Omicron: యూపీ ఎన్నికలు వాయిదా వేయండి.. ర్యాలీలను నిషేధించండి..!

దేశంలో ఒమిక్రాన్‌ వ్యాప్తి నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్‌ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వైరస్‌ ఉద్ధృతి దృష్ట్యా యూపీతో సహా పలు

Published : 24 Dec 2021 11:08 IST

ఒమిక్రాన్‌ వ్యాప్తి నేపథ్యంలో అలహాబాద్‌ హైకోర్టు వ్యాఖ్యలు

ప్రయాగ్‌రాజ్‌: దేశంలో ఒమిక్రాన్‌ వ్యాప్తి నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్‌ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వైరస్‌ ఉద్ధృతి దృష్ట్యా యూపీతో సహా పలు రాష్ట్రాల్లో మరికొద్ది నెలల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేయాలని కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరింది. అంతేగాక, ఆయా రాష్ట్రాల్లో చేపడుతున్న ఎన్నికల ప్రచార ర్యాలీలపై నిషేధం విధించాలని సూచించింది. ఓ బెయిల్‌ పిటిషన్‌పై విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది.

‘‘ఒమిక్రాన్‌ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే చైనా, నెదర్లాండ్స్‌, జర్మనీ వంటి దేశాలు లాక్‌డౌన్‌ తరహా ఆంక్షలు తీసుకొచ్చాయి. మన దేశంలోనూ ఒమిక్రాన్‌ కేసులు నానాటికీ పెరుగుతున్నాయి. కొవిడ్‌ రెండో దశ ఉద్ధృతి సమయంలో లక్షలాది మంది ప్రాణాలు కోల్పోవడం చూశాం. ఉత్తరప్రదేశ్‌లో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలు, పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆయా రాష్ట్రాల్లో కేసులు, మరణాలు పెరిగాయి. వీటన్నింటిని మనం పరిగణనలోకి తీసుకోవాలి’’ అని జస్టిస్‌ శేఖర్ కుమార్‌ యాదవ్‌ అన్నారు.

ఇక ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ర్యాలీలు నిర్వహిస్తున్నాయి. అయితే లక్షలాది మంది పాల్గొంటున్న ఈ ర్యాలీల్లో కొవిడ్‌ నిబంధనలు పాటించడం అసాధ్యమే అని కోర్టు వ్యాఖ్యానించింది. అందువల్ల అలాంటి ర్యాలీలను నిషేధించాలని ఎన్నికల సంఘాన్ని కోరింది. రాజకీయ పార్టీలు టీవీ ఛానళ్లు, వార్తా పత్రికల ద్వారా ప్రచారం చేసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని తెలిపింది. ఇక వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చిలో జరగనున్న యూపీ సహా పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను కూడా.. వీలైతే రెండు నెలల పాటు వాయిదా వేయాలని కోరింది. ‘‘మనుషులు ప్రాణాలతో ఉంటేనే కదా.. ప్రచారాలైనా.. ఎన్నికలైనా. ఒకవేళ ఇప్పుడు చర్యలు తీసుకోకపోతే రెండో దశ కంటే దారుణమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది’’ అని కోర్టు వ్యాఖ్యానించింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని