Supreme Court: ఎట్టకేలకు కదిలిన కేంద్రం..! ఆ అయిదుగురి నియామకాలకు ఆమోదం

సుప్రీం కోర్టుకు కొత్తగా అయిదుగురు న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి కొలీజియం చేసిన సిఫార్సులకు కేంద్రం ఎట్టకేలకు ఆమోదం తెలిపింది. ఈ వ్యవహారంలో జాప్యంపై సర్వోన్నత న్యాయస్థానం శుక్రవారం అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

Published : 04 Feb 2023 20:02 IST

దిల్లీ: సుప్రీం కోర్టు(Supreme Court)లో జడ్జీల నియామకానికి గత డిసెంబరులో కొలీజియం(Collegium) చేసిన అయిదు సిఫార్సులకు కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు ఆమోద ముద్ర వేసింది. రాజస్థాన్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్‌ పంకజ్‌ మిత్తల్‌, పట్నా హైకోర్టు సీజే జస్టిస్‌ సంజయ్‌ కరోల్‌, మణిపుర్‌ హైకోర్టు సీజే జస్టిస్‌ పి.వి.సంజయ్‌కుమార్‌, పట్నా హైకోర్టు జడ్జి జస్టిస్‌ ఎహసానుద్దీన్‌ అమానుల్లా, అలహాబాద్‌ హైకోర్టు జడ్జి జస్టిస్‌ మనోజ్‌ మిశ్రల పేర్లు తాజాగా ఆమోదించిన జాబితాలో ఉన్నాయి. హైకోర్టు జడ్జీల పదోన్నతుల విషయంలో జరుగుతున్న జాప్యంపై సర్వోన్నత న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసిన మరుసటి రోజే ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం.

‘రాజ్యాంగంలోని నిబంధనల ప్రకారం రాష్ట్రపతి ఆయా హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు, జడ్జీలను సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమించారు. వారందరికీ శుభాకాంక్షలు’ అని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు ట్వీట్‌ చేశారు. ఇదిలా ఉండగా.. హైకోర్టు జడ్జీల పదోన్నతుల విషయంలో జరుగుతున్న జాప్యంపై జస్టిస్‌ ఎస్‌.కె.కౌల్‌, జస్టిస్‌ ఎ.ఎస్‌.ఓక్‌ ధర్మాసనం శుక్రవారం తీవ్రంగా స్పందించిన విషయం తెలిసిందే. రెండు పిటిషన్లపై విచారణ సందర్భంగా ఈ వ్యవహారంపై మాట్లాడుతూ.. ‘ఇది చాలా తీవ్రమైన విషయం. మరీ అసౌకర్యం కలిగించే నిర్ణయం తీసుకునేలా మమ్మల్ని ప్రోత్సహించవద్దు’ అని ఏజీకి స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే కేంద్రం తాజాగా వారి నియామకానికి పచ్చజెండా ఊపింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని