వైద్య కళాశాలల్లో 50% ఓబీసీ కోటాకు సుప్రీం ‘నో’!

వైద్య కళాశాలల్లో 50శాతం ఓబీసీ కోటాతో సీట్ల కేటాయింపు వ్యవహారంలో తమిళనాడుకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలోని వైద్య కళాశాలల్లో నీట్‌ ద్వారా భర్తీచేసే అఖిల భారత కోటా సీట్లలో ఈ...........

Updated : 26 Oct 2020 15:34 IST

సుప్రీంకోర్టులో తమిళనాడుకు చుక్కెదురు

దిల్లీ: వైద్య కళాశాలల్లో 50శాతం ఓబీసీ కోటాతో సీట్ల కేటాయింపు వ్యవహారంలో తమిళనాడుకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలోని వైద్య కళాశాలల్లో నీట్‌ ద్వారా భర్తీచేసే అఖిల భారత కోటా సీట్లలో ఈ ఏడాది 50% ఓబీసీలకు కేటాయించాలన్న తమిళనాడు ప్రభుత్వ అభ్యర్థనను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. అధికార పార్టీ అన్నాడీఎంకే, ప్రతిపక్ష పార్టీ డీఎంకే దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్‌ ఎల్‌.నాగేశ్వరరావు నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. ఈ ఏడాది వైద్య కళాశాలల్లో 50శాతం ఓబీసీ రిజర్వేషన్లు సాధ్యం కాదని కేంద్రం చెప్పడంతో ఈ రెండు పార్టీలూ కలిసి కోర్టును ఆశ్రయించాయి. అయితే, విద్యార్థులు జనవరి - ఫిబ్రవరి మాసాల్లో దరఖాస్తులు నింపినందున వారికి ఓబీసీ రిజర్వేషన్ల ప్రయోజనాలను విస్తరించడం ఈ ఏడాది సాధ్యం కాదని కేంద్రప్రభుత్వం ఇటీవలే సుప్రీంకోర్టుకు కూడా తెలిపింది. 

జులై 27న ఇదే అంశంపై మద్రాస్‌ హైకోర్టు కూడా విచారణ జరిపింది. కేంద్ర నిర్వహణలో లేని విద్యా సంస్థల్లో ఆల్‌ ఇండియా కోటా కింద ఓబీసీ విద్యార్థులకు 50శాతం రిజర్వేషన్ల పరిశీలనకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ, తమిళనాడు ఆరోగ్యశాఖ, అఖిలభారత వైద్య మండలితో కమిటీ ఏర్పాటు చేయాలని హైకోర్టు కేంద్రానికి సూచించిన విషయం తెలిసిందే. మూడు నెలల్లో కమిటీ నియమించి రిజర్వేషన్లు కల్పించడానికి అవసరమైన నిర్ణయాలు తీసుకోవాలని సూచించింది. అయితే, ఈ నిర్ణయాలు వచ్చే సంవత్సరం నుంచి అమలు చేయాలని ఆదేశించింది. అయితే, మద్రాస్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ ఈ విద్యా సంవత్సరంలోనే 50శాతం కోటా అమలు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని ఆయా పార్టీలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని