భారత్‌లో కరోనా @ 15లక్షలు‌ దాటాయ్‌..

భారత్‌లో కరోనా వైరస్‌ శరవేగంగా వ్యాపిస్తోంది. గత కొన్ని రోజులుగా ప్రతిరోజూ 45 వేలకు పైగా కేసులు నమోదవుతుండటం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ......

Updated : 29 Feb 2024 15:25 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత్‌లో కరోనా వైరస్‌ శరవేగంగా వ్యాపిస్తోంది. గత కొన్ని రోజులుగా ప్రతిరోజూ 45 వేలకు పైగా కేసులు నమోదవుతుండటం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. భారత్‌లో కేసుల సంఖ్యపరంగా తాజాగా మరో రికార్డు నమోదైంది. ఈ నెల 25న 13 లక్షలకు చేరుకున్న కేసులు.. కేవలం మూడు రోజులు తిరిగేసరికి 15లక్షల మార్క్‌ను దాటేయడం దేశంలో కరోనా ఉగ్రరూపానికి అద్దంపడుతోంది. గడిచిన 24 గంటల్లో ( సోమవారం నుంచి మంగళవారం ఉదయం 9గంటల వరకు) 47,703 కేసులు నమోదవ్వడంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 14,83,156కి పెరిగినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ బులిటెన్‌లో వెల్లడించిన విషయం తెలిసిందే.

తాజాగా మంగళవారం ఏపీలో 7,948 కేసులు, తమిళనాడులో 6972, కర్ణాటకలో 5536, యూపీలో 3458, ఒడిశాలో 1215.. ఇలా పలు రాష్ట్రాల్లో కొత్తగా నమోదైన కేసులతో దేశంలో కొవిడ్‌ బాధితుల సంఖ్య 15లక్షలు దాటేసింది. దేశంలో రికవరీ రేటు పెరగడం, మరణాల రేటు తగ్గడం ఉపశమనం కలిగించే అంశం. అయితే, ప్రపంచంలోనే ఈ వైరస్ పెరుగుదల రేటు భారత్‌లో‌ ఎక్కువగా ఉందని పలు నివేదికలు పేర్కొంటున్నాయి. మరోవైపు, డబ్ల్యూహెచ్‌వో కూడా దేశంలో ఈ మహమ్మారి తీవ్రత ఇంకా పెరుగుతుందని చెబుతోంది. మే 16 నాటికి దేశంలో లక్ష కేసులు ఉండగా..  ఆ సంఖ్య 15లక్షలకు చేరేందుకు 181 రోజుల సమయం పట్టింది. 

కర్ణాటకలో ఒక్కరోజే 102 మరణాలు 

కర్ణాటకలో కరోనా విలయం కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లోనే 102మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 2055కి పెరిగింది. కొత్తగా 5536 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,07,001కి పెరిగింది. తాజాగా మరో 2819మంది కోలుకోవడంతో డిశ్చార్జి అయిన మొత్తం సంఖ్య 40,504కి చేరింది.

డీఎంకే ఎమ్మెల్యే సురేష్‌ రాజన్‌కు కరోనా

తమిళనాడులో కరోనా మహా విజృంభణ కొనసాగుతోంది. ఈ రోజు కొత్తగా మరో 6972 కొవిడ్‌ కేసులు, 88 మరణాలు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 2,27,688కి పెరగ్గా.. మరణాల సంఖ్య 3659కి చేరింది. తాజాగా కరోనా బారిన పడిన వారిలో 4707మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 1,66,956కి పెరిగింది. రాష్ట్రంలో ప్రస్తుతం 57,073 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. డీఎంకే ఎమ్మెల్యే ఎన్‌.సురేష్‌ రాజన్‌ కరోనా బారిన పడ్డారు. దీంతో ఆయన ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు.

ఆ ఆస్పత్రిలో నిన్న ‘సున్నా’ మరణాలు

దేశ రాజధాని నగరం దిల్లీలో కరోనా వైరస్‌ ఉద్ధృతి తగ్గుముఖం పట్టింది. మంగళవారం కొత్తగా 1056 కేసులు మాత్రమే నమోదైనట్టు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,32,275కి పెరిగింది. కొత్తగా 28 మరణాలు నమోదు కావడంతో మొత్తం కొవిడ్‌ మరణాల సంఖ్య 3881కి చేరుకుంది.  దిల్లీలో నిర్మించిన అతిపెద్ద కొవిడ్‌ ఆస్పత్రి (లోక్‌ నాయక్‌ జయప్రకాశ్‌ నారాయణ్‌ ఆస్పత్రి)లో నిన్న ఒక్క మరణం కూడా చోటుచేసుకోలేదని దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ట్విటర్‌లో వెల్లడించారు. 

ఒడిశాలో కేసులు 28వేలు దాటాయ్‌.. 

ఒడిశాలో కరోనా కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. కొత్తగా 1215 కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 28వేల మార్కు దాటింది. కొత్తగా మరో ఏడుగురు ప్రాణాలు కోల్పోవడంతో మొత్తం మృతుల సంఖ్య 154గా నమోదైంది. 

ధారావిలో కొత్త కేసులు మూడే..! 

ముంబయి మహానగరంలో కొవిడ్‌ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ఆసియాలోనే అతిపెద్ద మురికివాడ అయిన ధారావిలో మంగళవారం కేవలం మూడు కొత్త కేసుల మాత్రమే నమోదయ్యాయి. ఇప్పటివరకు ధారావిలో 2543 మందికి కొవిడ్‌ సోకగా.. ప్రస్తుతం 88 యాక్టివ్‌ కేసులు మాత్రమే ఉన్నాయి. 

యూపీలో 1500లకు చేరువలో మరణాలు

యూపీలో కొత్తగా 3458 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 73951కి పెరిగింది. తాజాగా మరో 41మంది ప్రాణాలు కోల్పోవడంతో మొత్తం మరణాల సంఖ్య 1497కి పెరిగింది. ఇప్పటివరకు 44520మంది కోలుకోగా.. రాష్ట్రంలో ప్రస్తుతం 27934 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

రికవరీ రేటు 64.24%

ఓ వైపు దేశంలో మహమ్మారి వ్యాప్తి పెరుగుతున్నప్పటికీ కొవిడ్‌ నుంచి కోలుకున్నవారి సంఖ్యా అంతే వేగంగా పెరుగుతోంది. సోమవారం ఒక్కరోజే 35,176 కోలుకోవడంతో మొత్తం డిశ్చార్జి అయినవారి సంఖ్య 9,52,743 దాటింది. దేశంలో ప్రస్తుతం రికవరీ రేటు 64.24శాతంగా ఉంది. దేశంలో కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు పెరుగుతున్నాయి. దేశంలో వరుసగా రెండో రోజు కూడా 5లక్షల టెస్టులు చేసినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇప్పటివరకు మొత్తంగా 1.73 కోట్ల శాంపిల్స్‌ పరీక్షించినట్టు తెలిపింది. ప్రతి 10లక్షల జనాభాకు గాను 12,562 మందికి పరీక్ష చేస్తున్నట్టు పేర్కొంది. 

తగ్గుతున్న మరణాల రేటు

దేశంలో మరణాల రేటు కూడా క్రమంగా తగ్గుముఖం పడుతోంది. ప్రస్తుతం మరణాల రేటు 2.25 శాతానికి తగ్గినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.

దేశంలో కరోనా పరిస్థితి ఇదీ.. (ఈ రోజు ఉదయం వరకు)


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని