Mamata Banerjee: ‘జమిలి ఎన్నికల’తో ఏకీభవించడం లేదు..! కోవింద్‌ కమిటీకి దీదీ లేఖ

‘ఒకే దేశం- ఒకే ఎన్నిక’తో ఏకీభవించడం లేదని పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ వెల్లడించారు. జమిలి ఎన్నికలపై అధ్యయనానికి ఏర్పాటైన రామ్‌నాథ్‌ కోవింద్‌ కమిటీకి ఈమేరకు లేఖ రాశారు.

Updated : 11 Jan 2024 17:08 IST

కోల్‌కతా: లోక్‌సభ, అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలకు ఉద్దేశించిన ‘ఒకే దేశం- ఒకే ఎన్నిక (One Nation, One Election)’ భావనతో ఏకీభవించడం లేదని పశ్చిమ బెంగాల్‌ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) స్పష్టం చేశారు. జమిలి ఎన్నికలపై అధ్యయనానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన రామ్‌నాథ్‌ కోవింద్‌ కమిటీ (Kovind Panel)కి ఈమేరకు లేఖ రాశారు. ఈ తరహా విధానం భారత రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణానికి వ్యతిరేకమని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య ముసుగులో నియంతృత్వాన్ని అనుమతించే వ్యవస్థగా మారుతుందన్నారు. ‘‘నేను నిరంకుశత్వానికి వ్యతిరేకం. అందుకే జమిలి ఎన్నికలకూ దూరం’’ అని మమత పేర్కొన్నారు.

‘‘జమిలి ఎన్నికల విషయంలో మీ సూత్రీకరణ, ప్రతిపాదనలతో విభేదిస్తున్నాం. ఈ కాన్సెప్ట్ స్పష్టంగా లేదు. భారత రాజ్యాంగం ‘ఒకే దేశం- ఒకే ప్రభుత్వం’ అనే భావనను అనుసరించడం లేదు. కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ కారణాల వల్ల తమ ఐదేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేయకపోవచ్చు. గత 50 ఏళ్లలో లోక్‌సభ అనేకసార్లు ముందస్తుగా రద్దయ్యింది. ఇలాంటి పరిస్థితుల్లో కొత్తగా ఎన్నికలు నిర్వహించడమే మార్గం. కేవలం ఏకకాలంలో ఎన్నికల కోసమే ముందస్తుకు వెళ్లాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాలను ఒత్తిడి చేయరాదు. ఇలా చేస్తే.. ఐదేళ్ల పాలన విషయంలో ఓటర్ల ఎన్నికల విశ్వాసాన్ని ప్రాథమికంగా ఉల్లంఘించడమే అవుతుంది’’ అని మమతా పేర్కొన్నారు.

జమిలి ఎన్నికలపై.. 5000 సూచనలు

‘ఒకే దేశం- ఒకే ఎన్నిక’ కోసం గతేడాది సెప్టెంబరులో మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో అత్యున్నత స్థాయి కమిటీ ఏర్పాటైంది. అప్పటి నుంచి రెండుసార్లు సమావేశాలు నిర్వహించింది. ఇటీవల ఆరు జాతీయ, 33 ప్రాంతీయ పార్టీల నుంచి అభిప్రాయాలు కోరింది. జమిలి ఎన్నికలపై న్యాయ కమిషన్‌ నుంచి కూడా సలహాలు తీసుకుంది. ప్రజల నుంచీ సలహాలు, సూచనలను ఆహ్వానించింది. ఇప్పటివరకు 5వేలకు పైగా ఈ-మెయిళ్లు వచ్చినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని