
డీలిమిటేషన్ తర్వాత జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు: అమిత్ షా
దిల్లీ: జమ్మూకశ్మీర్‌లో నియోజకవర్గాల పునర్‌వ్యవస్థీకరణ ప్రక్రియ పూర్తయిన తర్వాత అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. ప్రస్తుతం ఆ ప్రక్రియ కొనసాగుతోందని వివరించారు. అలాగే, ఇక్కడ సాధారణ పరిస్థితులు నెలకొన్న తర్వాత రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తామని ఉద్ఘాటించారు. జమ్మూకశ్మీర్‌కు సంబంధించిన ‘డిస్ట్రిక్ట్ గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్’ విడుదల కార్యక్రమంలో వర్చువల్‌గా జరిగిన అమిత్ షా శనివారం మాట్లాడారు. జమ్మూకశ్మీర్ అభివృద్ధే ప్రధాని మోదీ ధ్యేయమని, అందుకు అనుగుణంగా ఈ ప్రాంతం సర్వతోముఖాభివృద్ధికి కృషి జరుగుతోందని వివరించారు.
జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరణకు కట్టుబడి ఉన్నామని, గతంలో తాను పార్లమెంట్ వేదికగానే ఈ ప్రకటన చేసిన విషయాన్ని అమిత్ షా గుర్తుచేశారు. ఇక్కడి ప్రజలను గందరగోళ పరిచేందుకే కొందరు అసత్యాలను ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అలాంటివారి వలలో పడొద్దని యువతకు ప్రజలకు హితవు పలికారు. జమ్మూకశ్మీర్‌లో ప్రజాస్వామ్యం పరిఢవిల్లినప్పుడే అభివృద్ధి సాధ్యమని చెప్పారు. కాబట్టి ఎవరో స్వార్థపూరిత ప్రయోజనాల కోసం చేసే ప్రకటనలను పట్టించుకోకుండా ప్రధాని మోదీ పట్ల, జమ్మూకశ్మీర్ అడ్మినిస్ట్రేషన్ పట్ల విశ్వాసం ఉంచాలని స్థానిక యువతకు హితవు పలికారు.
జమ్మూకశ్మీర్‌కు పెట్టుబడులు రావడం మొదలైందని, ఇప్పటికే రూ.12వేల కోట్లు పెట్టుబడులు వచ్చాయని అమిత్ షా తెలిపారు. పర్యాటకుల రాకపోకలు సైతం పెరిగాయన్నారు. ఆర్టికల్ 370 రద్దు కంటే ముందు 87 మంది ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎంపీలు ఉండేవారని, వారంతా మూడు కుటుంబాలకు చెందిన వారేనని దుయ్యబట్టారు. పంచాయతీ రాజ్ వ్యవస్థ అమల్లోకి వచ్చాక ఇప్పుడు 30 వేలమంది పంచాయతీ సభ్యులు ప్రజా సేవలో ఉన్నారని చెప్పారు. ఆర్టికల్ 370ను పునరుద్ధరిస్తేనే జమ్మూకశ్మీర్‌లో శాంతిభద్రతలు మెరుగుపడతాయని కొందరు వాదిస్తున్నారని, కానీ, ఇప్పటికే పరిస్థితులు మెరుగయ్యాయని చెప్పారు. 40 శాతం మేర ఉగ్రవాద దాడులు తగ్గాయని వివరించారు. జమ్మూకశ్మీర్‌కు కేంద్రం కేటాయించే బడ్జెట్ రూ.9వేల కోట్ల నుంచి రూ.21వేల కోట్లకు పెరిగిందని, దీని బట్టి ప్రధాని జమ్మూకశ్మీర్‌కు ఇస్తున్న ప్రాధాన్యం ఎలాంటిదో గుర్తించాలని అమిత్ షా విజ్ఞప్తి చేశారు.