ఇటలీలో ఒక్కరోజే 627 కరోనా మరణాలు..

ప్రపంచంపై కరోనా మహమ్మారి తన ప్రతాపాన్ని ఉద్ధృతం చేస్తోంది. రోజురోజుకీ మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉంది. వందల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయి దేశాలు అల్లాడిపోతున్నాయి.........

Updated : 21 Mar 2020 14:01 IST

జెనీవా: ప్రపంచంపై కరోనా మహమ్మారి తన ప్రతాపాన్ని ఉద్ధృతం చేస్తోంది. రోజురోజుకీ మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉంది. వందల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయి దేశాలు అల్లాడిపోతున్నాయి. ఇక కొత్తగా సోకుతున్న వారి సంఖ్య అదుపులో లేకుండా పోతోంది. ప్రజలు స్వీయ నియంత్రణ పాటించకపోతే దేశాలన్నీ నిర్బంధంలోకి వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడే అవకాశం లేకపోలేదు. ఇటలీలో తీవ్రత మరింత ఎక్కువైంది. శుక్రవారం ఒక్కరోజే ఏకంగా 627 మంది మహమ్మారికి బలైపోయారు. దీంతో అక్కడ మృతుల సంఖ్య 4032కు చేరింది. మరో 6000 కొత్త కేసులు నమోదు కావడంతో బాధితుల సంఖ్య 47,021కు పెరిగింది. గత మూడు రోజుల్లోనే మృతుల సంఖ్య 1500 దాటడం ఆందోళన కలిగిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా వైరస్‌ వల్ల సంభవించిన మరణాల్లో ఇటలీ వాటాయే 36.6 శాతంగా ఉంది. ఇప్పటికే ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో బయటకు రావొద్దని ప్రకటించిన అక్కడి ప్రభుత్వం ఆంక్షల్ని మరింత కఠినతరం చేయాలని యోచిస్తోంది. ఆదివారం కూడా దుకాణాలు తెరవకుండా ఆదేశాలు జారీ చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

45 రోజుల స్వీయ నిర్బంధం పాటించండి.. ఇమ్రాన్‌

దాయాది దేశం పాకిస్థాన్‌లోనూ పరిస్థితులు తీవ్రమవుతున్నాయి. శుక్రవారం మరొకరు మరణించడంతో ఇప్పటి వరకు అక్కడ మరణించిన వారి సంఖ్య మూడుకు పెరిగింది. దీంతో అప్రమత్తమైప ప్రభుత్వం ప్రజలు స్వీయ నిర్బంధం పాటించాలని విజ్ఞప్తి చేసింది. మరో 45 రోజుల పాటు ప్రజలు స్వచ్ఛందంగా నిర్బంధం పాటించాలని ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ కోరారు. సింధ్‌, కరాచీ ప్రావిన్సుల్లో కేసులు క్రమంగా పెరుగుతున్నాయ. ఇప్పటి వరకు 481 కేసులు నమోదయ్యాయి. వీటిలో ఒక్క సింధ్‌లోనే 249 కేసులు నిర్ధారణ కావడం గమనార్హం.

జింబాబ్వేలో తొలి కేసు..

జింబాబ్వేలో శుక్రవారం తొలి కరోనా వైరస్‌ కేసు నమోదైంది. ఇటీవల బ్రిటన్‌ వెళ్లొచ్చిన వ్యక్తికి వైరస్‌ సోకినట్లు నిర్ధారించారు. కరోనా పరిస్థితుల్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ.. ఆస్పత్రిలో కనీస వసతుల లేవన్న విమర్శలు వస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవలే అక్కడి డాక్టర్లు వేతనాలు పెంపు, ఆస్పత్రుల్లో మౌలిక వసతులు కల్పించాలంటూ సమ్మెకు దిగారు.

ఫ్రాన్స్‌లో 24 గంటల్లో 78 మంది...

వైరస్‌ తీవ్రత అధికంగా ఉన్న ఫ్రాన్స్‌లో గత 24 గంటల్లో 78 మంది మృత్యువాత పడ్డారు. దీంతో అక్కడి మృతుల సంఖ్య 450కు చేరింది. మరో 12,612 మందికి వైరస్‌ సోకినట్లు నిర్ధారించారు. అయితే ఈ సంఖ్య మరింత ఎక్కువ ఉండే అవకాశం ఉందన్న వాదన ఉంది. టెస్టింగ్‌ కిట్ల కొరత కారణంగా చాలా మందికి పరీక్షలు చేయలేకపోతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. దాదాపు 13,00 మంది ఐసీయూల్లో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. వీరిలో చాలా మంది 60 ఏళ్ల పైబడినవారేనని తెలుస్తోంది. 

బ్రెజిల్‌ వృద్ధి రేటు సున్నా...

బ్రెజిల్‌ ఆర్థిక వ్యవస్థపై కరోనా వైరస్‌ పెనుప్రభావమే చూపబోతోంది. ఈ యేడు దేశంలో దాదాపు సున్నా శాతం వృద్ధి రేటు నమోదయ్యే అవకాశం ఉందని అక్కడి ప్రభుత్వం అంచనా వేసింది. ఇంతకుముందు ఉన్న 2.1శాతాన్ని పూర్తిగా 0.02కు తగ్గిస్తూ శుక్రవారం ప్రకటన విడుదల చేసింది. ఇప్పటి వరకు అక్కడ వైరస్‌ వల్ల 11 మంది మరణించగా.. మరో 911 మందికి సోకినట్లు నిర్ధారణ అయింది.

యూకేలో ఆంక్షలు మరింత కఠినం..

వైరస్‌ వ్యాప్తి పెను సవాల్‌ విసురుతున్న నేపథ్యంలో ఆంక్షల్ని మరింత కఠినతరం చేసేందుకు యూకే సిద్ధమైంది. థియేటర్లు, జిమ్స్‌, రెస్టారెంట్లు, బార్స్‌, పబ్బులు, ప్రజలు అధిక సంఖ్యలో రావడానికి ఆస్కారమున్న కేంద్రాలను సైతం మూసివేయాలని ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ ఆదేశించారు. వైరస్ కట్టడి చేసేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇప్పటి వరకు యూకే వైరస్‌ బారిన పడి 177 మంది బలయ్యారు. మరో 3,269 మంది వైరస్‌ బాధితులుగా మారారు. మరోవైపు దేశంలో కార్మికులందరికీ ప్రభుత్వం అండగా ఉంటుందని ఆర్థిక మంత్రి రిషి సునక్‌ హామీ ఇచ్చారు. 80 శాతం మంది ఉద్యోగుల వేతనాలు ప్రభుత్వమే చెల్లించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.

రష్యాలో వుహాన్‌ తరహా ఆస్పత్రి...

చైనాలోని వుహాన్‌లో 10 రోజుల్లో 1000 పడకల ఆస్పత్రి నిర్మించిన తరహాలోనే రష్యా కూడా నిర్మించ తలపెట్టింది. ఇందుకు రాజధాని మాస్కోకు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతాన్ని వేదికగా ఎంచుకున్నారు. దాదాపు 3200 మంది సైనిక సిబ్బందిని రంగంలోకి దింపారు. రష్యాలో ఇప్పటి వరకు 253 మందికి వైరస్‌ సోకినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. కానీ, ఈ సంఖ్య మరింత ఎక్కువ ఉండే అవకాశం ఉందన్న విమర్శలు ఉన్నాయి.

దేశం బాధితులు  మృతులు
ఇటలీ 47,021  4,032
చైనా  81,008 3,255
ఇరాన్‌  19,644  1,433
స్పెయిన్‌  21,571 1,093
ఫ్రాన్స్‌  12,612 450
అమెరికా  18,860 230
భారత్‌  258  04
ప్రపంచవ్యాప్తంగా 2,76,113  11,402

              


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని