విమానాల రద్దుతో వైరస్‌ను నియంత్రించలేం

చైనాలో కరోనా వైరస్ బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో భారత్‌, అమెరికా సహా పలు దేశాలు చైనాకు నడుపుతున్న విమాన సర్వీసులను క్రమక్రమంగా తగ్గిస్తున్నాయి. ఈ విషయంలో చైనా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఇలా చైనాలోని వివిధ ప్రాంతాలకు విమాన సర్వీసులను రద్దు...

Published : 06 Feb 2020 23:51 IST

భారత్‌, అమెరికా సహా పలుదేశాలపై చైనా ఆగ్రహం

బీజింగ్‌: చైనాలో కరోనా వైరస్ బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో భారత్‌, అమెరికా సహా పలు దేశాలు చైనాకు నడుపుతున్న విమాన సర్వీసులను క్రమక్రమంగా తగ్గిస్తున్నాయి. ఈ విషయంలో చైనా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఇలా చైనాలోని వివిధ ప్రాంతాలకు విమాన సర్వీసులను రద్దు చేస్తూ ప్రజల్లో అనవసర భయాందోళనలు సృష్టిస్తున్నారని చైనా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నతాధికారి హువా చున్‌యింగ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘కరోనా వైరస్‌ విషయంలో చైనా ప్రభుత్వం పారదర్శకంగా సమాచారాన్ని తెలియజేస్తూ బాధ్యతతో వ్యవహరిస్తోంది. ఈ వైరస్‌ని నిలువరించేందుకు చైనా తీసుకుంటున్న జాగ్రత్తలు, చర్యల పట్ల ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) సైతం మెచ్చుకుంది. వివిధ దేశాల నుంచి చైనాకు నడుస్తున్న విమాన సర్వీసుల విషయంలో ఇప్పటివరకు డబ్ల్యూహెచ్‌వో ఎలాంటి ఆంక్షలు విధించలేదు. డబ్ల్యూహెచ్‌వో నిబంధనలు పాటించాల్సిందిగా వివిధ దేశాల విమానయాన సంస్థలకు అంతర్జాతీయ పౌరవిమానయాన సంస్థ (ఐసీఏవో) మార్గదర్శకాలు జారీ చేసింది. కేవలం విమాన సర్వీసులు రద్దు చేసినంత మాత్రానా కరోనా వైరస్‌ను నియంత్రించలేం’ అని చున్‌యింగ్‌ మీడియాతో మాట్లాడుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదిలా ఉంటే చైనా నుంచి ఇతర దేశాలకు వెళ్లే విమాన సర్వీసులను ఎట్టి పరిస్థితుల్లో రద్దు చేసేది లేదని హువా స్పష్టం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా చైనీయులు ఎక్కడున్నా ఎట్టిపరిస్థితుల్లో వారిని చైనాకు తీసుకొచ్చేస్తామని స్పష్టం చేశారు. విమానాల్లో ఈ వైరస్‌ సోకేందుకు ఉన్న అవకాశాలను తగ్గించేందుకు చైనా పౌరవిమానయాన పరిపాలనా విభాగం కసరత్తు చేస్తోందని హువా చెప్పారు. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతోన్న ఈ తరుణంలో ప్రపంచ దేశాలు పారదర్శక ధోరణితో ముందుకు సాగాలని.. అనవసర భయాలకు గురికావద్దని హువా సూచించారు. చైనాతో ఉన్న ద్వైపాక్షిక సంబంధాలను దృష్టిలో పెట్టుకొని విమానయాన సంస్థలు సర్వీసులు రద్దు చేసుకోవద్దని కోరారు. వెంటనే విమాన సర్వీసులను పునరుద్ధరించాలన్నారు. ఐసీఏవో, డబ్ల్యూహెచ్‌వో మార్గదర్శకాలకు అనుగుణంగా విమానయాన సంస్థలు చైనాకు వచ్చే సర్వీసులను పునరుద్ధరించాలని హువా చున్‌యింగ్‌ కోరారు.

చైనాలో కరోనా వైరస్‌ బారినపడి ఇప్పటికే 563 మంది చనిపోగా.. అందులో ఒక్క బుధవారమే 73 మంది చనిపోయారు. మరో 28,018 మందికి కరోనా ఉన్నట్లు నిర్ధారణ అయిందని చైనా వైద్యాధికారులు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా  25 దేశాలకు కరోనా మహమ్మారి వ్యాపించింది.

     

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని