Amitabh Bachan: ‘హేయ్‌ ట్విటర్‌.. బ్లూ టిక్‌కు డబ్బులు చెల్లించా’.. వెరిఫికేషన్ బ్యాడ్జ్‌పై అమితాబ్‌ ట్వీట్

ట్విటర్‌ (Twitter) ఖాతాలకు బ్లూ టిక్‌ వెరిఫికేషన బ్యాడ్జ్‌ను తొలగించడంపై పలువురు సెలబ్రిటీలు స్పందించారు. బ్లూ టిక్‌ లేకున్నా తమ ప్రయాణం సాగుతుందని ఒకరు ట్వీట్ చేయగా, సబ్‌స్క్రిప్షన్‌ నగదు చెల్లించినా బ్లూ టిక్‌ తొలగించారని మరొకరు ఆరోపించారు. 

Published : 21 Apr 2023 20:43 IST

ముంబయి: ట్విటర్‌ (Twitter) బ్లూ టిక్‌ సబ్‌స్క్రిప్షన్‌ తీసుకొని యూజర్లకు వెరిఫికేషన్‌ బ్యాడ్జ్‌ను ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) తొలగించారు. దీంతో దేశవ్యాప్తంగా పలువురు సెలబ్రిటీలు, మీడియా సంస్థలు, రాజకీయ నాయకులు బ్లూ టిక్‌ను కోల్పోయారు. దీంతో తమ స్పందన తెలియజేస్తూ సెలబ్రిటీలు ట్వీట్‌ చేస్తున్నారు. తాజాగా.. బిగ్‌బి అమితాబ్‌ బచ్చన్‌ (Amitabh Bachchan) చేసిన ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. ట్విటర్‌ బ్లూ సబ్‌స్క్రిప్షన్‌ తీసుకున్నప్పటికీ.. తన వెరిఫికేషన్‌ బ్యాడ్జ్‌ను తొలగించారని ఆయన తెలిపారు. 

‘‘హేయ్‌ ట్విటర్‌, వింటున్నావా? నేను బ్లూ సబ్‌స్క్రిప్షన్‌ సర్వీస్‌కు నగదు చెల్లించాను. దయచేసి నా పేరు బ్లూ బ్యాడ్జ్‌ను తిరిగి ఇవ్వండి. దాంతో నేనే అమితాబ్‌ బచ్చన్‌ అని ప్రజలకు తెలుస్తుంది. చేతులు జోడించి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. లేదంటే మీ కాళ్లపై పడి వేడుకోమంటారా?అని బిగ్ బి ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ చూసిన నెటిజన్లు సరదా కామెంట్లు చేస్తున్నారు. ‘ఓపికకు బహుమానం బ్లూ టిక్‌’, ‘బ్లూ టిక్‌ కావాలంటే మరో నాలుగు రోజులు ఆగాల్సిందే’, ‘బచ్చన్‌ సాబ్‌.. మస్క్‌ విదేశీయుడు. ఆయన ఎవరి మాట వినడు. బ్లూ టిక్ కోసం మీరు కొన్ని రోజులు ఆగాల్సిందే’ అంటూ ట్వీట్లు చేశారు. 

బ్లూ టిక్‌ తొలగించడంపై క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ (Sachin Tendulkar) సైతం స్పందించారు. ఇప్పటికి ఇదే నా బ్లూ టిక్ వెరిఫికేషన్‌ అంటూ చేతితో స్మైలీ సింబల్‌ను చూపిస్తున్న ఫొటోను ట్వీట్ చేశారు. నటుడు ప్రకాశ్‌ రాజ్‌ (Prakash Raj) సైతం ‘‘బై బై బ్లూ టిక్‌.. ఇన్ని రోజులు నిన్ను కలిగి ఉన్నందుకు సంతోషం. ప్రజలతో నా ప్రయాణం, నా సంభాషణలు, నా షేరింగ్‌లు ఎప్పటిలానే కొనసాగుతాయి’’ అని ట్వీట్‌ చేశారు. వీరితోపాటు మరికొంత మంది సెలబ్రిటీలు సైతం బ్లూ టిక్‌ లేకున్నా ట్విటర్‌లో తమ ప్రయాణం కొనసాగుతుందని ట్వీట్‌ చేశారు. మరికొంత మంది బ్లూ టిక్‌ సబ్‌స్క్రిప్షన్‌కు నగదు చెల్లించినా.. తమ ఖాతాకు వెరిఫికేషన్‌ బ్యాడ్జ్‌ తీసేశారని ట్వీట్లు చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని