మళ్లీ గెలుపు దిశగా..ఆంగ్‌ సాన్‌ సూకీ!

ఆదివారం మయన్మార్‌లో జరిగిన సాధారణ ఎన్నికల్లో నోబెల్‌ శాంతి బహుమతి విజేత ఆంగ్‌ సాన్‌ సూకీ మరోసారి విజయం సాధించబోతున్నట్లు తెలుస్తోంది.

Published : 09 Nov 2020 01:56 IST

మయన్మార్‌లో ఎన్నికలు ప్రశాంతం

యాంగోన్‌: ఆదివారం మయన్మార్‌లో జరిగిన సాధారణ ఎన్నికల్లో నోబెల్‌ శాంతి బహుమతి విజేత ఆంగ్‌ సాన్‌ సూకీ మరోసారి విజయం సాధించబోతున్నట్లు తెలుస్తోంది. భారీ సంఖ్యలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం, వారిలో ఎక్కువశాతం సూకీ వైపే మొగ్గుచూపడంతో సూకీ విజయం ఖాయమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే, సూకీ నాయకత్వానికి రెఫరెండంగానే ఈ ఎన్నికలను భావిస్తున్నారు.

ఐదు దశాబ్దాల సుదీర్ఘ సైనిక పాలన అనంతరం మయన్మార్‌లో మొట్టమొదటిసారిగా 2015లో ప్రజాస్వామ్య ఎన్నికలు జరిగాయి. నేషనల్‌ లీగ్‌ డెమొక్రాటిక్‌ పార్టీ(NLD)కి చెందిన సూకీ తొలిసారి ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుపొందారు. ప్రస్తుతం జరిగిన ఎన్నికల్లోనూ ఓటర్లు భారీ స్థాయిలో పాల్గొన్నట్లు అక్కడి మీడియా పేర్కొంది. దేశవ్యాప్తంగా సూకీ కే ఎక్కువ ప్రజాదరణ ఉండటం, ప్రతిపక్షాల ప్రభావం తక్కువగా ఉండడంతో మరోసారి ఆమె అధికారంలోకి వచ్చే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు.

ముందస్తు ఓటింగ్‌..

దాదాపు 90 రాజకీయ పార్టీలు ఈ ఎన్నికల పోటీలో నిలిచాయి. దేశంలో మొత్తం 3.8కోట్ల మంది ఓటర్లు ఉండగా వీరిలో 50లక్షల మంది కొత్తగా ఓటు హక్కు పొందిన వారే కావడం విశేషం. 60ఏళ్లకు పైబడిన వారు ఇక్కడ కూడా ముందస్తు ఓటింగ్‌కు అనుమతిచ్చారు. దీంతో చాలా మంది వృద్ధులు ముందస్తు పోలింగ్‌లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. 75ఏళ్ల ఆంగ్‌ సాన్‌ సూకీ కూడా ముందస్తుగానే తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. సోమవారం నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది.

పెరిగిన ఓటింగ్‌ శాతం..

ఉదయం ఆరుగంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఓటింగ్‌ను అనుమతించారు. దీంతో ఉదయాన్నే పోలింగ్‌ కేంద్రాల వద్ద భారీ సంఖ్యలో ఓటర్లు క్యూ కట్టినట్లు అధికారులు వెల్లడించారు. ఈసారి ఓటింగ్‌ శాతం కూడా అంచనా వేసిన దానికంటే ఎక్కువగానే నమోదయ్యిందని పోలింగ్‌ అధికారులు పేర్కొన్నారు. సంపూర్ణ ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటున్న ఓటర్లు, రాజకీయ అస్థిరతకు చరమగీతం పాడాలనే ఉద్దేశంతో పోలింగ్‌లో పాల్గొన్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, అక్కడ సైనిక, ప్రభుత్వ అధికారుల మధ్య ఘర్షణ వాతావరణం ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈసారి పూర్తిస్థాయి ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఓటర్లు తమ మద్దతు తెలిపినట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఇదిలాఉంటే, కరోనా వైరస్‌ ప్రభావం ఉన్నప్పటికీ పోలింగ్‌ కేంద్రాల్లో మాస్కులు ధరించడాన్ని తప్పనిసరి చేశారు. దీంతో ఓటర్లు మాస్కులు, ఫేస్‌ షీల్డ్‌లు ధరించి ఎన్నికల్లో పాల్గొన్నారు. అంతేకాకుండా పోలింగ్‌ కేంద్రాల వద్ద శానిటైజర్లు, థర్మల్‌ చెకింగ్‌ వ్యవస్థను కూడా అధికారులు ఏర్పాటు చేశారు. అయితే, ఎన్నికల్లో పాల్గొన్నవారు భౌతిక దూరాన్ని పాటించడంలో విఫలమయినట్లు తెలుస్తోంది.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని