Delhi Liquor Scam: దిల్లీ ఉపముఖ్యమంత్రి సిసోదియా అరెస్టు

దిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోదియాను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. 

Updated : 26 Feb 2023 21:16 IST

దిల్లీ: మద్యం కుంభకోణం కేసు(Delhi liquor scam)లో దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోదియా(Manish sisodia) అరెస్టయ్యారు. ఇవాళ మధ్యాహ్నం సీబీఐ(CBI) విచారణకు వెళ్లిన ఆయన్ను అధికారులు అరెస్టు చేశారు. అంతకుముందు సిసోదియాను దాదాపు 8 గంటలపాటు సీబీఐ అధికారులు ప్రశ్నించారు. అనంతరం అదుపులోకి తీసుకొని, అరెస్టు చేసినట్లు సీబీఐ అధికారులు ప్రకటించారు. ఈ మేరకు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఈ నేపథ్యంలో సీబీఐ కేంద్ర కార్యాలయ పరిసరాల్లో దిల్లీ పోలీసులు 144 సెక్షన్‌ విధించారు.

విచారణ సమయంలో మద్యం పాలసీ గురించి వివిధ కోణాల్లో సిసోదియాను సీబీఐ అధికారులు ప్రశ్నించారు. ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న దినేశ్ అరోడా, ఇతర నిందితులతో గల సంబంధాలపై ఆరా తీశారు. వివిధ సందర్భాల్లో చేసిన ఫోన్‌ కాల్స్‌ గురించి అడిగినట్లు తెలుస్తోంది.  అయితే, మనీశ్‌ సిసోదియా సమాధానాలతో తృప్తి చెందని  సీబీఐ అధికారులు.. ఆయన విచారణకు సహకరించడం లేదని, కీలక అంశాల్లో ఆయన చెప్పిన సమాధానాలతో పొంతన కుదరకపోవడంతో అరెస్టు చేశామని చెబుతున్నారు. సిసోదియా నుంచి కీలకమైన సమాచారం రాబట్టాలంటే  కస్టోడియల్‌ విచారణ అవసరమని అన్నారు.

 మరోవైపు సీబీఐ విచారణకు ముందు దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోదియా చేసిన ట్వీట్‌ సంచలనంగా మారింది. ‘‘నేను ఈ రోజు సీబీఐ విచారణకు మరోసారి హాజరవుతున్నా. విచారణకు పూర్తిగా సహకరిస్తా. మరికొన్ని నెలలు జైలులోనే ఉండాల్సి వచ్చినా.. లెక్కచేయను. నేను భగత్‌సింగ్‌ను అనుసరించే వ్యక్తిని’’ అని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తనను అరెస్టు చేస్తారని సిసోదియాకు ముందుగానే అర్థమైనట్లు తెలుస్తోంది.

ఈ కేసులో సిసోదియాను సీబీఐ గతంలోనూ విచారించింది.  దిల్లీ మద్యం కుంభకోణంలో సిసోదియా హస్తం ఉన్నట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే.  దీంతో కేసు నమోదు చేసిన సీబీఐ దర్యాప్తు చేపట్టింది. సిసోదియా సన్నిహితుడైన విజయ్‌ నాయర్‌ను అరెస్టు చేసింది. ఆయనతో పాటు అభిషేక్‌ బోయినపల్లి, శరత్‌ చంద్రారెడ్డి, బినోయ్‌ బాబు, సమీర్‌ మహేంద్రు సహా ఏడుగురిని నిందితులుగా పేర్కొంటూ సీబీఐ (CBI) ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసింది. అటు ఈ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ (ED) కూడా దర్యాప్తు కొనసాగిస్తోంది. 

  • మనీశ్ సిసోదియా అరెస్టు నేపథ్యంలో సీబీఐ కేంద్ర కార్యాలయం వద్ద భద్రతను పెంచారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా ముందు జాగ్రత్తగా ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌ను మోహరించారు.
  • మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోదియాను అరెస్టు చేసిన సీబీఐ అధికారులు సోమవారం కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.
  • దిల్లీ సీఎం కేజ్రీవాల్‌, పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌ తదితర ఆప్‌ కీలక నేతలు సిసోదియా నివాసానికి వెళ్లారు. 

  • ఈ రోజు రాత్రికి సిసోదియాకు సీబీఐ అధికారులు వైద్య పరీక్షలు చేయించనున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని