జమ్మూకశ్మీర్‌లో కొన్నాళ్లకు CRPF అవసరం ఉండదు: అమిత్ షా

జమ్మూకశ్మీర్‌లో పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని అణచివేయడంలో కేంద్ర సాయుధ బలగాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కొనియాడారు.

Published : 20 Mar 2022 01:30 IST

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌లో పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని అణచివేయడంలో కేంద్ర సాయుధ బలగాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. కొన్నేళ్ల తర్వాత జమ్మూకశ్మీర్‌లో సీఆర్పీఎఫ్‌ అవసరం ఉండబోదని చెప్పారు. ఈ మేరకు సీఆర్పీఎఫ్‌ 83వ రైజింగ్‌ డే పరేడ్‌లో ఆయన జవాన్లను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా జవాన్లపై ప్రశంసల వర్షం కురిపించారు.

‘‘జమ్మూకశ్మీర్‌లో శాంతి నెలకొల్పేందుకు సీఆర్పీఎఫ్‌ఎఫ్‌ జవాన్లు ఏళ్లుగా కృషి చేస్తున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోనూ, ఈశాన్య రాష్ట్రాల్లోనూ విధులు నిర్వర్తిస్తున్నారు. రాబోయే కొన్నేళ్లలో ఈ మూడు ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో శాంతి నెలకొంటుంది. ఈ విషయంలో నాకు పూర్తి విశ్వాసం ఉంది. అప్పుడు సీఆర్పీఎఫ్‌ అవసరమే ఉండదు. ఒకవేళ అదే జరిగితే ఆ క్రెడిట్‌ సీఆర్పీఎఫ్‌కే దక్కుతుంది’’ అని అమిత్‌షా అన్నారు. కేంద్ర సాయుధ బలగాల్లో అతిపెద్ద పారామిలటరీ దళమైన సీఆర్పీఎఫ్‌లో నాలుగో వంతు సిబ్బంది జమ్మూకశ్మీర్‌లోనే విధులు నిర్వర్తిస్తున్నారు.

ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత జమ్మూకశ్మీర్‌లో అన్ని వర్గాల సమ్మిళిత అభివృద్ధికి మార్గం సుగమమైందని అమిత్‌ షా అన్నారు. జమ్మూకశ్మీర్‌లో ఇవాళ పంచాయతీల్లో ఎన్నికైన 30వేల మంది సభ్యులు ఆయా గ్రామాల అభివృద్ధిలో పాలుపంచుకుంటున్నారని చెప్పారు. లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా సేవలనూ మెచ్చుకున్నారు. ఆయన నేతృత్వంలోని అధికార యంత్రాంగం జమ్మూకశ్మీర్‌ అభివృద్ధికి కృషి చేస్తోందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని