వారికి నా సెల్యూట్: ప్రధాని మోదీ

ప్రజాస్వామాన్ని కాపాడేందుకు అత్యయిక పరిస్థితి వ్యతిరేకంగా పోరాడిన వారి త్యాగాలను దేశం ఎప్పటికీ మరచిపోదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు....

Published : 25 Jun 2020 16:53 IST

దిల్లీ: ప్రజాస్వామాన్ని కాపాడేందుకు అత్యయిక పరిస్థితికి వ్యతిరేకంగా పోరాడిన వారి త్యాగాలను దేశం ఎప్పటికీ మరిచిపోదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. 1975 జూన్ 25న మాజీ ప్రధాని ఇందిరాగాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం అత్యయిక పరిస్థితి విధించి నేటికి 45 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అప్పటి ఉద్యమకారులకు ప్రధాని మోదీ నివాళులర్పించారు. ‘‘సరిగ్గా 45 సంవత్సరాల క్రితం దేశంలో అత్యయిక పరిస్థితి విధించారు. ఆ సమయంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి ఎంతో మంది పోరాడి, హింసను ఎదుర్కొన్నారు. వారందరికీ నేను సెల్యూట్ చేస్తున్నాను. దేశం వారి త్యాగాలను ఎప్పటికీ మరిచిపోదు’’ అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. దానితో పాటు ఆయన గతేడాది మన్‌ కీ బాత్‌లో అత్యయిక పరిస్థితి గురించి మాట్లాడిన వీడియోను షేర్ చేశారు.

ఈ సందర్భంగా హోం మంత్రి అమిత్‌ షా ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీకి పలు ప్రశ్నలు సంధించారు. ‘‘భారత దేశ ప్రతిపక్ష పార్టీల్లో ఒకటయిన కాంగ్రెస్‌ తనను తాను ప్రశ్నించుకోవాలి అంటూ.. అత్యయిక పరిస్థితి ఆలోచన ఎందుకు వచ్చింది? ఆ వంశానికి చెందిన నాయకులు ఎందుకు మాట్లాడలేరు? కాంగ్రెస్‌లో నాయకులు ఎందుకు విసిగిపోయారు? లేకపోతే ప్రజలకు ఆ పార్టీ దూరం అయిందా?’’ అని ట్వీట్ చేశారు. గత కొద్ది రోజులుగా భాజపా, కాంగ్రెస్‌ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. గల్వాన్ ఘటన తర్వాత జరిగిన అఖిలపక్ష భేటిలో ప్రధాని మాట్లాడుతూ భారత్ భూ భాగాన్ని ఎవరూ ఆక్రమించలేదని స్పష్టం చేశారు. అయితే కాంగ్రెస్‌ పార్టీ మాత్రం ప్రధాని మోదీ లక్ష్యంగా తీవ్ర స్థాయిలో విమర్శలు చేసింది. ఈ విమర్శలను అధికార భాజపా వర్గాలు తిప్పికొట్టాయి. ప్రజలు తిరస్కరించిన కాంగ్రెస్‌కు ప్రతిపక్ష పార్టీగా ఉండే స్థాయిలేదని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శించారు.

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని