
ఆ దృశ్యాన్ని చూసి సిగ్గుపడాలి: కపిల్ సిబల్
ముజఫర్‌పుర్: బిహార్‌లోని ముజఫర్‌పుర్ రైల్వే ఫ్లాట్‌ఫారంపై మరణించిన తల్లిని..చిన్నారి తట్టి లేపుతూ..ఆమెపై కప్పి ఉంచిన దుప్పటిని లాగుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఆ హృదయవిదారక దృశ్యం చూపరులను కన్నీరు పెట్టించింది. ఇప్పుడు దానిపై కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ ట్విటర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నందుకు మనమంతా సిగ్గుతో తలలు దించుకోవాలని ప్రభుత్వంపై మండిపడ్డారు.
‘వలస కార్మికులను సురక్షితంగా స్వస్థలాలకు చేర్చాల్సిన బాధ్యత మనది కాదా? శ్రామిక రైళ్లలో ఆహారం, నీళ్లు, సరైన టాయిలెట్లు లేవు. పైగా బోగీలన్నీ కిక్కిరిసి ఉంటున్నాయి. ఈ క్రమంలో తల్లులు పిల్లలను కోల్పోతున్నారు. అక్కడే చనిపోయిన తల్లిని ఆ పసివాడు లేపుతున్న దృశ్యం కన్నీరు పెట్టిస్తోంది. దీనికి మనమంతా సిగ్గుతో తలలు దించుకోవాలి’ అని సిబల్ ట్వీట్ చేశారు.
లాక్‌డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన వలస కూలీలు కొందరు శనివారం గుజరాత్‌లోని అహ్మదాబాద్ నుంచి శ్రామిక్ రైలులో బిహార్‌కు బయలు దేరారు. సోమవారం ముజఫర్‌పుర్ స్టేషన్‌కు చేరుకున్న సమయంలో ఒక మహిళ(35) కుప్పకూలిపోయింది. అక్కడికక్కడే మరణించింది. తల్లి చనిపోయిందని తెలియక ఆమె మీద కప్పి ఉంచిన దుప్పటితో చిన్నారి ఆడుకోవడం సీసీటీవీలో రికార్డయింది. ఆ వీడియోను ఆర్జేడీ నేత సంజయ్ యాదవ్ ట్వీట్ చేయగా, అది వైరల్ అయ్యింది.