రూ.2వేల నోట్ల మార్పిడికి అనుమతిపై రిజిస్ట్రీ నివేదిక తర్వాతే విచారణ: సుప్రీం

ఎలాంటి అభ్యర్థన, గుర్తింపు పత్రాల్లేకుండానే రూ.2వేల నోట్ల మార్పిడికి అవకాశం కల్పించడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై అత్యవసర విచారణ జరపాలని పిటిషనర్‌ బుధవారం మరోసారి సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారు.

Updated : 08 Jun 2023 08:32 IST

దిల్లీ: ఎలాంటి అభ్యర్థన, గుర్తింపు పత్రాల్లేకుండానే రూ.2వేల నోట్ల మార్పిడికి అవకాశం కల్పించడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై అత్యవసర విచారణ జరపాలని పిటిషనర్‌ బుధవారం మరోసారి సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారు. అత్యవసర విచారణపై రిజిస్ట్రీ నివేదికను పరిశీలించాకే నిర్ణయిస్తామని జస్టిస్‌ అనిరుద్ధబోస్‌, జస్టిస్‌ రాజేశ్‌ బిందల్‌ సభ్యులుగా ఉన్న సెలవుకాలపు ధర్మాసనం స్పష్టం చేసింది. నివేదిక సమర్పించాల్సిందిగా రిజిస్ట్రీని ఆదేశించింది. న్యాయవాది అశ్వినీఉపాధ్యాయ్‌ దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను అత్యవసర విచారణ కేసుల జాబితాలో చేర్చేందుకు ఈ నెల ఒకటిన ధర్మాసనం తిరస్కరించింది. వేసవి సెలవుల్లో ఈ కేసును చేపట్టదలచుకోలేదని పేర్కొంది. అయితే, ఉగ్రవాదులు, మావోయిస్టులు, వేర్పాటువాదులు రూ.2వేల నోట్లను మార్చుకుంటున్నందున అత్యవసర విచారణ జరపాల్సిన అవసరం ఉందని అశ్వినీ ఉపాధ్యాయ్‌ బుధవారం ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పటికే రూ.80వేల కోట్ల విలువైన రూ.2వేల నోట్ల మార్పిడి జరిగినట్లు మీడియాలో వార్తలొచ్చాయని ఆయన పేర్కొన్నారు. ఇంకా ఆలస్యమైతే నల్లధనమంతా బ్యాంకులకు చేరిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ‘మీడియా వార్తల ఆధారంగా నిర్ణయాలు తీసుకోలేం. రిజిస్ట్రీ నివేదిక ఏమి చెబుతుందో చూద్దామ’ని ధర్మాసనం తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని