Car Parking: కారు పార్కింగ్ కోసం.. సీఎం కాన్వాయ్‌నే అడ్డుకున్నాడు

కారు పార్కింగ్ కోసం తీవ్ర ఇబ్బందులు ఎదురు కావడంతో ఓ పెద్దాయన.. సీఎం కాన్వాయ్‌ను అడ్డుకున్నాడు. సీఎం కోసం వచ్చే వారితో ఈ ప్రాంతంలో పార్కింగ్ దొరక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఫిర్యాదు చేశాడు. 

Updated : 28 Jul 2023 14:24 IST

బెంగళూరు: మెట్రో నగరాల్లో కారు పార్కింగ్ (Car Parking) బాధల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా బయటకు వెళ్లినప్పుడు కారు పార్క్‌ చేసేందుకు స్థలం దొరకడం పెద్ద సవాల్‌. ఇక వీఐపీలు, సెలబ్రిటీలు నివసించే ప్రాంతాల్లో.. వారిని చూసేందుకు వచ్చే వారితో ఆ ప్రాంతం నిత్యం బిజీగా ఉంటుంది. పలు సందర్భాల్లో చుట్టుపక్కల నివసించే వారికి సైతం ఇబ్బందులు తప్పవు. సరిగ్గా ఇలాంటి పరిస్థితే ఎదురై.. విసిగిపోయిన ఓ పెద్దాయన ఏకంగా సీఎం కాన్వాయ్‌నే అడ్డుకున్నాడు. మీ కోసం వచ్చే వారితో ఈ ప్రాంతంలో పార్కింగ్ దొరక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని సీఎంకు ఫిర్యాదు చేశాడు. 

బెంగళూరు (Bengaluru)లో సీఎం సిద్ధరామయ్య (Siddaramaiah) ఇంటికి ఎదురుగా నరోత్తమ్‌ అనే వృద్ధుడు నివాసం ఉంటున్నాడు. శుక్రవారం ఉదయం సీఎం ఇంటి నుంచి వస్తున్న కాన్వాయ్‌ను అతడు అడ్డుకున్నాడు. ఈ ఘటనతో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. అయితే, తాను సీఎంతో మాట్లాడాలని కోరడంతో.. అధికారులు అనుమతించారు. సీఎం ఉన్న కారు వద్దకు వెళ్లిన అతడు.. ‘‘మిమ్మల్ని చూసేందుకు వచ్చే వారు వాహనాలు ఇష్టం వచ్చినట్లు పార్క్‌ చేయడం వల్ల.. నేను, నా కుటుంబసభ్యులు మా కార్లను బయటికి తీయలేకపోతున్నాం. ఈ ప్రాంతంలో మాకు కారు పార్కింగ్  కోసం స్థలం దొరకడంలేదు. గత ఐదేళ్లుగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఇకపై మేం దీన్ని భరించలేం’’ అని చెప్పడంతో.. పార్కింగ్‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు.

బలవంతంగా రాజీనామా చేయించారు.. కన్నీళ్లు పెట్టుకున్న బైజూస్‌ ఉద్యోగి

కర్ణాటక సీఎంగా ఎన్నికైన తర్వాత సిద్ధరామయ్య.. తన అధికారిక నివాసానికి మారలేదు. ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో ఆయన నివాసం ఉంటున్న ఇంటినే ఇప్పటికీ ఉపయోగిస్తున్నారు. కర్ణాటక మాజీ సీఎం బీఎస్‌ యడియూరప్ప సీఎం అధికారిక బంగ్లాను ఖాళీ చేయకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తినట్లు సమాచారం. యడియూరప్ప త్వరలోనే అధికారిక బంగ్లాను ఖాళీ చేస్తారని, ఆగస్టులో సిద్ధరామయ్య అందులోకి మారే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు