23న సాయంత్రం 6:04 గంటలకు.. చందమామపై దిగనున్న చంద్రయాన్‌-3

చందమామపై కాలుమోపే దిశగా భారత వ్యోమనౌక చంద్రయాన్‌-3 ఒక్కో అడుగు ముందుకేస్తోంది. ఈ ల్యాండర్‌ మాడ్యూల్‌ చివరి డీబూస్టింగ్‌ ప్రక్రియ ఆదివారం విజయవంతమైంది.

Updated : 21 Aug 2023 05:42 IST

శ్రీహరికోట, న్యూస్‌టుడే: చందమామపై కాలుమోపే దిశగా భారత వ్యోమనౌక చంద్రయాన్‌-3 ఒక్కో అడుగు ముందుకేస్తోంది. ఈ ల్యాండర్‌ మాడ్యూల్‌ చివరి డీబూస్టింగ్‌ ప్రక్రియ ఆదివారం విజయవంతమైంది. ప్రస్తుతం అది జాబిల్లి చుట్టూ ఉన్న 25×134 కి.మీల కక్ష్యలో పరిభ్రమిస్తోంది. ఈ నెల 23న సాయంత్రం 6.04 గంటలకు విక్రమ్‌ ల్యాండర్‌ చంద్రుడిపై కాలుమోపనున్నట్లు ఇస్రో తాజాగా ప్రకటించింది. ఈ ప్రక్రియను తమ వెబ్‌సైట్‌ సహా బహుళ వేదికల ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు తెలిపింది. బుధవారం సాయంత్రం 5.27 గంటల నుంచి ఇది మొదలవుతుందని పేర్కొంది. భారత శాస్త్ర, సాంకేతిక సత్తాను చాటే ఈ మహోజ్వల ఘట్టం గురించి విద్యార్థుల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని పాఠశాలలు, కళాశాలలను కోరింది. ఇది యువతలో ఆవిష్కరణలు, అంతరిక్షం పట్ల ఉత్సుకతను పెంచుతుందని పేర్కొంది. ల్యాండింగ్‌ ప్రక్రియ 23న సాయంత్రం 5.45 గంటలకు ప్రారంభమవుతుందని తెలిపింది. ఇందులో భాగంగా ‘విక్రమ్‌’ తన ఇంజిన్ల సాయంతో దశలవారీగా వేగాన్ని తగ్గించుకుంటూ చంద్రుడి దక్షిణ ధ్రువానికి చేరువలోని ప్రాంతంలో దిగనుంది. అనంతరం ఈ ల్యాండర్‌ నుంచి రోవర్‌ వెలుపలికి వస్తుంది. ఈ రెండు వ్యోమనౌకలూ కలిసి చందమామపై పరిశోధనలు సాగించనున్నాయి. ఇప్పటివరకూ సోవియట్‌ యూనియన్‌, అమెరికా, చైనా మాత్రమే జాబిల్లిపై సాఫ్ట్‌ ల్యాండింగ్‌ సాధించాయి.

అంచనాలకు మించి ప్రొపల్షన్‌ మాడ్యూల్‌ పనితీరు

చంద్రయాన్‌-3లోని ప్రొపల్షన్‌ మాడ్యూల్‌ శాస్త్రవేత్తల లక్ష్యానికి మించి సేవలు అందించనుంది. అందులో ఇంకా 150 కిలోల ఇంధనం మిగిలి ఉంది. ఇది ఇస్రో శాస్త్రవేత్తల అంచనాల కంటే చాలా ఎక్కువ. దీంతో ప్రొపల్షన్‌ మాడ్యూల్‌.. చంద్రుడి కక్ష్యలో సుదీర్ఘకాలం సేవలు అందించనుంది. చంద్రుడిని చేరే క్రమంలో దిద్దుబాట్లు అవసరమయ్యే ఆకస్మిక పరిస్థితులు (ఇంధనం ఖర్చు చేయాల్సిన పరిస్థితి) చాలావరకు ఎదురుకాకపోవడంతోనే ఇది సాధ్యమైనట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నిర్దేశిత కక్ష్యల వరకు కలిసి ప్రయాణం సాగించిన ల్యాండర్‌, ప్రొపల్షన్‌ మాడ్యూళ్లు ఇటీవల విడిపోయి వేర్వేరుగా చంద్ర కక్ష్యల్లో పరిభ్రమిస్తున్న విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని