ముజఫర్‌పూర్‌ కేసు దోషులకుశిక్ష ఖరారు..

ముజఫర్‌పూర్‌ వసతి గృహం కేసులో దోషిగా తేలిన బ్రజేశ్‌ ఠాకూర్‌కు దిల్లీ కోర్టు శిక్ష ఖరారు చేసింది. అతడు సహజ మరణం పొందే వరకు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెలువరించింది..........

Published : 11 Feb 2020 15:36 IST

దిల్లీ: ముజఫర్‌పూర్‌ వసతి గృహం కేసులో దోషిగా తేలిన బ్రజేశ్‌ ఠాకూర్‌కు దిల్లీ కోర్టు శిక్ష ఖరారు చేసింది. అతడు సహజ మరణం పొందే వరకు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెలువరించింది. ఈ కేసులో దోషులుగా తేలిన మరో 18 మందిలో 11 మందికి కూడా జీవిత ఖైదు విధించింది. బిహార్‌లోని ముజఫర్‌పూర్‌ వసతి గృహంలోని బాలికలపై లైంగిక దాడి, అత్యాచారం కేసులో ఠాకూర్‌ ప్రధాన దోషిగా తేలిన విషయం తెలిసిందే. ఈ కేసులో అతడితో పాటు మరో 18 మందిని న్యాయస్థానం దోషులుగా తేల్చింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో వ్యక్తిని గతంలోనే నిర్దోషిగా ప్రకటించింది.

ముజఫర్‌పూర్‌లో బిహార్‌ పీపుల్స్‌ పార్టీ(బీపీపీ)కి చెందిన బ్రజేశ్‌ ఠాకూర్‌ ఈ వసతి గృహాన్ని నిర్వహిస్తున్నాడు. అందులో ఉంటున్న దాదాపు 42 మంది బాలికలపై లైంగిక దాడికి పాల్పడటంతో పాటు వారిపై అత్యాచారాలు జరిగినట్లు వెలుగులోకి వచ్చింది. 2018, మే 26న టాటా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్ సోషల్‌ సైన్సెస్‌ బయటపెట్టిన నివేదిక ద్వారా ఈ దారుణాలు వెలుగులోకి వచ్చాయి. దేశవ్యాప్తంగా ఇవి సంచలనం సృష్టించాయి. 42 మంది బాలికల్లో 34 మందిపై లైంగిక దాడి జరిగినట్లు వైద్య పరీక్షల్లో తేలింది. దీంతో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు వసతి గృహ నిర్వాహకులు బ్రజేశ్‌ ఠాకూర్‌తో పాటు మరో 20 మందిని నిందితులుగా పేర్కొంటూ కేసు నమోదు చేశారు. నిందితుల్లో ఎనిమిది మంది మహిళలు కాగా, 12 మంది పురుషులు ఉన్నారు. కేసు తీవ్రత దృష్ట్యా తర్వాత దీన్ని సీబీఐకి అప్పగించారు. వసతి గృహంలోని బాలికలకు మత్తు మందు ఇచ్చి వారితో అసభ్యకర పాటలకు నృత్యం చేయించినట్లు సీబీఐ ఛార్జిషీట్‌లో పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని