కోర్సు ప్రారంభానికి ఏడాది ముందే విద్యార్థి వీసా

అమెరికాలో చదువుకోవాలనుకునే విద్యార్థులకు శుభవార్త. ఇకనుంచి కోర్సు ప్రారంభ తేదీకి ఏడాది ముందుగానే విద్యార్థి వీసా(ఎఫ్‌-1) కోసం వారు దరఖాస్తు చేసుకోవచ్చు.

Updated : 25 Feb 2023 09:32 IST

దరఖాస్తుకు వెసులుబాటు కల్పించిన అమెరికా
12-14 నెలల ముందునుంచి జారీ కానున్న ఐ-20 ధ్రువపత్రాలు  
అంతర్జాతీయ విద్యార్థులకు ఉపశమనం

ఈనాడు, హైదరాబాద్‌: అమెరికాలో చదువుకోవాలనుకునే విద్యార్థులకు శుభవార్త. ఇకనుంచి కోర్సు ప్రారంభ తేదీకి ఏడాది ముందుగానే విద్యార్థి వీసా(ఎఫ్‌-1) కోసం వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటివరకు కోర్సు మొదలవడానికి 120 రోజులు లేదా అంతకంటే కంటే తక్కువ సమయం ఉన్నప్పుడు మాత్రమే వీసా ఇంటర్వ్యూ కోసం షెడ్యూల్‌ చేసుకోవాల్సి వచ్చేది. నాలుగు నుంచి ఆరు నెలల ముందుగా మాత్రమే ఆయా విద్యాసంస్థలు ప్రవేశ అనుమతి కోసం ఐ-20 ధ్రువపత్రాలను జారీ చేసేవి. ఫలితంగా కొన్నిసార్లు విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తేవి. విద్యాసంస్థల నుంచి ఆలస్యంగా ఐ-20 పత్రాలు రావటం, ఇంటర్వ్యూ తేదీలు లభించకపోవటం వంటివి జరిగేవి. దీంతో ఒక్కోసారి విద్యా సంవత్సరాన్ని సైతం మార్చుకోవాల్సి వచ్చేది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ నేతృత్వంలోని సర్కారు విద్యార్థులకు ఉపశమనం కల్పించేలా తాజాగా వీసా నిబంధనలను సడలించింది. దీని ప్రకారం.. ఇకపై విద్యార్థులు తమ కోర్సు ప్రారంభ తేదీకి 365 రోజుల ముందుగా కూడా వీసా పొందవచ్చు. విద్యాసంస్థలు కూడా 12-14 నెలల ముందు నుంచి ఐ-20 పత్రాలను జారీ చేస్తాయి. అయితే విద్యార్థులు అమెరికాలో ప్రవేశించే గడువులో ఎలాంటి మార్పూ చేయలేదు. గతంలో మాదిరిగానే- తరగతుల ప్రారంభానికి 30 రోజుల ముందుగా మాత్రమే వారిని దేశంలోకి రానిస్తారు. నూతన నిబంధనలు తక్షణం అమలులోకి వచ్చినట్లు అమెరికా విదేశాంగశాఖ ప్రకటించింది. తమ దేశంలో చదువుకోవాలనుకునే విద్యార్థులు తప్పనిసరిగా స్టూడెంట్‌, ఎక్స్ఛేంజ్‌ విజిటర్స్‌ సిస్టం (ఎస్‌ఈవీఐఎస్‌)లో నమోదు చేసుకోవాలని స్పష్టం చేసింది. విద్యార్థి జీవిత భాగస్వామి అయినా, వారి మైనరు పిల్లలైనా అమెరికాలో ఉండాలనుకుంటే వేరువేరుగా ఆయా విద్యాసంస్థల నుంచి ఐ-20 పొందాల్సి ఉంటుందని తెలిపింది.

60 రోజుల్లో తిరిగి వెళ్లాలి

నిబంధనల ప్రకారం.. కోర్సు పూర్తయిన 60 రోజుల్లో విద్యార్థులు అమెరికాను విధిగా వీడి వెళ్లాల్సి ఉంటుంది. కోర్సులు పూర్తయ్యే తేదీని ముందుగానే ఆయా విశ్వవిద్యాలయాలు ఐ-20లో స్పష్టంగా పేర్కొంటాయి. తిరిగి వెళ్లిపోవటానికి ఆ తేదీనే ప్రామాణికంగా తీసుకుంటారు. అనుమతి పొందిన ప్రాక్టికల్స్‌ గడువు కూడా అందులో కలిపే ఉంటుంది. చదువుకునేందుకు అమెరికాకు వస్తున్న విదేశీ విద్యార్థుల్లో భారతీయులు ప్రస్తుతం రెండో స్థానంలో ఉన్నారు. అమెరికా నుంచి ఒక ఏడాదిలో అత్యధిక విద్యార్థి వీసాలు పొందిన రికార్డును భారత్‌ గత ఏడాది బద్దలుకొట్టిందని అమెరికా వీసా సేవల డిప్యూటీ అసిస్టెంట్‌ సెక్రటరీ జూలీ స్టఫ్ట్‌ తెలిపారు. ఈ ఏడాది ఆ రికార్డును భారతీయులు మళ్లీ తుడిచిపెట్టేసే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. మరోవైపు- తొలిసారి అమెరికాను సందర్శించే బి1/బి2 వీసాదారులు వేచి ఉండే సమయం అధికంగా ఉన్న మాట వాస్తవమేనని అమెరికా అంగీకరించింది. వారికి వేచి ఉండే వ్యవధి గడిచిన అక్టోబరులో మూడేళ్లుగా ఉంది. ఇప్పుడిప్పుడే ఆ వ్యవధి తగ్గుతున్నట్లు అమెరికా తెలిపింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని