పీఎం కేర్స్‌ నిధుల మళ్లింపుపై సుప్రీం తీర్పు

పీఎం కేర్స్‌ ఫండ్‌ సహాయ నిధులను.. జాతీయ విపత్తు సహాయ నిధికి మళ్లించే విధంగా ఆదేశాలు జారీచేయటం సాధ్యం కాదని భారత సర్వోన్నత న్యాయస్థానం తీర్పు వెలువరించింది.

Updated : 18 Aug 2020 14:31 IST

దిల్లీ: కరోనా వైరస్‌ సహాయక చర్యల కోసం ఉద్దేశించిన పీఎం కేర్స్‌ ఫండ్‌ నిధులను.. జాతీయ విపత్తు సహాయ నిధికి (ఎన్‌డీఆర్‌ఎఫ్‌) మళ్లించే విధంగా ఆదేశాలు జారీచేయటం సాధ్యం కాదని సుప్రీంకోర్టు  తీర్పు వెలువరించింది. ఆ విధంగా చేయాల్సిందిగా ప్రభుత్వానికి మార్గదర్శకాలను జారీచేయలేమని స్పష్టం చేసింది.

కరోనా వైరస్‌ మహమ్మారిని ఎదుర్కోవటానికి, సహాయ కార్యక్రమాల నిర్వహణకు పీఎం కేర్స్‌ సహాయ నిధిని కేంద్రం మార్చి 28న నెలకొల్పిన సంగతి తెలిసిందే. కాగా, పీఎం కేర్స్‌ సహాయ నిధి తరపున సేకరించిన నిధులను..ఎన్‌డీఆర్‌ఎఫ్‌కు  మళ్లించాలని ‘సెంటర్‌ ఫర్‌ పబ్లిక్‌ ఇంట్రెస్ట్‌ లిటిగేషన్‌’ అనే స్వచ్ఛంద సంస్థ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేసింది. ఈ కేసు విచారణను జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌, జస్టిస్‌ ఆర్‌ సుభాష్‌‌ రెడ్డి, జస్టిస్‌ ఎం.ఆర్‌ షాలు సభ్యులుగా ఉన్న సుప్రీంకోర్టు ధర్మాసనం చేపట్టింది.

ఈ అంశంపై ధర్మాసనం వీడియో కాన్ఫరెన్స్‌ మాధ్యమం ద్వారా నేడు తీర్పు వెలువరించింది. స్వచ్ఛంద విరాళాల రూపంలో పీఎం కేర్స్‌ సహాయ నిధిని సేకరించిన ఉద్దేశం వేరని కోర్టు అభిప్రాయపడింది. జాతీయ విపత్తు సహాయ నిధికి ఎవరైనా నిధులు సమకూర్చవచ్చన్న న్యాయస్థానం, పీఎం కేర్స్‌ నిధుల మళ్లింపు సరైన చర్య అని ప్రభుత్వం భావించినట్టయితే... ఆ విధంగా చేయవచ్చని సూచించింది. అయితే పీఎం కేర్స్‌ నిధులు మళ్లించాల్సిందిగా ప్రభుత్వాన్ని తాము ఆదేశించలేమని ధర్మాసనం స్పష్టం చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని