Everestపై కరోనా.. అప్రమత్తమైన చైనా

ప్రపంచంలోనే అతి ఎత్తయిన శిఖరం ఎవరెస్ట్‌ను కరోనా వైరస్‌ తాకిన వేళ చైనా అప్రమత్తమైంది. ఆ మహమ్మారి మళ్లీ తమవైపు రాకుండా జాగ్రత్తలు వహిస్తోంది. నేపాల్‌ నుంచి ఎవరెస్ట్‌ను అధిరోహించే పర్వతారోహకులు తమవైపు రాకుండా ఒక ప్రత్యేక గీతను గీస్తోంది....

Published : 10 May 2021 22:25 IST

ప్రత్యేక గీత గీస్తోన్న డ్రాగన్‌ దేశం

బీజింగ్‌: ప్రపంచంలోనే అతి ఎత్తయిన శిఖరం ఎవరెస్ట్‌ను కరోనా వైరస్‌ తాకిన వేళ చైనా అప్రమత్తమైంది. ఆ మహమ్మారి మళ్లీ తమవైపు రాకుండా జాగ్రత్తలు వహిస్తోంది. నేపాల్‌ నుంచి ఎవరెస్ట్‌ను అధిరోహించే పర్వతారోహకులు తమవైపు రాకుండా ఒక ప్రత్యేక గీతను గీస్తోంది. నేపాల్‌ నుంచి ఎవరెస్ట్‌ ఎక్కేవారు.. టిబెట్‌ నుంచి ఆ పర్వతాన్ని అధిరోహించేవారు కలవకుండా కఠిన నిబంధనలు పాటిస్తోంది. ఎవరెస్ట్‌ ఉత్తరవాలు తమ దేశంలో ఉండటంతో చైనా ఈ మేరకు చర్యలు తీసుకుంటోంది. 

ఇప్పటివరకు నేపాల్‌లోని ఎవరెస్ట్ బేస్‌క్యాంపులో ఉన్న 30 మంది పర్వతారోహకులు కొవిడ్‌ బారిన పడ్డారు. దీంతో ఇరువైపుల నుంచి ఎక్కే పర్వతారోహకులు కలవకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు చైనా అధికార మీడియా వెల్లడించింది. ఎవరెస్ట్‌పై ప్రత్యేకంగా ఓ లైన్‌ను ఏర్పాటుచేస్తోంది. తమ వైపు నుంచి ఎవరెస్ట్‌ శిఖరాన్ని ఎక్కినవాళ్లు ఆ లైన్‌ దాటకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఉత్తర, దక్షిణ వైపు నుంచి ఎక్కే క్లైంబర్స్‌ కలవకుండా అత్యంత కఠినమైన వైరస్‌ నివారణ చర్యలు తీసుకుంటున్నట్లు టిబెట్‌ అధికారులు వెల్లడించారు. 

ఈ ఏడాది ఎవరెస్ట్ పర్వతాన్ని ఎక్కడానికి 21 మందికి చైనా అనుమతిచ్చింది. ఏప్రిల్‌ నుంచే వీళ్లంతా టిబెట్‌లో క్వారంటైన్‌లో ఉన్నారు. తమ వైపు ఉన్న ఎవరెస్ట్‌ సమీపంలో వైరస్‌ సోకకుండా సాధారణ పర్యాటకులను డ్రాగన్‌ ఇప్పటికే నిషేధించింది. గతేడాది నుంచి కరోనా కారణంగా విదేశీ క్లైంబర్స్‌ను కూడా అనుమతించడంలేదు. నేపాల్‌ కూడా గతేడాది ఇలాగే చేసినా పర్యాటకాన్ని మళ్లీ గాడిలో పడేసేందుకు ఈసారి విదేశీ టూరిస్టులను అనుమతించింది. ఎవరెస్ట్‌ ఎక్కడానికి అనుమతి కోసమే నేపాల్‌ ప్రభుత్వానికి 11 వేల డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఆ తర్వాత తమ సాహసయాత్ర పూర్తి చేసేందుకు మరో 40 వేల డాలర్లు ఖర్చవుతుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని