Covid: టెలిమెడిసిన్‌ సేవలు విస్తృతం చేయండి

క్షేత్రస్థాయిలో కొవిడ్‌-19 పరిస్థితుల గురించి తెలుసుకోవడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం దేశవ్యాప్తంగా

Updated : 18 May 2021 08:45 IST

వైద్యులకు ప్రధాని మోదీ పిలుపు
వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సంభాషణ

ఈనాడు, దిల్లీ: క్షేత్రస్థాయిలో కొవిడ్‌-19 పరిస్థితుల గురించి తెలుసుకోవడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం దేశవ్యాప్తంగా ఉన్న వైద్యులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. టెలిమెడిసిన్‌ సేవలను విస్తృతం చేసి, ఇంట్లో ఏకాంతంగా ఉన్న రోగులకు ఎప్పటికప్పుడు వైద్యసేవలు అందించాలని సూచించారు. ప్రస్తుతం నెలకొన్న అసాధారణ పరిస్థితుల్లో వైద్యులు, పారామెడికల్‌ సిబ్బంది చూపుతున్న పోరాట పటిమను ప్రశంసించారు. దేశమంతా వారికి రుణపడి ఉంటుందన్నారు. ‘‘రికార్డు సమయంలో పరీక్షలు నిర్వహించడం, మందుల సరఫరా, కొత్త మౌలిక వసతుల కల్పన జరుగుతోంది. పనులన్నీ వేగంగా సాగుతున్నాయి. ఆక్సిజన్‌ ఉత్పత్తి, సరఫరాలో ఎదురైన సవాళ్లను అధిగమిస్తూ వస్తున్నాం. మానవ వనరులను పెంచడానికి కొవిడ్‌ వైద్యసేవల కోసం ఎంబీబీఎస్‌ విద్యార్థులను, గ్రామీణ ప్రాంతాల్లో ఆశా, అంగన్‌వాడీ కార్యకర్తల సేవలను ఉపయోగించుకుంటూ వైద్య ఆరోగ్య వ్యవస్థను విస్తరించాం. ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు తొలిదశలోనే వ్యాక్సిన్‌ వేయడం రెండో ఉద్ధృతిలో కలిసివస్తోంది. 90% మంది వైద్యఆరోగ్య సిబ్బంది ఇప్పటికే మొదటి డోసు తీసుకున్నారు. వైద్యులకు వ్యాక్సిన్‌ భద్రత కల్పించింది. ఆసుపత్రుల రోజువారీ కార్యకలాపాల్లో ఆక్సిజన్‌ ఆడిటింగ్‌నూ చేర్చాలి. పెద్దసంఖ్యలో రోగులు ఇంట్లోనే ఏకాంతంలో ఉన్నందున వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చికిత్స గురించి వైద్యులు వివరించాలి. ఇలాంటి పరిస్థితుల్లో టెలిమెడిసిన్‌ కీలకపాత్ర పోషిస్తోంది. ఈ సేవలను గ్రామాలకూ విస్తరించాలి. డాక్టర్లు బృందాలుగా ఏర్పడి.. కొవిడ్‌ చికిత్స విధానంపై ఎంబీబీఎస్‌ తుది సంవత్సరం విద్యార్థులకు, ఎంబీబీఎస్‌ ఇంటర్న్స్‌కీ శిక్షణ ఇవ్వాలి. వారిద్వారా మండల, జిల్లా స్థాయిల్లో టెలిమెడిసిన్‌ సేవలను విస్తృతంగా వినియోగంలోకి తేవాలి. బ్లాక్‌ ఫంగస్‌ ఇన్‌ఫెక్షన్‌ నివారణకు విస్తృత చర్యలు తీసుకోవాలి. దాని గురించి రోగులకు అవగాహన కల్పించాలి. మానసిక, శారీరక జాగ్రత్తల గురించీ చెప్పాలి. ఈ వైరస్‌పై దీర్ఘకాలం పాటు నిరంతర పోరాటం చేయడం వల్ల వైద్యసిబ్బందిపై మానసిక ఒత్తిడి ఉంటుంది. అయితే వారిపట్ల ప్రజలకున్న అపార నమ్మకమే పోరాట శక్తినిస్తుంది’’ అని ప్రధాని పేర్కొన్నారు. వ్యాక్సినేషన్‌ కార్యక్రమంలో వైద్యసిబ్బందికి ప్రథమ ప్రాధాన్యం ఇచ్చినందుకు డాక్టర్లు ఈ సందర్భంగా ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు. కొవిడ్‌ తొలి ఉద్ధృతి నుంచి తాము సమాయత్తమైన తీరు, రెండో ఉద్ధృతిలో ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి వారు ప్రధానికి వివరించారు. తాము అనుసరిస్తున్న వినూత్న విధానాలను తెలియజేశారు.

క్షేత్రస్థాయి అధికారులతో నేడు ప్రధాని మాటామంతి 

కరోనా పీడిత 46 జిల్లాల ఎంపిక

దిల్లీ: దేశంలో కొవిడ్‌ -19 కేసులు ఎక్కువగా నమోదవుతున్న పలు రాష్ట్రాలు, జిల్లాల క్షేత్రస్థాయి అధికారులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం మాట్లాడనున్నట్లు ఆయన కార్యాలయం (పీఎంవో) తెలిపింది. ముఖ్యంగా చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో కరోనాపై సాగిస్తున్న పోరుకు సంబంధించి ఆయా అధికారులు వారి అనుభవాలు, సూచనలు, సిఫార్సులు ప్రధానికి చెబుతారు. దేశంలోని మిగతా ప్రాంతాలకు స్ఫూర్తి కలిగించేలా అధికారుల కృషితో ఆయా సమస్యలను పరిష్కరించిన విజయగాథలు కూడా ప్రధానితో పంచుకోవచ్చని పీఎంవో పేర్కొంది. కర్ణాటక, బిహార్, అస్సాం, చండీగఢ్, తమిళనాడు, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, గోవా, హిమాచల్‌ప్రదేశ్, దిల్లీ ప్రాంతాల సిబ్బంది ఈ భేటీలో పాల్గొనే అవకాశముంది. మొత్తం తొమ్మిది రాష్ట్రాల్లోని 46 జిల్లాలకు చెందిన జిల్లా న్యాయమూర్తులు కూడా ఇందులో పాల్గొంటారని అధికారవర్గాలు తెలిపాయి. మే 20న పది రాష్ట్రాల్లోని 54 జిల్లాలకు చెందిన ఉన్నతాధికారులతోనూ ఇదేవిధంగా ప్రధాని మరోమారు మాట్లాడనున్నారు. కరోనాపై పోరులో క్షేత్రస్థాయి అధికారులు కీలకమని పీఎంవో వ్యాఖ్యానించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని