టీకా వేయించుకున్న సీరమ్‌ అధినేత

కరోనా మహమ్మారిని దేశం నుంచి తరిమికొట్టే బృహత్తర కార్యక్రమం మొదలైంది. దేశవ్యాప్తంగా టీకా పంపిణీ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేడు ప్రారంభించారు. తొలిరోజు.. కరోనాపై పోరులో ముందున్న

Updated : 16 Jan 2021 15:10 IST

పుణె: కరోనా మహమ్మారిని దేశం నుంచి తరిమికొట్టే బృహత్తర కార్యక్రమం మొదలైంది. దేశవ్యాప్తంగా టీకా పంపిణీ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేడు ప్రారంభించారు. తొలిరోజు.. కరోనాపై పోరులో ముందున్న ఆరోగ్య కార్యకర్తలు, పారిశుద్ధ్య కార్మికులకు ఆయా రాష్ట్రాల్లో టీకాలు వేస్తున్నారు. వ్యాక్సిన్‌ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించి దేశానికి తొలి టీకా అందించిన సీరమ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా అధినేత అదర్‌ పూనావాలా కూడా నేడు టీకా తీసుకున్నారు. 

ఈ విషయాన్ని అదర్‌ ట్విటర్‌లో వెల్లడించారు. ‘‘ప్రపంచంలోనే అతిపెద్ద టీకా పంపిణీ కార్యక్రమంలో ప్రధాని మోదీ, యావత్‌ భారతావని విజయం సాధించాలని కోరుకుంటున్నా. ఈ చారిత్రక ఘట్టంలో ‘కొవిషీల్డ్‌’ కూడా భాగస్వామికావడం నాకు మరింత గర్వంగా ఉంది. టీకా భద్రత, సమర్థతపై ప్రజలకు మరింత విశ్వాసం కలిగించేందుకు ఆరోగ్య కార్యకర్తలతో పాటు నేను కూడా వ్యాక్సిన్‌ తీసుకున్నా’ అని పేర్కొన్నారు. టీకా తీసుకున్న వీడియోను ఆయన పంచుకున్నారు. 

ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనెకా భాగస్వామ్యంతో సీరమ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా తయారుచేసిన ‘కొవిషీల్డ్‌’ అత్యవసర వినియోగానికి కేంద్రం అనుమతులు మంజూరు చేసిన విషయం తెలిసిందే. టీకా పంపిణీ కోసం కేంద్రం.. సీరం సంస్థ నుంచి 1.1 కోట్ల డోసులను ఆర్డర్‌ చేసింది. ఇక మరో సంస్థ భారత్‌ బయోటెక్‌ తయారుచేసిన ‘కొవాగ్జిన్‌’ అత్యవసర వినియోగానికి కూడా కేంద్రం ఆమోదముద్ర వేసింది. 

దేశవ్యాప్తంగా 3006 కేంద్రాల్లో నేటి నుంచి టీకా పంపిణీ ప్రారంభమైంది. తొలి రోజు 3లక్షల మంది ఆరోగ్య కార్యకర్తలకు టీకా వేయనున్నారు. టీకా పంపిణీ ప్రారంభం సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. శాస్త్రవేత్తల కృషిని కొనియాడారు. విదేశాలతో పోలిస్తే భారత్‌లో వ్యాక్సిన్‌ ధరలు చౌకగా ఉన్నాయని తెలిపారు. 

ఇవీ చదవండి..

అతిపెద్ద వ్యాక్సిన్‌ ప్రక్రియ ప్రారంభం

కన్నీటిపర్యంతమైన మోదీ


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని