80వేల మంది పోలీసులు ఏం చేస్తున్నారు?

పంజాబ్‌లో 80 వేల మంది పోలీసులున్నా ఖలిస్థాన్‌ అనుకూల మత బోధకుడు అమృత్‌పాల్‌ సింగ్‌ను పట్టుకోలేకపోవడం నిఘా వర్గాల వైఫల్యమేనని పంజాబ్‌-హరియాణా హైకోర్టు వ్యాఖ్యానించింది.

Updated : 22 Mar 2023 05:06 IST

అమృత్‌పాల్‌ పరారీ నిఘా వైఫల్యమే
పంజాబ్‌ ప్రభుత్వాన్ని తప్పుపట్టిన హైకోర్టు

చండీగఢ్‌: పంజాబ్‌లో 80 వేల మంది పోలీసులున్నా ఖలిస్థాన్‌ అనుకూల మత బోధకుడు అమృత్‌పాల్‌ సింగ్‌ను పట్టుకోలేకపోవడం నిఘా వర్గాల వైఫల్యమేనని పంజాబ్‌-హరియాణా హైకోర్టు వ్యాఖ్యానించింది. ఎంతో పకడ్బందీగా ప్రణాళిక రూపొందించినా నిందితుడు తప్పించుకోవడంపై అసంతృప్తి వ్యక్తంచేసింది. దీనిపై స్థాయీ నివేదికను సమర్పించాలని ఆదేశించింది. అమృత్‌పాల్‌ను పోలీసులు అక్రమంగా నిర్బంధించారనీ, కోర్టులో హాజరుపరిచేలా ఆదేశాలివ్వాలని న్యాయవాది ఈమాన్‌సింగ్‌ ఖారా దాఖలు చేసిన హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌పై జస్టిస్‌ ఎన్‌.ఎస్‌.షెకావత్‌ మంగళవారం విచారణ చేపట్టారు. పకడ్బందీ వ్యూహం ఉన్నప్పుడు నిందితుడు పోలీసుల కళ్లుగప్పి ఎలా తప్పించుకున్నాడని పంజాబ్‌ అడ్వకేట్‌ జనరల్‌ వినోద్‌ ఘాయ్‌ను ఆయన ప్రశ్నించారు. నిందితుడిని పట్టుకునేందుకు పెద్దఎత్తున రంగంలో దిగి 120 మంది అనుచరులను అదుపులోకి తీసుకోగలిగామనీ, వాహనశ్రేణిని వెంబడిస్తున్న సమయంలో సింగ్‌ మాత్రం తప్పించుకున్నాడని ప్రభుత్వం తెలిపింది.

ఆయుధాలతో వెళ్లి పట్టుకోలేకపోయారా?

పంజాబ్‌ పోలీసుల పనితీరుపై న్యాయమూర్తి అసంతృప్తి వ్యక్తంచేశారు. ‘80 వేల మంది పోలీసులు మీ దగ్గర ఉన్నారు. వారంతా ఏం చేస్తున్నారు? ఆయుధాలతో అందరూ రంగంలో దిగినా అమృత్‌పాల్‌ ఎలా తప్పించుకోగలిగాడు? అనుచరులంతా దొరికి, అమృత్‌పాల్‌ చేజారడాన్ని నమ్మలేకపోతున్నాను’ అని జస్టిస్‌ షెకావత్‌ వ్యాఖ్యానించారు. నిందితుడిపై, అతని అనుచరులపై ‘జాతీయ భద్రత చట్టం’ (ఎన్‌ఎస్‌ఏ) కింద కేసులు నమోదు చేసినట్లు ప్రమాణ పత్రంలో ప్రభుత్వం తెలిపింది. ఆపరేషన్‌ అంతా బహిరంగ స్థలంలో జరగడంతో భద్రతపరమైన కారణాలతో సంయమనం పాటించాల్సి వచ్చిందని పంజాబ్‌ ఏజీ చెప్పారు. కొన్ని సున్నితమైన విషయాలను కోర్టులో బాహాటంగా చెప్పలేమని, నిందితుడిని పట్టుకునేందుకు పోలీసుల తరఫున అన్ని ప్రయత్నాలూ జరుగుతున్నాయని స్పష్టంచేశారు. అమృత్‌పాల్‌ తమ అదుపులో లేడని, సోమవారమే నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ అయిందని ప్రభుత్వం అఫిడవిట్లో తెలిపింది. దేశం నుంచి పంజాబ్‌ విడిపోవాలంటూ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నాడని వివరించింది. నిందితుడు శనివారం తప్పించుకున్న తీరును కోర్టుకు తెలిపింది. అమృత్‌పాల్‌ తండ్రి కూడా హైకోర్టును ఆశ్రయించినా ఆయన ఈ కేసులో కక్షిదారుడు కానందున వాదనలు వినలేమని న్యాయమూర్తి తెలిపారు.

అమృత్‌పాల్‌ కేసులో నలుగురి అరెస్ట్‌

అమృత్‌పాల్‌ పరారయ్యేందుకు సహకరించిన నలుగురిని పంజాబ్‌ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఆహార్యాన్ని మార్చుకుని, నల్లని కళ్లద్దాలు ధరించి, ఓ బైకు వెనుక కూర్చొని నిందితుడు తప్పించుకున్నట్లు వారు తెలిపారు. నిందితుడిపై లుక్‌అవుట్‌ సర్క్యులర్‌ కూడా జారీ చేశారు.

12 మందిపై ఎన్‌ఐఏ ఛార్జిషీట్‌

ఖలిస్థాన్‌ అనుకూల సంస్థలతో, పాకిస్థాన్‌ కేంద్రంగా పనిచేస్తున్న కుట్రదారులతో సంబంధాలున్న 12 మందిపై ‘జాతీయ భద్రత సంస్థ’ (ఎన్‌ఐఏ) మంగళవారం మొదటి అభియోగపత్రం దాఖలు చేసింది. కెనడాలో, మరికొన్ని దేశాల్లో ఉన్న ఖలిస్థాన్‌ అనుకూల శక్తులతో వీరికి సంబంధాలున్నాయని తెలిపింది. కొందరు నాయకులు, గాయకులు, వ్యాపారవేత్తల్ని మట్టుబెట్టడం ద్వారా ప్రజల్ని భయభ్రాంతుల్ని చేయాలనే కుట్రతో ప్రమేయం ఉన్న మరో 10 మందిని ఎన్‌ఐఏ విచారిస్తోంది. నిషిద్ధ ‘ఖలిస్థాన్‌ టైగర్‌ ఫోర్స్‌’తో నిందితులకు ఉన్న సంబంధాలు ఎన్‌ఐఏ దర్యాప్తులో వెలుగుచూశాయని సంబంధిత అధికారులు తెలిపారు. పంజాబ్‌, హరియాణాల్లో వేర్వేరు చోట్ల దాచిపెట్టిన ఆయుధాలను వెలికితీసినట్లు చెప్పారు.


బైకుపై తప్పించుకువెళ్లాడు

నిందితుడు తప్పించుకునేందుకు సహకరించిన నలుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. తనిఖీల కళ్లుగప్పి బయటపడిన నిందితుడు జలంధర్‌లో ఒక గురుద్వారాకు వెళ్లి, దుస్తులు మార్చుకుని, ముగ్గురితో కలిసి బైకుపై పరారైనట్లు వీరిని విచారించినప్పుడు తేలిందని పంజాబ్‌ ఐజీపీ సుఖ్‌చైన్‌సింగ్‌ గిల్‌ వివరించారు. మొబైళ్లలో ఇంటర్నెట్‌ వినియోగంపై విధించిన ఆంక్షల్ని పంజాబ్‌లో నాలుగైదు జిల్లాలు మినహా మిగిలినచోట్ల మంగళవారం మధ్యాహ్నం నుంచి ఎత్తివేశారు. వేర్వేరు దుస్తుల్లో నిందితుడు ఎలా ఉంటాడో తెలిపే ఛాయాచిత్రాలను పోలీసులు విడుదల చేసి, అతన్ని పట్టుకోవడంలో ప్రజల సహకారాన్ని కోరారు. అమృత్‌పాల్‌ సింగ్‌ శనివారం కారులో వెళ్తున్నప్పటి సీసీటీవీ దృశ్యాలు బయటకు వచ్చాయి. కారు ముందు సీటులో నిందితుడు కూర్చొన్నట్లు కనిపిస్తోంది. పోలీసుల వేట నాలుగో రోజుకు చేరింది. సింగ్‌ పంజాబ్‌ దాటి పారిపోయి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిందితుడు ఉపయోగించిన రెండో కారును, కొన్ని దుస్తుల్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని