మన టీకాలు కలిపేద్దామా..?

ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌పై సందేహాలు వ్యక్తమవుతున్న సమయంలో వ్యాక్సిన్‌ సమర్థతను మరోసారి పరీక్షించేందుకు ఆ సంస్థ సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రష్యాకు చెందిన స్పుత్నిక్‌-వి వ్యాక్సిన్‌ రూపకర్తలు స్పందించారు.............

Published : 28 Nov 2020 00:42 IST

ఆస్ట్రాజెనెకాకు స్పుత్నిక్‌ రూపకర్తల ప్రతిపాదన

మాస్కో: ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌పై సందేహాలు వ్యక్తమవుతున్న సమయంలో వ్యాక్సిన్‌ సమర్థతను మరోసారి పరీక్షించేందుకు ఆ సంస్థ సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రష్యాకు చెందిన స్పుత్నిక్‌-వి వ్యాక్సిన్‌ రూపకర్తలు స్పందించారు. వ్యాక్సిన్‌ సమర్థతను పెంచేందుకు ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ను స్పుత్నిక్‌ వ్యాక్సిన్‌తో కలిపేందుకు ప్రయత్నించాలని ప్రతిపాదించారు. ‘మరోసారి కొత్తగా పరిశోధనలు ప్రారంభించే బదులు, మేం తయారుచేసిన వ్యాక్సిన్‌తో ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ కలపవచ్చు. ఈ రెండూ మానవ అడినోవైరస్‌ వెక్టార్‌ను వినియోగించి అభివృద్ధి చేసినవే. ఒకవేళ ఇలాచేస్తే మరింత సమర్థవంతమైన వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తేవచ్చు’ అని స్పుత్నిక్‌ వ్యాక్సిన్‌ రూపకర్తలు ఆస్ట్రాజెనెకాకు సూచిస్తూ ట్విటర్‌లో వెల్లడించారు. 

తొలి విశ్లేషణ నివేదిక ప్రకారం.. తమ వ్యాక్సిన్‌ 92శాతం ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు స్పుత్నిక్‌ ఇప్పటికే ప్రకటించింది. రెండోసారి విశ్లేషణలో 95శాతం సమర్థతను కనబరిచినట్లు ఈ మధ్యే వెల్లడించింది. అయితే, ఆస్ట్రాజెనెకా మాత్రం 70శాతం సమర్థత కలిగివుందని, మరో విధానంలో 90శాతం వరకు ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు ప్రకటించింది. సమర్థత తక్కువగానే ఉన్నప్పటికీ దీన్ని వ్యాక్సిన్‌లలో గేమ్‌ ఛేంజర్‌గానే అభివర్ణిస్తున్నారు. ముఖ్యంగా టీకా ధర చాలా తక్కువగా ఉండటం, సాధారణ రిఫ్రిజిరేటర్లలోనే నిల్వ ఉంచుకోవడం కారణంగా దీనికి మరింత ప్రాధాన్యత ఏర్పడింది. అయితే, ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనెకా టీకా భిన్న డోసుల మధ్య సమర్థత విషయంలో వైరుధ్యం తలెత్తడంతో నిపుణులు అనేక సందేహాలు వ్యక్తంచేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీకా సమర్థతను తేల్చేందుకు మరోసారి ప్రయోగాలు జరపాలని భావిస్తున్నట్లు కంపెనీ సీఈవో పాస్కల్‌ సోరియట్‌ తెలిపారు.

సైనిక బలగాలకు టీకా పంపిణీకి సిద్ధం!
గతకొన్ని రోజులుగా రష్యాలో కరోనా వైరస్‌ తీవ్రత పెరిగింది. రోజువారీ కేసుల సంఖ్య పెరగడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ముందుగా ఆ దేశానికి చెందిన 4లక్షల మంది సైనిక బలగాలకు టీకాను ఇచ్చేందుకు సన్నద్ధం అవుతున్నట్లు రష్యా రక్షణశాఖ మంత్రి సెర్గీ షోయగు వెల్లడించారు. ఇప్పటికే 2500 మంది సైనిక సిబ్బంది టీకాను ఇచ్చినట్లు ఆయన తెలిపారు. ఈ ఏడాది చివరినాటికి దాదాపు 80వేల మంది సైనిక సిబ్బందికి కరోనా టీకాను ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. 
ఇదిలా ఉంటే, రష్యాలో ఇప్పటివరకు 22,15,133 కేసులు నమోదుకాగా వీరిలో 38,558 మంది రోగులు మృత్యువాతపడ్డారు. మిగతా దేశాలతో పోలిస్తే కొవిడ్‌ మరణాల రేటు రష్యాలో కాస్త తక్కువగానే ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని