Vijaypat Singhania: ‘ఆ ఆత్మకథ విక్రయాలను వెంటనే నిలిపేయండి’

పారిశ్రామికవేత్త, రేమాండ్‌ గ్రూపు సంస్థల మాజీ ఛైర్మన్‌ విజయపత్ సింఘానియా ఆత్మకథ 'ఎన్‌ ఇన్‌కంప్లీట్‌ లైఫ్‌' అమ్మకాలు, సర్క్యులేషన్‌, డిస్ట్రిబ్యూషన్‌పై బాంబే హైకోర్టు గురువారం నిషేధం విధించింది. ఈ పుస్తకం విషయంలో మొదటినుంచి విజయ్‌పత్‌కు.. విడిపోయిన...

Published : 05 Nov 2021 01:54 IST

బాంబే హైకోర్టు ఆదేశాలు

ముంబయి: పారిశ్రామికవేత్త, రేమాండ్‌ గ్రూపు సంస్థల మాజీ ఛైర్మన్‌ విజయపత్ సింఘానియా ఆత్మకథ 'ఎన్‌ ఇన్‌కంప్లీట్‌ లైఫ్‌' అమ్మకాలు, సర్క్యులేషన్‌, డిస్ట్రిబ్యూషన్‌పై బాంబే హైకోర్టు గురువారం నిషేధం విధించింది. ఈ పుస్తకం విషయంలో మొదటినుంచి విజయ్‌పత్‌కు.. విడిపోయిన ఆయన కుమారుడు గౌతమ్‌ సింఘానియాతోపాటు రేమండ్‌ కంపెనీతో న్యాయవివాదం నెలకొంది. పుస్తకంలో పేర్కొన్న విషయాలు పరువు నష్టం కలిగించేలా ఉన్నాయని, గోప్యత హక్కును ఉల్లంఘించడంతోపాటు సంస్థ వ్యాపార కార్యకలాపాలు, ఇతర రహస్య సమాచారాన్ని చర్చించారని రేమండ్ లిమిటెడ్‌తోపాటు దాని ఛైర్మన్ గౌతమ్ సింఘానియా ఆరోపించారు.

ఈ నేపథ్యంలో ఈ ఆత్మకథపై నిషేధం విధించాలంటూ.. 2019లోనూ ఠాణె జిల్లా సెషన్స్ కోర్టు, ముంబయిలోని సివిల్ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన ఠాణె జిల్లా సెషన్స్‌ కోర్టు.. అదే ఏడాది ఏప్రిల్‌లో పుస్తకం విడుదలపై నిషేధం విధించింది. అయినా.. విజయపత్ సింఘానియా, ప్రచురణకర్తలు కోర్టు ఉత్తర్వును ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘిస్తూ ఇటీవల పుస్తకాన్ని విడుదల చేశారని, వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ కంపెనీ గురువారం హైకోర్టును ఆశ్రయించింది. విచారణ చేపట్టిన  వెకేషన్ బెంచ్.. పుస్తకం తదుపరి విక్రయాలు, పంపిణీ, సర్క్యులేషన్‌ను నిలుపుదల విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2015 ఫిబ్రవరిలో కుటుంబ సభ్యులతో వచ్చిన వివాదం వల్ల విజయ్‌పత్‌ వారసత్వ గృహాన్ని, ఇతర ఆస్తిపాస్తులనూ కోల్పోయిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని