కొత్త మంత్రికి బాంబే హైకోర్టు తొలి టాస్క్‌!

నూతన పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు బాంబే హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. విమానాశ్రయాల పేర్ల మార్పుపై పాలసీని త్వరగా ఖరారు చేయాలని సూచించింది.

Updated : 10 Jul 2021 07:06 IST

ముంబయి: నూతన పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు బాంబే హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. విమానాశ్రయాల పేర్ల మార్పుపై పాలసీని త్వరగా ఖరారు చేయాలని సూచించింది. ‘‘కేంద్రంలో కొత్త మంత్రివర్గం ఏర్పడింది. నూతన విమానయాన శాఖ మంత్రి చేపట్టే తొలి కార్యాచరణ ఇదే కావాలనుకుంటున్నాం. ఎయిర్‌పోర్టుల పేర్ల మార్పుపై 2017లో ముసాయిదా పాలసీ రూపొందించారు. అది ఇంకా ముసాయిదా దశలోనే ఉండకూడదు. త్వరగా ఖరారు చేయండి’’ అని న్యాయస్థానం కేంద్రమంత్రిని ఆదేశించింది. 

దేశంలో ఇప్పటివరకూ ఉన్న విమానాశ్రయాలు, కొత్తగా నిర్మించే గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టులకు వ్యక్తుల పేర్లు కాకుండా నగరాల పేర్లు ఉండేలా మార్పులు చేయనున్నామని 2016లో భాజపా ప్రభుత్వం రాజ్యసభకు తెలిపింది. విదేశీ ప్రయాణికులు, ముఖ్యంగా పర్యాటకులకు స్థానిక చరిత్ర, ఇక్కడి ప్రముఖుల గురించి పెద్దగా అవగాహన లేకపోవడంతో ఎయిర్‌పోర్టుల విషయంలో వారు గందరగోళానికి గురవుతున్నారని, అందుకే ప్రయాణికుల సౌకర్యార్థం ఈ మార్పులు చేపట్టనున్నామని ప్రభుత్వం పేర్కొంది. 2017లో దీనిపై ముసాయిదా పాలసీని కూడా రూపొందించింది. 

అయితే గత 10ఏళ్లలో మొత్తం ఆరు ఎయిర్‌పోర్టుల పేర్లు మార్చగా.. అందులో ఐదింటికి వ్యక్తుల పేర్లే పెట్టడం గమనార్హం. ఇందులో రెండు విమానాశ్రయాల పేర్లు  భాజపా హయాంలో మారగా.. మిగతావి మన్మోహన్‌ సింగ్‌ నేతృత్వంలోని కాంగ్రెస్‌ హయంలో మారాయి. దీంతో ఈ విషయమై బాంబే హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఈ వ్యాజ్యం విచారణ సందర్భంగా న్యాయస్థానం పైవిధంగా ఆదేశాలు జారీ చేసింది. 

బుధవారం కేంద్రమంత్రివర్గ విస్తరణ జరిగిన విషయం తెలిసిందే. కొత్తగా కేబినెట్‌లోకి తీసుకున్న యువ ఎంపీ జ్యోతిరాదిత్య సింధియాకు పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ కేటాయించారు. శుక్రవారం ఆయన హర్‌దీప్‌ సింగ్‌ పూరి(పౌరవిమానయాన మాజీ మంత్రి) నుంచి ఈ బాధ్యతలు స్వీకరించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని