West Bengal: ప్రచారంలో యువతికి ముద్దు.. వివాదంలో ఎంపీ

ఎన్నికల ప్రచారానికెళ్లిన ఓ ఎంపీ ఓట్లు అడుగుతూ యువతికి ముద్దు పెట్టిన దృశ్యాలు నెట్టింట వైరల్‌ అయ్యాయి. బెంగాల్‌ రాజకీయాల్లో ఇది దుమారం రేపుతోంది.

Updated : 10 Apr 2024 18:18 IST

కోల్‌కతా: లోక్‌సభ ఎన్నికలు (Lok sabha Elections) సమీపిస్తున్న వేళ ప్రచారం జోరందుకుంది. ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు కాళ్లరిగేలా తిరుగుతున్నారు. పశ్చిమ బెంగాల్‌ (West Bengal)లో ఓ భాజపా (BJP) ఎంపీ కూడా ఇటీవల ఓట్ల కోసం ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఆ సమయంలో ఓ యువతి బుగ్గపై ఆయన ముద్దు పెట్టడం తీవ్ర వివాదాస్పదమైంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అసలేం జరిగిందంటే..

బెంగాల్‌లోని ఉత్తర మాల్దా లోక్‌సభ నియోజకవర్గం నుంచి భాజపా ఎంపీ ఖగేన్‌ ముర్మూ (Khagen Murmu) పోటీ చేస్తున్నారు. గత సోమవారం తన నియోజక పరిధిలోని శ్రిహిపుర్‌ గ్రామంలో ఇంటింటి ప్రచారానికి వెళ్లారు. అక్కడ ఆయన ఓ యువతి చెంపపై ముద్దు పెట్టిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి. దీంతో ఈ ఘటన రాజకీయ దుమారం రేపింది.

దీనిపై అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ సోషల్‌ మీడియాలో స్పందిస్తూ.. భాజపాను దుయ్యబట్టింది. ‘‘భాజపా ఎంపీ, ఉత్తర మాల్దా అభ్యర్థి ఖగేన్‌ ముర్ము ప్రచారం సందర్భంగా ఓ యువతికి ముద్దు పెట్టారు. మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించే ఎంపీలు.. బెంగాలీ మహిళలపై అసభ్యకర పాటలు రాసే నేతలు.. ఇలా భాజపా క్యాంప్‌లో మహిళా వ్యతిరేక నాయకులకు కొదవలేదు. నారీమణులకు ‘మోదీ పరివార్‌’ ఇస్తున్న గౌరవం ఇది. ఒకవేళ వారు అధికారంలోకి వస్తే ఇలాంటివి ఇంకెన్ని చేస్తారో ఊహించుకోండి..!’’ అని టీఎంసీ విమర్శలు గుప్పించింది.

ఇది వివాదం కావడంతో ఎంపీ ఖగేన్‌ స్పందిస్తూ ఘటనపై స్పష్టతనిచ్చారు. ‘‘ఆమెను నా కుమార్తెలా భావించా. పిల్లలకు ముద్దు పెడితే తప్పేంటి? కుట్రపూరితంగా దీనిపై వివాదం సృష్టిస్తున్నారు. ఇలాంటి చిత్రాలను వక్రీకరించి వ్యక్తులు, పార్టీల పరువుకు భంగం కలిగిస్తున్నారు. వారిపై (టీఎంసీ) ఫిర్యాదు చేస్తాం’’ అని భాజపా నేత వెల్లడించారు.

మరోవైపు, యువతి కూడా దీనిపై స్పందిస్తూ ఎంపీకి మద్దతుగా వ్యాఖ్యలు చేశారు. ‘‘సొంత కుమార్తెలా భావించి ఆయన ముద్దు పెట్టుకుంటే అందులో సమస్య ఏంటి? ఇలాంటి ఘటనలను సోషల్ మీడియాలో వైరల్‌ చేసే వారిది చెత్త మనస్తత్వం. ఆ ఫొటో తీసిన సమయంలో మా అమ్మానాన్నా కూడా అక్కడే ఉన్నారు’’ అని ఆమె చెప్పారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని