Corona: అమెరికాలో 129 జింకలకు కరోనా.. మూడు వేరియెంట్లు గుర్తింపు

కొవిడ్ మహమ్మారి మనిషి నుంచి జంతువులకు కూడా వ్యాప్తి చెందుతోంది. అమెరికాలోని ఒహైయోలో జింకలకు ఈ మహమ్మారి సోకినట్టు ....

Updated : 25 Dec 2021 10:21 IST

కొలంబస్‌: కొవిడ్ మహమ్మారి మనిషి నుంచి జంతువులకు కూడా వ్యాప్తి చెందుతుండడం కలకలం రేపుతోంది. అమెరికాలోని ఒహైయోలో జింకలకు ఈ మహమ్మారి సోకినట్టు పరిశోధనల్లో తేలింది. ఒహైయో స్టేట్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఈ ఏడాది జనవరి - మార్చి మధ్య కాలంలో ఈశాన్య ఒహైయోలో తొమ్మిది ప్రాంతాల్లో 360 తెల్ల తోక జింకల నుంచి శాంపిల్స్‌ సేకరించి పరీక్షలు నిర్వహించగా.. వీటిలో 129 (35 శాతం) జింకలకు సార్స్‌ కోవ్‌-2 పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు గుర్తించారు.

వీటిలో ఎలాంటి లక్షణాలు మాత్రం కనబడలేదని శాస్త్రవేత్తలు తెలిపారు. ఆరుచోట్ల నుంచి మూడు వేరియంట్లను (B.1.2, B.1.582 and B.1.596) గుర్తించ గలిగినట్టు తెలిపారు. అయితే, జింకలకు ఈ వైరస్‌ ఎలా సోకిందనే విషయాన్ని మాత్రం తెలియరాలేదని పేర్కొన్నారు. జింకలకు సమీపంలో ఉన్నవారిలో కొవిడ్‌ సోకిన వ్యక్తుల ద్వారా వచ్చి ఉండొచ్చని శాస్త్రవేత్తల బృందం అనుమానిస్తోంది. మనిషి మలం, మురుగునీటి ద్వారా ఈ మహమ్మారి వ్యాప్తి చెందుతున్నట్టు ఇప్పటికే నిర్ధారణ కావడంతో కలుషిత నీటిని జింకలు తాగడం వల్ల కొవిడ్‌ సోకి ఉంటుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. 

మనుషుల్లో మ్యుటేట్‌ అవుతున్న కొవిడ్‌ 19 మహమ్మారి.. జింకల్లో మాత్రం మార్పు చెందకుండా జీవించగలదని గుర్తించారు. ఇతర అధ్యయనాల నుంచి వచ్చిన ఆధారాలను బట్టి ఒక జింక నుంచి మరొక జింకకు కూడా ఈ వైరస్‌ వ్యాపించే అవకాశం ఉందని ఒహైయో స్టేట్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ ఆండ్రూ బౌమన్‌ తెలిపారు. మనుషుల్లో మాదిరిగా జ్వరం వంటి లక్షణాలేవీ ఈ జంతువుల్లో వచ్చినట్టు ఎలాంటి ఆధారాలూ లేవని తెలిపారు.

Read latest National - International News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని