కొత్త రకం కరోనా: కేంద్రం మార్గదర్శకాలు

కరోనా వైరస్ ఇప్పటికే ఒకవైపు ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తూనే..కొత్త రూపంలోకి మార్పు చెంది మరోసారి భయం గుప్పిట్లోకి నెట్టేసింది.

Published : 23 Dec 2020 02:07 IST

దిల్లీ: కరోనా వైరస్ ఇప్పటికే ఒకవైపు ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తూనే..కొత్త రూపంలోకి మార్పు చెంది మరోసారి భయం గుప్పిట్లోకి నెట్టేసింది. బ్రిటన్‌లో వెలుగుచూసిన ఈ వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు భారత ప్రభుత్వం సిద్ధమైంది. ఆ దేశం నుంచి వచ్చే విమాన సర్వీసులను డిసెంబర్ 31 వరకు రద్దు చేయగా, మంగళవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సరికొత్త మార్గదర్శకాలను వెలువరించింది. ‘కరోనా వైరస్‌లో వెలుగుచూసిన ఉత్పరివర్తనాల ద్వారా ఈ వేరియంట్‌ను నిర్వచిస్తున్నారు. ఇది అంటువ్యాధిగా మారి, వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉంది’ అని  మంత్రిత్వశాఖ తన ప్రకటనలో పేర్కొంది. అందుకే, గత నాలుగు వారాల్లో (నవంబర్ 25 నుంచి డిసెంబర్‌23 వరకు) యూకే నుంచి, మీదుగా వచ్చిన ప్రయాణికులను ఈ కొత్త మార్గదర్శకాల పరిధిలోకి చేర్చామని తెలిపింది.  

వాటి ప్రకారం..
 ప్రయాణికులందరూ వారి గత 14 రోజుల ప్రయాణ వివరాలను వెల్లడించాల్సి ఉంటుంది. స్వీయ ధ్రువీకరణ పత్రాన్ని నింపాలి. ఆ వెంటనే ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తారు. ఒకవేళ, పాజిటివ్ అని తేలితే..స్పైక్‌ జీన్‌కు సంబంధించిన ఆర్టీపీసీఆర్ పరీక్షకు సిఫార్సు చేస్తారు. 
♦ ఇప్పటికే ఉన్న కరోనా వైరస్ పాజిటివ్‌గా తేలితే..లక్షణాల తీవ్రతను బట్టి హోం ఐసోలేషన్‌లో ఉంచడం కానీ, ఆసుపత్రులకు తరలించడం కానీ చేస్తారు. 
ఒకవేళ కొత్త రకం వైరస్ పాజిటివ్‌గా తేలితే..బాధితుడికి ప్రత్యేక ఐసోలేషన్ యూనిట్‌లో చికిత్స అందిస్తారు. 14 రోజుల తరవాత మరోసారి పరీక్షలు జరుపుతారు. మరోసారి పాజిటివ్‌గా తేలితే 24 గంటల్లో రెండు సార్లు నెగిటివ్ వచ్చే వరకు నమూనాలను తీసుకొని పరీక్షించవచ్చు. అలాగే కొత్త రకం కరోనా వైరస్‌ పాజిటివ్ వ్యక్తితో ప్రయాణించిన వారిని సంస్థాగత క్వారంటైన్‌లో ఉంచాలి. 

చెక్‌ఇన్ సమయంలోనే ప్రయాణికులకు ఎస్‌ఓపీల గురించి వెల్లడించాలని విమానయాన సంస్థలకు కేంద్రం సూచించింది. అలాగే యూకే నుంచి వచ్చిన ప్రయాణికుల వివరాలను సంబంధిత రాష్ట్రాలు, ఇంటిగ్రేటెడ్ డిసీజ్‌ సర్వైలెన్స్ ప్రొగ్రామ్‌కు అందించాలని తెలిపింది. 

ఇవీ చదవండి..

బ్రిటన్ నుంచి వచ్చిన వ్యక్తికి కొవిడ్..!

6 వారాల్లో కరోనా స్ట్రెయిన్‌కు టీకా తేగలం!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని