Supreme Court: కాలుష్య కారకం కాని టపాసులు ఉన్నాయా?

కొంతమందికి ఉపాధి దొరుకుతుందన్న ముసుగులో.. ఇతరుల జీవించే హక్కును కాలరాయడం తగదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అమాయక పౌరుల జీవించే హక్కును ..

Updated : 29 Sep 2021 19:51 IST

అవి ఉంటే, నిపుణుల కమిటీ ఆమోదిస్తే చెప్పండి

దిల్లీ: కొంతమందికి ఉపాధి దొరుకుతుందన్న ముసుగులో.. ఇతరుల జీవించే హక్కును కాలరాయడం తగదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అమాయక పౌరుల జీవించే హక్కును పరిరక్షించడంపైనే తాము ప్రధానంగా దృష్టి సారించామని పేర్కొంది. బాణసంచాపై నిషేధం కోరుతూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా జస్టిస్‌ ఎం.ఆర్‌.షా, జస్టిస్‌ ఎ.ఎస్‌.బోపన్నలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఈ వ్యాఖ్యలు చేసింది. ‘‘ఉపాధి, నిరుద్యోగిత, పౌరుల జీవించే హక్కు మధ్య సంతులనం అవసరం. కొందరికి ఉపాధి దొరుకుతుందన్న ముసుగులో.. ఇతరుల జీవించే హక్కును అతిక్రమించేందుకు మేం అనుమతించలేం. అమాయక పౌరుల జీవించే హక్కును పరిరక్షించడంపైనే మేం ప్రధానంగా దృష్టి సారించాం. కాలుష్య కారకం కాని (హరిత) టపాసులు ఉంటే.. నిపుణుల కమిటీ వాటిని ఆమోదిస్తే చెప్పండి. అందుకు తగినట్లు ఆదేశాలు జారీ చేస్తాం’’ అని ధర్మాసనం పేర్కొంది. దేశంలో చట్టాలు ఉన్నప్పటికీ.. వాటి అమలు కష్టమవుతోందని వ్యాఖ్యానించింది. అంతకుముందు, బాణసంచా తయారీదారుల సంఘం తరఫున సీనియర్‌ న్యాయవాది ఆత్మారాం నాదకర్ణి వాదనలు వినిపిస్తూ.. ‘‘దీపావళి సమీపిస్తోంది. బాణసంచా విషయంలో పెట్రోలియం, పేలుడు పదార్థాల భద్రత సంస్థ (పెసో) త్వరగా నిర్ణయం తీసుకోవాలి. టపాసుల తయారీ రంగంలో ప్రస్తుతం లక్షల మంది ఉపాధి లేకుండా ఉన్నారు. వారి దుస్థితిని పరిగణనలోకి తీసుకోవాలి’’ అని పేర్కొన్నారు. తదుపరి విచారణను న్యాయస్థానం బుధవారానికి వాయిదా వేసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని