కరోనాపై తైవాన్‌ విజయం.. ఇలా

 తైవాన్‌.. చైనాకు సమీపంలో ఉన్న చిన్నదేశం. చైనాలో ఏం జరిగినా గంటల్లోనే ఆ దేశానికి పాకుతుంది.  అయితే కరోనా వైరస్ ప్రవేశించినా గట్టి ప్రయత్నాలతో దాని వ్యాప్తిని అడ్డుకొంది. ఫలితంగా...

Published : 10 May 2020 01:29 IST

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం:  తైవాన్‌.. చైనాకు సమీపంలో ఉన్న చిన్నదేశం. చైనాలో ఏం జరిగినా గంటల్లోనే ఆ దేశానికి పాకుతుంది.  అయితే కరోనా వైరస్ ప్రవేశించినా గట్టి ప్రయత్నాలతో దాని వ్యాప్తిని అడ్డుకొంది. ఫలితంగా గత కొన్ని వారాలుగా అక్కడ కొత్తకేసులు నమోదుకాలేదు.  ఇప్పటివరకు 440 బాధితులు ఉండగా ఆరు మంది మాత్రమే చనిపోయారు.

మొదటిరోజు నుంచే నిలువరించాం..

చైనాలో నవంబరు, డిసెంబరు మాసాల్లోనే అంతుబట్టని వైరస్‌ వ్యాప్తి చెందడాన్ని తైవాన్‌ పసిగట్టింది.  చైనాలో ఏదో జరుగుతోందని అయితే దానికి సంబంధించిన వార్తలు బయటకు రావడం లేదని అనుమానించింది.  2003లో సార్స్‌ అంటువ్యాధి తైవాన్‌కు తీవ్రనష్టం కలిగించింది. దీంతో ముందుగానే పోరుకు సిద్ధమైంది.  చైనాలో కొందరు రోగులను దూరంగా ఐసోలేట్‌ చేయడంతో కచ్చితంగా కొత్తగా అంటువ్యాధి ఉంటుందని ప్రపంచ ఆరోగ్యసంస్థకు కూడా సమాచారం అందించింది. అయితే ఆరోగ్యసంస్థ దాన్ని పట్టించుకోలేదు.  సార్స్‌ అంటువ్యాధి నివారణకు తీసుకున్న చర్యలను తిరిగి ప్రవేశపెట్టారు.  పకడ్బందీగా విదేశాల నుంచి వచ్చే వారికి వైద్య పరీక్షలు నిర్వహించారు.మొదటి రోజు నుంచే వైరస్‌ను నిలువరించేందుకు చేసిన యత్నాలు ఫలించినట్టు అక్కడి అధికారులు తెలిపారు.

పరీక్షలు.. పరీక్షలు..

చైనా నుంచి వచ్చే వారు ముందుగా వుహాన్‌ నుంచి  వచ్చేవారితో పాటు ఇతర విదేశీయులను క్వారంటైన్‌ కేంద్రాలకు పంపించింది. డిసెంబరు 31 నుంచే  దేశంలోని అనుమానితుందరికీ పరీక్షలు నిర్వహించింది. ఇప్పటివరకు 66460 టెస్టులు నిర్వహించింది. 14 రోజుల వరకు విదేశీయులు క్వారంటైన్‌లో ఉండాల్సిందే. అనంతరం పరీక్షలు జరిపి కరోనా నెగటివ్‌గా తేలితేనే వదిలిపెట్టేవారు. 

లాక్‌డౌన్‌ అమలు.
జనవరి నెల చివర్లో ప్రపంచ ఆరోగ్యసంస్థ ఈ వ్యాధిపై హెచ్చరికలు జారీ చేసింది. అయితే అంతకన్నా నెల ముందుగానే తైవాన్‌ మాస్కులు, వైద్య పరీక్షల కిట్లు, పీపీఈలతో సంసిద్ధం కావడం విశేషం.  ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా లాక్‌డౌన్‌ ప్రకటించారు. పటిష్టంగా లాక్‌డౌన్‌ను అమలు చేయడంతో పాటు భౌతిక దూరం, శుభ్రత, మాస్కుల వినియోగంపై ప్రచారం నిర్వహించారు. 

విమాన సర్వీసుల నిలిపివేత

తైవాన్‌ ద్వీపదేశం కావడంతో ఇతర దేశాలకు చేరుకోవాలంటే విమానప్రయాణమే శరణ్యం.  జనవరి 20న తొలి కేసును గుర్తించారు. దీంతో విదేశాల నుంచి ప్రత్యేకించి చైనాకు విమాన సర్వీసులను నిలిపివేశారు.  ఫిబ్రవరి తొలినాళ్లలో చైనా నుంచి ఎవరూ దేశంలోకి ప్రవేశించకుండా ఆంక్షలు విధించారు. తైవాన్‌ ఇలా చర్యలు తీసుకుంటున్నా ప్రపంచ ఆరోగ్యసంస్థ మాత్రం ఇది అంటువ్యాధి కాదని నమ్మబలికింది. చివరకు జనవరి చివర్లో  కరోనాపై హెచ్చరిక జారీ చేసింది. ప్రపంచ ఆరోగ్యసంస్థను అనుసరించివుంటే తాము ముందుగానే ఎలాంటి కఠినచర్యలు చేపట్టివుండలేమని తైవాన్‌ ప్రకటించింది. చైనాలో పరిస్థితిని గ్రహించి ముందుగానే సన్నద్దం కావడంతో వైరస్‌ను నియంత్రించిందీ ఈ చిన్నదేశం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని