కరోనా నుంచి మిమ్మల్ని రక్షించుకోండిలా

కరోనా వైరస్‌.. మనిషి వెంట్రుక కన్నా 900 రెట్లు చిన్నగా ఉంటుంది. అంత చిన్న వైరస్‌ ప్రపంచాన్ని వణికిస్తోంది. ప్రస్తుతం ఇది ప్రపంచంలోని దాదాపు 60 దేశాలకు వ్యాప్తి చెందింది. చైనాలో దీని కారణంగా మరణించిన వారి సంఖ్య 3వేలను దాటింది.

Published : 06 Mar 2020 02:25 IST

కరోనా వైరస్‌.. మనిషి వెంట్రుక కన్నా 900 రెట్లు చిన్నగా ఉంటుంది. అంత చిన్న వైరస్‌ ప్రపంచాన్ని వణికిస్తోంది. ప్రస్తుతం ఇది ప్రపంచంలోని దాదాపు 60 దేశాలకు వ్యాప్తి చెందింది. చైనాలో దీని కారణంగా మరణించిన వారి సంఖ్య 3వేలను దాటింది. ఇంకా ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 90వేల మందికి పైగా వైరస్‌ బారిన పడినట్లు సమాచారం. ఇది ఒకరి నుంచి మరొకరికి ఎలా వ్యాప్తి చెందుతుంది. మనకు దరిచేరకుండా ఉండాలంటే ఇతరులతో ఎలా మెలగాలి.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.  

వైరల్‌ డ్రాప్‌లెట్‌ ద్వారా వ్యాప్తి..
వైరస్‌ అనేది ఒక చిన్న సూక్ష్మజీవి. ఇది శరీరంలోని కణాలతో కలిసిపోయి తనను తాను వృద్ధి చెందుతుంది. కణం లేకుండా వైరస్‌ ఎక్కడికి వెళ్లలేదు. కాబట్టి కణాల సమ్మేళనంతో వైరస్‌ డ్రాప్‌లెట్ల(బిందువులు) ద్వారా బయటకు వచ్చినప్పుడు వైరస్‌ ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. ఈ వైరల్‌ డ్రాప్‌లెట్స్‌ ఎక్కువగా కళ్లు, ముక్కు, నోరు ద్వారా ఒక జీవి నుంచి మరో జీవికి వ్యాపిస్తాయి. 

ఎదుటి వారితో మసలుకోండిలా..
ఓ వ్యక్తి మరొకరిని కలిసినపుడు వైరస్‌ వ్యాప్తి జరగడంలో నాలుగు విషయాలు కీలక పాత్ర పోషిస్తాయి. అవి ఏంటంటే మీరు ఆ వ్యక్తికి ఎంత దగ్గరగా ఉన్నారు. ఎంతసేపు ఉన్నారు. ఆ వ్యక్తి నుంచి ఏవైనా బిందువులు మీపై పడ్డాయా. ఆ పడిన బిందువులను మీ ముఖంపై తాకడం వంటివి చేశారా. ఈ నాలుగు కారకాలు అంటువ్యాధికి సంక్రమించడానికి కీలక పాత్ర పోషిస్తాయి. కాబట్టి ఎవరినైనా కలిసినపుడు వారి నుంచి ఎలాంటి బిందువులు మీపై పడకుండా చూసుకోవడం ఎంతో ముఖ్యం. అలా పడకుండా జాగ్రత్త పడాలి. 

కనీస దూరం పాటించండి..
మనం ఎవరినైనా కలవడానికి వెళ్లినప్పుడు ఆ వ్యక్తితో కనీస దూరాన్ని పాటించాలి. ముఖ్యంగా వైరస్‌ సోకినట్లు అనుమానంతో ఉన్న వ్యక్తిని కలవాల్సిన పరిస్థితి వస్తే.. అతడికి 3 అడుగుల దూరం ఉండి మాట్లాడటం మంచిదని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధి క్రిస్టియన్‌ లిండ్‌మీర్‌ తెలిపారు. 

డ్రాప్‌లెట్ ఎన్నిరోజులు ఉంటుంది..
పరిసరాలు శుభ్రంగా ఉన్నాయా.. లేదా అనేది సమస్య కాదు. ఒక వ్యక్తి నుంచి వైరస్‌ డ్రాప్‌లెట్‌ బయటికి వచ్చినపుడు అది రెండు గంటల నుంచి తొమ్మిది రోజుల వరకు ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆ నిర్ణీత కాలంలో ఎవరైనా ఆ ప్రదేశంలో తాకితే అది వారికి కూడా సోకుతుంది. ఇందుకు హాంగ్‌కాంగ్‌లోని బుద్ధ దేవాలయం ఉదాహరణ. ఇటీవల ఆ దేవాలయానికి వెళ్లిన కొందరు వ్యక్తులు అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆరోగ్య సంరక్షణ కేంద్రం అధికారులు అక్కడికి వెళ్లి నమూనాలను సేకరించారు. అక్కడి ఆవరణలోని ఓ వస్త్రంపై కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అవడం గమనార్హం.

ముద్దులు, కరచాలనాలు వద్దు..
ఒకరినొకరు ముద్దులు పెట్టుకోవడం, కరచాలనాలు చేసుకోవడం ద్వారా వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతుంది. కాబట్టి వాటిని నివారిస్తే మంచిదని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే వెల్లడించింది. అదేవిధంగా మనం నిత్యం తినే ఆహారాన్ని బాగా వేడి చేయడం ద్వారా వైరస్‌ను నివారించవచ్చు. దాంతో పాటు కరోనా లక్షణాలున్న వ్యక్తిని ఆహార పదార్థాల్ని తయారు చేసే విభాగంలో ఉంచడం నష్టాన్ని కలుగజేసే విషయమేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

ప్రాథమిక జాగ్రత్తలపై దృష్టి పెడితే సరి..
వైరస్‌ మన దరిచేరకుండా ఎల్లప్పుడు చేతుల్ని శుభ్రపరచుకోవాలి. సబ్బుతో చేతుల్ని శుభ్రపరుచుకోవడం వల్ల వైరస్‌ బతికే అవకాశం ఉండదు. ఎక్కడ పడితే అక్కడ చేతులు పెట్టడం మానుకోవాలి. ఒకవేళ పెట్టినా ముక్కు, కళ్లు, నోటికి చేతులు తగలకుండా చూసుకోవాలి. ముఖానికి మాస్కు ధరిస్తే మంచిది. మీకు ఏదైనా అనారోగ్యంగా ఉన్నట్లు అనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. వైద్యుల సూచనలు పాటించండి. 

- ఇంటర్నెట్‌ డెస్క్

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని