Corona: భౌగోళిక ముప్పుగా డెల్టా వేరియంట్‌

భారత్‌లో మొదట బయటపడిన కొవిడ్‌-19 డెల్టా వేరియంట్‌ భౌగోళికంగా ప్రభావం చూపుతోందని, దానికున్న గణనీయంగా

Updated : 19 Jun 2021 13:56 IST

ఇప్పటికే 80 దేశాల్లో గణనీయంగా ప్రబలింది 
డబ్ల్యూహెచ్‌వో చీఫ్‌ సైంటిస్ట్‌ సౌమ్య స్వామినాథన్‌ 

ఐరాస/జెనీవా: భారత్‌లో మొదట బయటపడిన కొవిడ్‌-19 డెల్టా వేరియంట్‌ భౌగోళికంగా ప్రభావం చూపుతోందని, దానికున్న గణనీయంగా ప్రబలే స్వభావమే ఈ పరిస్థితికి కారణమని ప్రపంచ ఆరోగ్యసంస్థ ప్రధాన శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్‌ శుక్రవారం జెనీవాలో మీడియాకు వెల్లడించారు. డబ్ల్యూహెచ్‌వో ప్రతి వారం విడుదల చేసే కొవిడ్‌-19 నివేదికల్లో భాగంగా ఈ నెల 15 నాటి తాజా వివరాల మేరకు.. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 80 దేశాల్లో డెల్టా వేరియంట్‌ ప్రబలిందన్నారు. మరో 12 దేశాలు, ప్రాంతాల్లో బి.1.617 వేరియంట్‌ బయటపడిందని తెలిపారు. డెల్టా వేరియంట్‌ (బి.1.617.2) మొదట భారతదేశంలోనే గతేడాది అక్టోబరులో బయటపడినట్లు గుర్తు చేశారు. ఒకచోటు నుంచి మరోచోటుకు ప్రబలుతున్న వేరియంట్లతో పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నట్టు ఆమె తెలిపారు. బ్రిటన్‌లో డెల్టా వేరియంట్‌ కేసులు వారం రోజుల్లో 33,630 మేర పెరిగాయని, మొత్తం కేసుల సంఖ్య 75,953కు చేరినట్టు ‘పబ్లిక్‌హెల్త్‌ ఇంగ్లాండ్‌’ (పీహెచ్‌ఈ) చేసిన ప్రకటన వెలువడిన కాసేపటి తర్వాత సౌమ్య స్వామినాథన్‌ మీడియాతో మాట్లాడారు. యూకేలో 99 శాతం డెల్టా వేరియంట్‌ ఉన్నట్లు అక్కడి అధికారులు తెలిపారు. వివిధ దేశాల్లో, వివిధ వేరియంట్లకు వాడుతున్న పలురకాల వ్యాక్సిన్ల సామర్థ్యంపై మరింత సమగ్రంగా పరిశోధనలు జరిగి, సమచారం అందుబాటులోకి రావాలని సౌమ్య స్వామినాథన్‌ అభిప్రాయపడ్డారు. అమెరికాకు కూడా డెల్టా వేరియంట్‌తో ముప్పు ఉన్నట్టు ఆ దేశ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ డైరెక్టర్‌ రాచెల్‌ వాలెన్‌స్కి వాషింగ్టన్‌లో తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని