85% కరోనా కేసులు 8 రాష్ట్రాల్లోనే..!

భారత్‌పై కరోనా వైరస్‌ ఉరుముతోంది.  రోజురోజుకీ నమోదవుతున్న కొత్త కేసులతో జనంలో కలవరం.....

Published : 28 Jun 2020 01:08 IST

కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్దన్‌ వెల్లడి

దిల్లీ: భారత్‌పై కరోనా వైరస్‌ ఉరుముతోంది.  రోజురోజుకీ నమోదవుతున్న కొత్త కేసులతో జనంలో కలవరం మరింతగా పెరుగుతోంది. నిన్న ఒక్కరోజే మరో 18,552 కేసులు నమోదు కావడంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 5లక్షల మార్కును దాటేయగా.. మరణాల సంఖ్య 15600కు చేరిన విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో దేశంలో కరోనా తీవ్రతపై కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్దన్‌ నేతృత్వంలోని కేంద్రమంత్రుల ప్రత్యేక బృందం సమావేశమై కట్టడి చర్యలపై సమీక్షించింది. ఈ సందర్భంగా హర్షవర్దన్‌ మాట్లాడుతూ.. దేశంలో మొత్తం యాక్టివ్‌ కేసుల్లో 85.5%, ఇప్పటివరకు నమోదైన మరణాల్లో  87% కేవలం ఎనిమిది రాష్ట్రాల్లోనే ఉన్నట్టు వెల్లడించారు. ఈ జాబితాలో మహారాష్ట్ర, దిల్లీ, తమిళనాడు, గుజరాత్‌ ,తెలంగాణ, ఉత్తర్‌ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, పశ్చిమబెంగాల్‌ ఉన్నాయని తెలిపారు. దేశంలో యాక్టివ్‌ కేసులు ఇలా..

మూడు రాష్ట్రాల్లో మరీ అధికం

మహారాష్ట్రలో ఇప్పటివరకు 1.53లక్షల కేసులు, 7106 మరణాలు నమోదు కాగా.. దిల్లీలో 77240 కేసులు, 2492 మరణాలు; తమిళనాడులో 74622 కేసులు, 957 మరణాలు నమోదయ్యాయి. దేశంలో కరోనా తీవ్రత అత్యధికంగా ఉన్న రాష్ట్రాలు ఈ మూడే. అలాగే, గుజరాత్‌లో 30వేల కేసులు రాగా.. యూపీలో 20వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. 

58%పైగా రికవరీ

 దేశంలో ఇప్పటివరకు  2,95,881 మంది కోలుకొని డిశ్చార్జి కావడంతో రికవరీ రేటు 58%పైగా నమోదైంది. అలాగే, 16,685 మంది మృత్యువాతపడటంతో మరణాల రేటు దాదాపు 3శాతంగా ఉంది. ప్రస్తుతం దేశంలో దాదాపు 1.98 లక్షల మంది బాధితులు చికిత్సపొందుతున్నారు. లాక్‌డౌన్‌ల వారీగా రికవరీ రేటు..

మరోవైపు, రాష్ట్రాలకు సాంకేతికంగా సహాయం అందించేందుకు వైద్య, అంటువ్యాధుల నిపుణులు, ఇతర ప్రత్యేక అధికారులతో కూడిన 15 బృందాలను ఏర్పాటు చేసి ఆయా రాష్ట్రాలకు కేంద్రం అందుబాటులో ఉంచనుంది. ఇప్పటికే మరో కేంద్ర బృందం గుజరాత్‌, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల్లో పర్యటిస్తోంది.

కేంద్రమంత్రి హర్షవర్దన్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కేంద్రమంత్రులు జైశంకర్‌, హర్దీప్‌సింగ్‌ పూరీ, అశ్వినికుమార్‌ చౌబీ హాజరయ్యారు. ఈ సందర్భంగా దేశ వ్యాప్తంగా కరోనా నిర్ధారణ పరీక్షలకు సంబంధించిన గణాంకాలను ఐసీఎంఆర్‌ డీజీ డాక్టర్‌ భార్గవ వివరించారు.

గడిచిన 24గంటల్లో 2,20,479 శాంపిల్స్‌ను పరీక్షించినట్టు తెలిపారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 79,96,707 శాంపిల్స్‌ పరీక్షించినట్టు వివరించారు. అలాగే, దేశంలో ప్రస్తుతం 1026 డయాగ్నోస్టిక్‌ ల్యాబ్‌లలో పరీక్షలు చేస్తుండగా.. వీటిలో 741 ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండగా.. మిగతా 285 ల్యాబ్‌లు ప్రైవేటువని తెలిపారు.

దేశంలో కరోనా పరిస్థితి ఇదీ.. (ఇన్ఫోగ్రాఫ్‌)

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని