Farmers Protest: శంభు వద్ద ఉద్రిక్తత.. మరోదఫా చర్చలకు కేంద్రం ఆహ్వానం

Farmers Protest: ‘దిల్లీ చలో’ మార్చ్‌కు సిద్ధమవుతోన్న రైతులను కేంద్రం మరోసారి చర్చలకు ఆహ్వానించింది.

Updated : 21 Feb 2024 12:54 IST

దిల్లీ: రైతులు మరోసారి ‘దిల్లీ చలో’ మార్చ్‌కు సన్నద్ధమవుతోన్న తరుణంలో.. పంజాబ్‌- హరియాణా సరిహద్దు శంభు వద్ద ఉద్రిక్తత నెలకొంది. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్‌ను ప్రయోగించారు. అదే సమయంలో కేంద్రం వారిని మరోసారి చర్చలకు ఆహ్వానించింది.ఈ మేరకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్ ముండా ఎక్స్‌(ట్విటర్‌)లో పోస్టు పెట్టారు. ‘రైతుల డిమాండ్లపై  మరో దఫా చర్చించేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది. చర్చలకు రైతు సంఘం నాయకులను మరోసారి ఆహ్వానిస్తున్నాను. శాంతియుత వాతావరణాన్ని కొనసాగించడం ముఖ్యం’ అని దానిలో పేర్కొన్నారు.  ఇప్పటికే రెండు వర్గాల మధ్య నాలుగు దఫాలుగా చర్చలు జరిగినప్పటికీ ఎలాంటి ఫలితం లభించలేదు. ప్రస్తుతానికి రైతుల వైపు నుంచి ఎలాంటి స్పందనా రాలేదన్నారు. వారి డిమాండ్లను పరిష్కరించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని చెప్పారు.

ఇదిలా ఉంటే.. రైతుల నిరసనల వల్ల  దేశ రాజధాని, దాని సరిహద్దు ప్రాంతాల్లో శాంతిభద్రతలకు భంగం వాటిల్లకుండా హరియాణా పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు. పొక్లెయిన్లు, జేసీబీ ఆపరేటర్లను హెచ్చరికలు జారీ చేశారు. ‘మీ భారీ మెషినరీతో ఆందోళనకారులకు సహకరించవద్దు. వాటివల్ల సరిహద్దుల వద్ద మోహరించిన భద్రతా సిబ్బందికి హాని కలిగే అవకాశం ఉంటుంది. ఇది నాన్‌ బెయిలబుల్ నేరం’ అని హెచ్చరించారు. 

రైతులకు మద్దతుగా కాంగ్రెస్‌: ఖర్గే

తమ పార్టీ రైతులకు అండగా ఉంటుందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వెల్లడించారు. ‘వారి డిమాండ్లకు పరిష్కారం లభించాలి. కొన్ని అవసరమైన పంటలకు కనీస మద్దతు ధర విషయంలో చట్టబద్ధత ఉండాలి’ అని ఖర్గే అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు