Azadi Ka Amrit Mahotsav: అడవిలో అగ్గి బరాటా
విద్య, వైద్యం, భూములను ఎరవేసి మత మార్పిళ్లకు పాల్పడుతున్న తెల్లదొరలు, మిషనరీలను చూసి ఆ ఆదివాసీ యువకుడి రక్తం మరిగింది. తమను జలగల్లా పీల్చుకుతింటున్న పాలకుల తీరుపై
విద్య, వైద్యం, భూములను ఎరవేసి మత మార్పిళ్లకు పాల్పడుతున్న తెల్లదొరలు, మిషనరీలను చూసి ఆ ఆదివాసీ యువకుడి రక్తం మరిగింది. తమను జలగల్లా పీల్చుకుతింటున్న పాలకుల తీరుపై ఆయన గుండె రగిలిపోయింది. స్వరాజ్య సాధనే లక్ష్యంగా సాయుధ పోరాటం నడిపిన ఆ విప్లవవీరుడు బ్రిటిష్ వారిని వణికించాడు. ఆదివాసీలకు ఆరాధ్యదైవమయ్యాడు. ఆ పోరాట యోధుడే.. బిర్సా ముండా!
ఝార్ఖండ్‌లోని ఖుంటీ జిల్లా ఉలీహాతు గ్రామంలో 1875 నవంబరు 15న సుగుణా ముండా, కర్మిహాటు ఆదివాసీ దంపతులకు బిర్సా ముండా జన్మించారు. చిన్నతనంలో గొర్రెలు మేపుతూ కుటుంబానికి అండగా నిలిచిన బిర్సా... తర్వాత సాల్గా గ్రామంలో మేనమామ వద్ద ఉంటూ ప్రాథమిక విద్య పూర్తిచేశారు. అనంతరం చాయిబసాలోని మిషనరీ పాఠశాలలో చేరారు. ఇందుకోసం క్రైస్తవంలోకి మారాల్సి వచ్చింది. బిర్సా ముండా పేరు ‘బిర్సా డేవిడ్’గా మారింది. అందులో చదువుకుంటూనే పాశ్చాత్య దేశాల చరిత్ర, ఆధునిక శాస్త్ర విజ్ఞానాన్ని ఆకళింపు చేసుకున్నారు. అప్పట్లో ఆదివాసీల భూములపై బ్రిటిష్ పాలకులు అధిక పన్నులు వేసేవారు. చెల్లించని వారి ఆస్తులను లాక్కునేవారు. క్రైస్తవంలోకి మారితే పన్నులను మాఫీ చేస్తామని, భూములను తిరిగిచ్చి, హక్కులను కల్పిస్తామని మభ్యపెట్టేవారు. వారి ప్రలోభాలతో అప్పట్లో 6 లక్షల మంది గిరిజనులు క్రైస్తవం పుచ్చుకున్నారు. బ్రిటిషర్లకు ఎదురుతిరిగి, వారు పెట్టే బాధలు పడలేక చాలామంది ఆదివాసీలు అస్సాంలోని తేయాకు తోటల్లోకి కూలీలుగా వెళ్లేవారు. తమ భూములను తిరిగిచ్చేయాలని ఒకరోజు ముండా తెగ పెద్దలతో కలిసి బిర్సా... తెల్లదొరలపై ఒత్తిడి చేశారు. దాంతో మిషనరీ పాఠశాల ఆయన్ను బహిష్కరించింది. దీన్ని సవాల్‌గా తీసుకున్న బిర్సా... వారి ఎదుటే నుదుట నామం పెట్టి, జంధ్యం ధరించారు. ఇకపై క్రైస్తవంలోకి ఒక్క ఆదివాసీని కూడా మారకుండా చూస్తానని ప్రతినబూనారు.
ఆదివాసీలకు ప్రత్యేక మతం
తెల్లవారిని తరిమికొట్టాలనే లక్ష్యంతో... డొంబరీ పర్వత ప్రాంతంలో 1894 అక్టోబరు 1న బిర్సా ప్రత్యేక సైన్యాన్ని తయారు చేశారు. ఆదివాసీల్లో చైతన్యం నింపేందుకు తరచూ సమావేశాలు నిర్వహించారు. దీంతో రగిలిపోయిన తెల్లదొరలు 1895 ఆగస్టులో ఆయన్ను అరెస్టు చేసి హజారీబాగ్ జైలులో బంధించారు. ఆయన శిష్యులు, ఆదివాసీలు పెద్దఎత్తున ఆందోళనలు నిర్వహించగా 1897 నవంబరులో విడుదల చేశారు. బ్రిటిషర్లతో ముండా, సంతాల్, ఒరియాన్, కోల్ జాతి తెగలు ఎప్పటికైనా ప్రమాదంలో పడే అవకాశముందని భావించిన బిర్సా... ప్రత్యేకంగా బిర్సాయిత్ మతాన్ని స్థాపించారు. ఆయా తెగలకు ఆధ్యాత్మిక అంశాలు బోధించేవారు. ఐకమత్యంగా ఉండాల్సిన అవసరాన్ని స్పష్టం చేసేవారు. ప్రకృతి వైద్యంతో ఎంతోమంది ఆదివాసీలను కాపాడారు. ఆయన నిర్వహించిన సేవా కార్యక్రమాలు నచ్చిన ఆదివాసీలు బిర్సా ముండాను ‘ధర్తీ ఆబా’(దేవుడు)గా కొలిచేవారు.
7వేల మందితో...
తెల్లదొరలకు వ్యతిరేకంగా 1899 డిసెంబరులో ఉల్ గులాన్ (తిరుగుబాటు) పేరిట పెద్దఎత్తున ర్యాలీ నిర్వహించారు బిర్సా ముండా. అందులో 7వేల మంది పాల్గొన్నారు. ఆయనతో తమకు ముప్పు తప్పదని గ్రహించిన ఆంగ్లేయ పాలకులు నిఘా పెంచారు. బిర్సా ఆచూకీ తెలపాలని ఆదివాసీలను నిర్బంధిస్తూ, వారిపై దాడులకు దిగేవారు. వీటిని సహించని బిర్సా శిష్యులు 1900 జనవరి 5న ఎట్కెడి ప్రాంతంలో ఇద్దరు పోలీసులను చంపేశారు. రెండు రోజుల తర్వాత ఖుంటీ ఠాణాపై దాడికి దిగి, మరో కానిస్టేబుల్‌ను హతమార్చారు. దీంతో రగిలిపోయిన పోలీసులు బిర్సాపై రూ.500 రివార్డు ప్రకటించారు. అడవులు, పర్వత ప్రాంతాల్లో విస్తృతంగా గాలించారు. చివరికి 1900 ఫిబ్రవరి 3న జంకోపాయి అటవీ ప్రాంతంలో ఆయనను అరెస్టు చేసి, రాంచీ జైలుకు తరలించారు. ఎప్పటికైనా తమకు ప్రమాదకారిగా మారతాడని భావించిన ప్రభుత్వం బిర్సా ముండాను 1900 జూన్ 9న విష ప్రయోగంతో చంపేసింది. బయటకు మాత్రం... మలేరియాతో మరణించాడంటూ ప్రచారం చేసింది. అలా పరాయి పాలనపై తిరుగుబాటు చేసిన విప్లవజ్యోతి బ్రిటిష్ పాలకుల చీకటికుట్రకు నాలుగ్గోడల మధ్యే నిశ్శబ్దంగా ఆరిపోయింది. ఇప్పటికీ ఆయన్ని ఝార్ఖండ్, బిహార్, పశ్చిమబెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లోని ఆదివాసీలు ‘భగవాన్ బిర్సా ముండా’గా పూజిస్తున్నారు. ఆయన ఉద్యమ ఫలితంగానే 1908లో అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం ‘చోటానాగ్‌పుర్ కౌలుదారుల హక్కు చట్టం’ను అమలులోకి తీసుకొచ్చింది. బిర్సా స్ఫూర్తితోనే ముండా, ఒరియాన్, సంతాల్ తెగల ప్రజలు తమ హక్కులను సాధించుకున్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (31/01/2023)
-
World News
Meta: మేనేజర్ వ్యవస్థపై జూకర్బర్గ్ అసంతృప్తి.. మరిన్ని లేఆఫ్‌లకు సంకేతాలు..?
-
India News
Noida: పాత కార్లపై నజర్.. ఫిబ్రవరి 1 నుంచి 1.19లక్షల కార్లు సీజ్
-
Movies News
Pathaan: పఠాన్‌కు వెన్నెముక ఆయనే: షారుక్ ఖాన్
-
General News
Bengaluru: బెంగళూరుకు గులాబీ శోభ.. నగరంలో కొత్త అందాల ఫొటోలు చూశారా?
-
Politics News
Nitish: భాజపాతో మళ్లీ జట్టు కట్టడం కంటే చనిపోవడమే మేలు : నీతీశ్