Nitish Kumar: ఏలూరు ‘పోరస్‌ పరిశ్రమ’లో విషాదం.. మృతులకు బిహార్ సీఎం ఎక్స్‌గ్రేషియో!

ఏలూరు జిల్లా ముసునూరు మండలం అక్కిరెడ్డిగూడెంలోని పోరస్‌ రసాయన పరిశ్రమలో జరిగిన ఘోర ప్రమాదంపై బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌ ...

Updated : 22 Nov 2022 16:15 IST

పట్నా: ఏలూరు జిల్లా ముసునూరు మండలం అక్కిరెడ్డిగూడెంలోని పోరస్‌ రసాయన పరిశ్రమలో జరిగిన ఘోర ప్రమాదంపై బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌ స్పందించారు. ఈ ఘటనలో మృతిచెందిన బిహార్‌ వాసుల కుటుంబాలకు రూ.2లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియో ప్రకటించారు. గాయపడిన వారికి సీఎం సహాయ నిధి నుంచి రూ.50వేలు చొప్పున సాయం అందించనున్నట్టు ట్విటర్‌లో వెల్లడించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా ఏపీ ప్రభుత్వంతో సమన్వయం చేయాలని స్థానిక కమిషనర్‌ (న్యూదిల్లీ)కు సూచించారు. రసాయన పరిశ్రమలో చోటుచేసుకున్న పేలుడు ఘటనలో మృతి చెందిన వారి భౌతికకాయాలను స్వస్థలాలకు తీసుకొచ్చేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నట్టు పేర్కొన్నారు. 

బుధవారం అర్ధరాత్రి పోరస్‌ పరిశ్రమలోని యూనిట్‌ -4లో గ్యాస్‌ లీక్‌ కావడంతో మంటలు చెలరేగి రియాక్టర్‌ పేలింది. ఈ ఘటనలో ఆరుగురు మృతిచెందారు. ఘటనా స్థలంలోనే ఐదుగురు మంటల్లో సజీవ దహనం కాగా.. ఆస్పత్రికి తరలిస్తుండగా మరొకరు ప్రాణాలు విడిచారు. మరో 12మంది గాయపడ్డారు. మృతుల్లో నలుగురు బిహార్‌కు చెందిన వారు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. క్షతగాత్రులను తొలుత నూజివీడు ఆస్పత్రికి తరలించిన అధికారులు.. అనంతరం మెరుగైన చికిత్స కోసం విజయవాడ జీజీహెచ్‌కు తరలించిన విషయం తెలిసిందే.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని