆమోదం పొందాయి. కడప విమానాశ్రయంలో కొత్త టెర్మినల్‌ పనులు జరుగుతున్నాయి. రాయలసీమలో రైతుల జీవితాన్ని ఎన్డీయే ప్రభుత్వమే మార్చగలదు. ఇక్కడ టమాటా విస్తారంగా పండిస్తారు. కూరగాయల రైతుల కోసం శీతల గిడ్డంగులు, క్లస్టర్లు సృష్టించబోతున్నాం. పులివెందులలో అరటి ప్రాసెసింగ్‌ క్లస్టర్‌ వల్ల యువతకు, రైతులకు లబ్ధి చేకూరుతుంది. రాబోయే ఐదేళ్లలో ఆహారశుద్ధి రంగం మరింత విస్తరిస్తుంది. రైతు ఉత్పాదక సంస్థలకూ సహకారం అందిస్తాం’’ అని రాష్ట్ర ప్రజలకు ప్రధాని మోదీ హామీ ఇచ్చారు.

ప్రతి ఓటూ ఎన్డీయేకే వేయాలి

‘‘శక్తిమంతమైన ప్రభుత్వం ఉన్నప్పుడే దేశం శక్తిమంతంగా మారుతుంది. భారతదేశం ఇప్పుడు శక్తిమంతంగా ఉందా.. లేదా? విదేశాల్లో భారతీయులకు గౌరవం పెరిగిందా.. లేదా? గల్ఫ్‌ దేశాల్లో మనవాళ్లకు ఎలాంటి సమస్యలు వచ్చినా పరిష్కరిస్తాం. ఖతార్‌లో ఈమధ్య మనవాళ్లు చిక్కుకుపోయారు. కాంగ్రెస్‌ ప్రభుత్వమే ఉంటే వారిని రక్షించడం కష్టమయ్యేది. వారిని సురక్షితంగా దేశానికి తీసుకురాగలిగాం. ఇలాంటి శక్తిమంతమైన ప్రభుత్వం రావాలంటే.. మీ ప్రతి ఓటూ ఎన్డీయేకే వేయాలి. దేశనిర్మాణం అనే లక్ష్యంతో మోదీ బయలుదేరాడు. దేశాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు పగలు, రాత్రి పనిచేస్తున్నాడు. దేశాన్ని రివర్స్‌ గేరులో వెనక్కి తీసుకువెళ్లేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నిస్తోంది. గత పదేళ్లలో మేం చేసిన పనులన్నీ రద్దుచేస్తామంటోంది. ఆర్టికల్‌ 370 మళ్లీ తెస్తారట, కామన్‌ సివిల్‌కోడ్‌ రద్దు చేస్తారట. పేదలకు ఉచిత రేషన్‌, ఉచిత వైద్యం రద్దు చేస్తారట. రామమందిరంపై సుప్రీంకోర్టు తీర్పు కూడా వెనక్కి నెట్టేసి, రామమందిరానికి తాళాలు వేస్తామంటోంది. దీన్ని మీరు అంగీకరిస్తారా?’’ అని ఆయన ప్రశ్నించారు.

కాంగ్రెస్‌ మళ్లీ దేశాన్ని ముక్కలు చేస్తుంది.. జాగ్రత్త

‘‘కాంగ్రెస్‌ ఈ దేశాన్ని మళ్లీ ముక్కలు చేయాలని ఆలోచిస్తోంది. భారతదేశం ఒక జాతి కాదు.. విభిన్న జాతుల సమూహం అని చెబుతోంది. కాంగ్రెస్‌ ఈ దేశ విభజనకు కారణమయింది. కాంగ్రెస్‌లో గాంధీ కుటుంబానికి అతి దగ్గరగా ఉండే వ్యక్తి మాట్లాడే మాటలు చూస్తే మనమంతా సిగ్గుపడాలి. ఉత్తరాది, దక్షణాది రాష్ట్రాలు వేరని, వాటిని విభజించాలని చెబుతున్నారు. కర్ణాటక ప్రజలు, తమిళనాడు ముఖ్యమంత్రి వారు  వేరే దేశం అంటే అంగీకరిస్తారా? బాల్‌ఠాక్రే పార్టీ పెద్దలు కొందరు కాంగ్రెస్‌ భాషకు వంతపాడటం దురదృష్టకరం. అధికారం కోసం కాంగ్రెస్‌ పార్టీ దేశాన్ని మరోసారి విభజించాలనుకుంటోంది... జాగ్రత్త.  ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకే కాదు.. దేశవాసులు అందరికీ ఈ విషయం తెలియజేస్తున్నా. దేశంలో ఇంకా ఎన్నికలు మిగిలి ఉన్న అన్ని ప్రాంతాల ప్రజలనూ హెచ్చరిస్తున్నా. ఈ విషయాన్ని ఆలోచించాలని చెబుతున్నాను. కాంగ్రెస్‌ యువనేత అమెరికాకు వెళ్లి,    అక్కడ కూడా నల్లవారు.. తెల్లవారు అంటూ దేశ గౌరవం తగ్గించేలా మాట్లాడారు. కాంగ్రెస్‌ విషయంలో అప్రమత్తంగా ఉండి వారి ఆలోచనలను తిప్పికొట్టాలి’’ అని ప్రధాని మోదీ కోరారు.

అక్కడక్కడ తెలుగులో మాటలు

ప్రధాని మోదీ తన ప్రసంగం ప్రారంభిస్తూ తెలుగులో నమస్సులు చెప్పారు. తిరుపతి వేంకటేశ్వరస్వామికి, అన్నమయ్యకు ప్రణామాలు చెప్పారు. మధ్యలో రెండు మూడు వాక్యాలు తెలుగులో మాట్లాడి సభికులను ఉత్సాహపరిచారు. మోదీ లక్ష్యం ఆంధ్రప్రదేశ్‌ వికాసం అని తెలుగులో చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ రావాలి అని మరోచోట చెప్పారు. ఎన్డీయే లోక్‌సభ అభ్యర్థులను దిల్లీ పంపాలని కోరారు.


దేశంలో సుస్థిర ప్రభుత్వం మోదీతోనే సాధ్యం: లోకేశ్‌

ప్రపంచంలోనే శక్తిమంతమైన నేత నరేంద్ర మోదీ అని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు. కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం ఉండి దేశం అభివృద్ధి చెందాలంటే ఒక శక్తిమంతమైన నేత ఉండాల్సిన అవసరం ఉందన్నారు.. గత పదేళ్లు దేశం ఎంత అభివృద్ధి చెందిందో చూశామని అది మోదీతోనే సాధ్యమైందని వెల్లడించారు. అన్నమయ్య జిల్లా కలికిరిలో బుధవారం ప్రజాగళం సభలో లోకేశ్‌ ప్రసంగించారు. ‘మోదీ మాటల్లో దమ్ముంది. మోదీ అంటే దేశానికి భరోసా ఉంది. కన్నతల్లిని గౌరవించడం, దేశాన్ని ప్రేమించడంలో అందరూ ఆయన నుంచి ఆదర్శంగా తీసుకోవాల్సిన విషయాలు. ఆయనకు సంపద ఎలా సృష్టించాలో తెలుసు. పేదరికం నుంచి పేదలను పైకి ఎలా తీసుకురావాలో ఆయనకు బాగా తెలుసు. అభివృద్ధి, సంక్షేమాన్ని సమం చేసి చూపించి భారతీయులను తలెత్తుకొని నిల్చునేలా చేసిన వ్యక్తి నరేంద్ర మోదీ. మోదీ నాయకత్వంలో భారత దేశం ఒక సూపర్‌పవర్‌గా ఆవిర్భవించడం ఖాయం. వికసిత్‌ భారత్‌ నరేంద్ర మోదీ కల. వికసిత రాయలసీమ చంద్రబాబు, పవన్‌ల కల. 2014లో విభజన జరిగింది. కట్టుబట్టలతో బయటకు గెంటేశారు. నాడు చంద్రబాబు అనుభవంతో రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి చేశాం. 2014-19 మధ్యన రాయలసీమను అభివృద్ధి చేశాం. గతంలో కొందరు రాయలసీమలో రక్తం పారిస్తే చంద్రబాబు నీళ్లు పారించారు’ అని లోకేశ్‌ తెలిపారు.


హింసాత్మక పాలనపై పోరు

- కిరణ్‌కుమార్‌రెడ్డి, భాజపా రాజంపేట ఎంపీ అభ్యర్థి

12 ఏళ్లు గుజరాత్‌ సీఎంగా, పదేళ్లు పీఎంగా ఒక్క అవినీతి ఆరోపణా లేని ఏకైక వ్యక్తి నరేంద్ర మోదీ మాత్రమే. దేశం కోసం ప్రతిక్షణం శ్రమించే శ్రామికుడు. ప్రధాన మంత్రిగా ఒక్క రోజూ సెలవు తీసుకోలేదు. ఇది కేవలం దేశంపై ఉన్న ప్రేమ, పేదలను పైకి తీసుకొచ్చేందుకు ఆయనకు ఉన్న శ్రద్ధ. పదేళ్లలో 25 కోట్ల మందిని బీపీఎల్‌ నుంచి బయటకు తీసుకొచ్చిన ఘనత ఆయనకే దక్కుతుంది. ప్రపంచాన్ని కొవిడ్‌ వణికిస్తే, లక్షల మంది ప్రజలు ఈ దేశంలో చనిపోతారని పలువురు వ్యాఖ్యానించారు. అతి తక్కువ కాలంలోనే వ్యాక్సిన్‌ తీసుకొచ్చి 220 కోట్ల వ్యాక్సిన్లను ఉచితంగా ఇచ్చారు. ఇక్కడ రాష్ట్రంలో జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలను హింసించారు. ఈ ప్రభుత్వాన్ని అంతమొందించేందుకు కూటమి ఏర్పాటు చేశాం.


రాష్ట్రం తిరోగమనంలో ఉంది

- నాగబాబు, జనసేన నేత

నరేంద్ర మోదీ అభిమానులు భాజపాలో అందరూ ఉంటారు. భాజపా కాకుండా బయట పార్టీలో నాలాంటి వాళ్లు కోట్ల మందిలో ఉన్నారు. ఎందుకంటే ఇవాళ ప్రతి భారతీయుడు విదేశాల్లో అడుగుపెడితే రొమ్ము విరుచుకొని నేను భారతీయుడిని అని చెప్పుకొనేలా గొప్ప గౌరవం తీసుకువచ్చిన వ్యక్తి మోదీ. దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతుంటే.. ఐదేళ్లలో రాష్ట్రం తిరోగమనంలో వెళుతోంది. ఏ మాత్రం పరిపాలన దక్షత లేకుండా కక్షపూరిత రాజకీయాలు చేసే జగనే ఇందుకు కారణం. వైకాపా తిరుమల క్షేత్రాన్నీ నిర్లక్ష్య చేసి అవమానం చేసింది. మోదీ అయోధ్యలో బాల రామాలయాన్ని నిర్మిస్తే.. రాష్ట్రంలో విగ్రహ తల నరికేశారు. మోదీ దేశ విదేశాల్లో మన ధర్మాన్ని విస్తరింపజేస్తోంటే.. వైకాపా మాత్రం హిందూ మతాన్ని అవమానిస్తోంది. శేషాచల అటవీ ప్రాంతంలో విలువైన ఎర్రచందనం చెట్లను నరికివేసి విదేశాలకు తరలిస్తోంది. ఈ అరాచక పాలనకు ముగింపు పలకాలి. అరాచకాలు ఆగాలన్నా యువతకు, మహిళలకు, రైతులకు భరోసా లభించాలన్నా దేశంలో నరేంద్రమోదీ ప్రధాని కావాలి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావాలి. మోదీ దూర దృష్టి, చంద్రబాబు అనుభవం, పవన్‌ కల్యాణ్‌ చిత్తశుద్ధి రాష్ట్రానికి మేలు చేస్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img